ప్రపంచ పటంపై జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత ఖ్యాతిని మరింత పెంచిందా?
గత ఏడాది జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ అందుకున్నప్పుడు దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది భారత్‌కు లభించిన సువర్ణావకాశం అని కొందరు, రొటేషన్ ప్రకారం భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి తప్ప అందులో ఏముంది గొప్ప అంటూ పెదవి విరిచినవారు మరికొందరు. ఇలా అందరూ విభిన్నరీతుల్లో తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మాత్రం ఎవరి మాటలను లెక్కచేయకుండా.. ప్రెసిడెన్సీ ఎలా వచ్చిందన్నది కాదు.. ఆ అధ్యక్ష బాధ్యతల్లో మనం ఏం చేశామన్నదే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్టుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలను నిర్వహించింది.
జీ-20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందక ముందే ఎంతో పక్కాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత కల్గిన దేశం భారత్ అని వారికి తెలియజెప్పింది. ఇదంతా ఒకెత్తయితే.. వర్తమాన ప్రపంచంలో భారత్ శక్తి, సామర్థ్యాలు ఏంటన్నది ఈ జీ-20 అధ్యక్ష బాధ్యతల ద్వారా చాటి చెప్పింది. వాటిలో మచ్చుకు ఓ 5 కీలకాంశాలను గమనిస్తే..
ప్రపంచ వేదికపై పెరిగిన ఆదరణ..
ఇండియా.. భారతదేశం.. అంటే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, అనారోగ్యం.. ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు మన దేశంపై ఉన్న అభిప్రాయం ఇది. కానీ గత దశాబ్ద కాలంలో ఆ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తోంది. అలాగని దేశంలో పేదరికం, వెనుక బాటుతనం నిర్మూలించేశామని అర్థం కానే కాదు. ప్రపంచానికి మన దేశంలోని బలహీనతలు మాత్రమే తెలిసే పరిస్థితి నుంచి బలాలను కూడా చాటుకునే స్థితికి చేరుకున్నాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తొణకిసలాడుతున్న దేశం. ప్రపంచ మానవ వనరుల అవసరాలను తీర్చుతున్న దేశం. గణితం, సైన్స్, వైద్యం వంటి రంగాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.
కేవలం ఉద్యోగులుగానే కాదు, అసామాన్య నాయకత్వ లక్షణాలను చూపుతూ అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈవోలుగా, అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో అమలు చేసిన సంస్కరణలు, కొత్త పన్ను విధానాల కారణంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ చేరింది. కోవిడ్-19 చైనా సహా ప్రపంచ దేశాలకు శాపంగా మారితే, భారత్ అందులో నుంచి కూడా వరాన్ని వెతుక్కుంది. అప్పటి వరకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్ల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడ్డ పరిస్థితి నుంచి అతి తక్కువ కాలంలో దేశీయ అవసరాలు తీరిపోను ఎగుమతులు చేసే స్థితికి చేరుకుంది.
అలాగే మన కంటే వెనుకబడిన దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తూ ఆయా దేశాల ఆదారాభిమానాలు చూరగొంది. అనేక ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, సరిగ్గా ఇదే సమయంలో జీ-20 ప్రెసిడెన్సీ భారత్‌కు దక్కడం మరో ఎత్తు. అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు భారత్ తన సత్తాను చాటేందుకు అత్యుత్తమ ప్రపంచ వేదికగా మార్చుకుంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యంతో నిర్మించిన కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ‘భారత మండపం’లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఒకెత్తు.. అక్కడ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మరో ఎత్తు. శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే ప్రపంచంలో ఏ దేశమూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై భారత్ కాలుమోపడం ప్రపంచ పటంపై భారత ఖ్యాతిని మరింత పెంచింది....
Sep 13 2023, 09:10