అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క
సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు.
అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
జీరో అవర్‌లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని చాలా మంది తమకు చెప్తున్నారన్నారు. మరి తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలా మాట్లాడేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు కానీ తాము ఒక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని విమర్శించారు. సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని సీతక్క అన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారని అడిగారు.అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ధ్వజమెత్తారు.
నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారని అన్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సభ నిర్వాహణ తీరు తమలాంటి వారికి బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిపై లఘు చర్చ ప్రారంభమైంది.
ఈ చర్చను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ముగింపు ప్రసంగం చేయనున్నారు..
Aug 06 2023, 13:26