విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ; తప్పదా ❓️
విశాఖ ఉక్కు కర్మాగారం, దాని అనుబంధ సంస్థల ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ సంస్థల్లో నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలపై నూతన విధానాన్ని రూపొందించాం.
దాని ప్రకారం వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా విభజించాం. వ్యూహాత్మకేతర రంగాలను సాధ్యమైనంత వరకూ ప్రైవేటీకరించాలని నిర్ణయించాం’’ అని మంత్రి బుధవారం లోక్‌సభలో చెప్పారు. టీడీపీ సభ్యుడు కే రామ్మోహన్ నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా... ‘‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ విశాఖ ఉక్కు కర్మాగారం ఉక్కు మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంది.
ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదు. అయితే నిర్దిష్టమైన విషయాల్లో అవసరమైనపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం.
విశాఖ ఉక్కు ఆదాయం 2020-21 లో రూ.18,080.88 కోట్లు. అది 2021-22 సంవత్సరానికి రూ.28,359.35 కోట్ల కు చేరి 2022-23లో రూ.22,809.40 కోట్లకు దిగింది. అదే సమయంలో ఈ సంస్థ నష్టాలు 2020-21లో రూ.789.10 కోట్లుండగా, 2022-23 నాటికి రూ.2,858.74 కోట్లకు చేరుకుంది.
2021-22లో రూ.913.19 కోట్ల లాభానికి చేరుకున్నప్పటికీ మళ్లీ నష్టాల బాట పట్టింది’’ అని మంత్రి కులస్తే వివరించారు.
Aug 03 2023, 13:08