CM Kcr: రైతులకు శుభవార్త.. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ..
హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీపై చర్చించారు..
రాష్ట్ర రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న కేసీఆర్.. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యల వల్లే.. రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి సమయం పట్టిందని సీఎం తెలిపారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నట్టు సీఎం వివరించారు. ఇప్పటికే పూర్తి చేసిన రుణమాఫీ పోగా .. మరో రూ.19వేల కోట్ల రుణమాఫీ సొమ్ము రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు. రైతు బంధు తరహాలో విడతలవారీ రుణమాఫీ చేస్తూ .. సెప్టెంబరు రెండో వారం నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..
Aug 03 2023, 09:09