పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి లేఖ
పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి
పౌర హక్కులను కాపాడాలి
జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి లేఖ
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు న్యాయమైన, సమ్మిళిత, పారదర్శకమైన, సమానమైన భవిష్యత్తు అందించేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రగతిశీల వ్యక్తుల మధ్య సంఘీభావం, ఐక్యత, బలమైన సహకారం అవసరమని వి20 ప్రజా సమ్మిట్ ఆదివారం ‘ప్రజలు.. ప్రకృతికి సమ్మిళిత, పారదర్శక, సమాన భవిష్యత్తు’ పేరుతో విడుదల చేసిన డిక్లరేషన్‌లో ప్రస్తావించిన ఏకగ్రీవంగా ఆమోదించబడిన 20 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి వ్రాసిన లేఖలో కోరారు.
జి20 సమావేశాలు సాధారణంగా ధనిక, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రోత్సహించబడిన నయా ఉదారవాద అజెండాను ముందుకు తెస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక, పర్యావరణ, అసమానత, వ్యవసాయం, ఆహారం, జీవనోపాధి, అప్పుల బాధ, వాతావరణ మార్పు, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య తిరోగమనం వంటి సమస్యలను పరిష్కరించడంలో పదేపదే విఫలమయ్యాయని గుర్తు చేశారు. ప్రజల ప్రాధాన్యతలను తక్షణమే గుర్తించాలని డిక్లరేషన్ ప్రతిని జతపరుస్తూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
పెరుగుతున్న అసమానతలు, కార్మికులు, రైతులు, మత్స్యకారులు, దళితులు, ఆదివాసీల హక్కులను క్రమపద్ధతిలో కాలరాయడం, ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, వాతావరణ సంక్షోభం, విస్తృతమైన పర్యావరణ విధ్వంసం, అంతర్-విశ్వాసం, అంతర్-మత ఘర్షణలు, మహిళలు, లింగ విభిన్న వ్యక్తులపై హింస పెరగడం, ప్రజాస్వామ్య ప్రాంతాలు తగ్గడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే 18వ జి20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆగస్టు 18 నుండి 20 వరకు జరిగిన వి20 పీపుల్స్ సమ్మిట్‌లో ప్రజా మేనిఫెస్టో అంశాలను చర్చించేందుకు విచ్చేసిన పార్లమెంటేరియన్లు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, పౌర సమాజ ప్రతినిధులను హాజరు కాకుండా, ప్రజలు శాంతియుతంగా సమావేశమై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోకుండా అడ్డుకున్న ఢిల్లీ పోలీసుల ఏకపక్ష చర్యను తీవ్రంగా ఖండించారు. ఖాకీల దాష్టీకం ఎమర్జెన్సీని తలపిస్తోందని, ప్రైవేటు భవనాల్లో సమావేశాలు లేదా సెమినార్లు జరుపుకోవడానికి ఏ పోలీసు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని అధ్యయన, విజ్ఞాన కేంద్రం హెచ్ కేఎస్ భవన్ ఆడిటోరియంలో 70కి పైగా పౌర సమాజ సంస్థలు వ్యవసాయం, వాతావరణ సంక్షోభం, ఇంధన పరివర్తన, అంతర్జాతీయ వాణిజ్యం, బ్యాంకింగ్, కార్మికులు, సామాజిక న్యాయం, కుంచించుకు పోతున్న ప్రజాస్వామ్య ప్రదేశాలు, పెరుగుతున్న అసమానతలు, సమాచార హక్కు, డేటా, డిజిటల్ నిఘా, పట్టణ జీవితం, ప్రభుత్వ సేవల ప్రయివేటీకరణ, సంస్కృతి వంటి కీలక అంశాలపై మూడు రోజుల జాతీయ సదస్సులో తొలి రోజు ప్రశాంతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిందని, వీధి నిరసనలు, ఆందోళనలు వంటివి లేనేలేవని, రెండవ రోజు నుండి ఇండోర్ హాల్లో ప్రజాస్వామ్యయుతంగా సమావేశాలు నిర్వహించుకుంటుంటే ప్రగతిశీల శక్తులకు భయపడి సదస్సును భగ్నం చేయమని కేంద్ర ప్రభుత్వం పోలీసులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. రాజధానిలో ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించేందుకు, సెమినార్లు నిర్వహించుకునేందుకు పౌరులకు గల ప్రజాస్వామ్య హక్కులో ఢిల్లీ పోలీసుల ద్వారా జోక్యం చేసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఆపాలని, అసమ్మతి గళాలను నొక్కేసే ఇలాంటి యత్నాలు ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదు, అవాంఛనీయం కూడా అని ఖండించారు. దేశంలో ప్రాథమిక మానవ హక్కులు, పర్యావరణం, జీవవైవిధ్యం, గోప్యత సహా అన్ని రక్షణ చట్టాలకు అర్థం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేస్తే కఠినమైన చట్టాల కింద కల్పిత కేసులు పెట్టి, క్రిమినల్ విచారణల్లో ఇరికిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జీ20 సదస్సు నిర్వహణ కోసం న్యూఢిల్లీలో వేలాది మంది పట్టణ పేదలు, అట్టడుగు వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ పేదలను బలవంతంగా ఇండ్ల నుంచి వెళ్లగొట్టారనీ, బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారని, పరిహారం, సరైన పునరావాసం లేకుండా జీవనోపాధిపై దాడి జరిగిందని వాపోయారు. వారికి పునరావాసం, తగిన పరిహారం ఇవ్వాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.
దేశంలోని ఆర్థిక, ప్రకృతి సంక్షోభ సమయంలో జి20 భారతదేశ అధ్యక్ష పదవిని ప్రచారం చేయడానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో ఖర్చు చేయడాన్ని తప్పుపట్టారు. మానవ హక్కుల రక్షణకై ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత తక్షణ అవసరమని పేర్కొన్నారు.
Aug 23 2023, 19:37