త్వరలోనే పీఆర్సీ.. ఆలోగా ఐఆర్‌పై నిర్ణయం
హైదరాబాద్ :ఆగస్టు 07
అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్ PRCను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు.
ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు. ఉద్యోగస్తులంతా తమ పిల్లలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ సాధన- సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.
సింగరేణి ఉద్యోగుల కు దసరా కానుకగా రూ.1000 కోట్ల బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లను కూడా అవసరాన్ని బట్టి పెంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్ ఇటీవల ఖమ్మం సభలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామందని, వారు 4 వేలు ఇస్తే మేం రూ.5 వేలు అనలేమా? అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల మేనిఫెస్టో లో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్ మండిపడ్డారు.
‘
తెలంగాణ రాష్ట్రం తెచ్చి, భుజాన వేసుకొని అభివృద్ధి చేసినందుకే నాకు పిండ ప్రదానం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు.
ప్రజలే తగిన తీర్పు చెబుతారు’ అంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి నీళ్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నుంచి కోదాడ దాకా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు చలవేనన్నారు. రైతుల బతుకు విలువ కాంగ్రె్‌సకు తెలియదని.. కాళేశ్వరం వల్లే గోదావరి సజీవంగా మారిందని చెప్పారు.
250 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 9 ఏళ్ల క్రితం వరకు దుమ్ము రేగితే నేడు 100 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై ఓ వెకిలి, పిచ్చి పేపరు వాడు రాస్తాడని, నిలువెల్లా విషం చిమ్ముతున్నారని మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు.
కాళేశ్వరం దండగ అని మన రాష్ట్రం కాని వాడు చెబుతాడని పరోక్షంగా జేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమేనన్నారు. ఎస్పారెస్పీని నీల్గబెట్టింది బంగారు కాంగ్రెస్సేనని.. ప్రస్తుతం ఎస్పారెస్పీకీ కాళేశ్వరం నీళ్లతో పునరుజ్జీవం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ప్రస్తుతం 3 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంద్‌కు రాంరాం, కరెంట్ గోల్‌మాల్, దళితబంధు బంద్ అవుతుందని చెప్పారు. పస్తుతం భూ రికార్డులను మార్చడం సీఎం చేత కూడా కాదని చెప్పారు...
Aug 07 2023, 14:24