నకిలీ పత్రాలతో బ్యాంక్‌కి టోకరా.. రూ.1 కోటితో జంప్
చిన్న చిన్న దొంగతనాలతో సంతృప్తి చెందని ఓ దొంగ.. కొడితే కుంభస్థలం కొట్టాలన్న ఉద్దేశంతో పెద్ద స్కెచ్ వేశాడు. ఏకంగా బ్యాంక్‌కే టోకరా వేయాలని నిర్ణయించుకొని, అందుకు తగినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఫైనల్‌గా తన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో.. రూ.1.28 కోట్ల రుణం తీసుకొని, బ్యాంక్‌కి శఠగోపం తొడిగాడు. కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి భారీ రుణాలు ఇస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా ఉన్న మార్టిన్ సాకో, విజయకుమార్.. తాము ఆ కంపెనీలో ఇంకా పని చేస్తున్నామని బ్యాంక్ వాళ్లను నమ్మించారు. నిజానికి.. ఆ ఇద్దరు 2019-20 మధ్యకాలంలో మాత్రమే ఆ కంపెనీలో పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. కానీ.. ఇంకా ఆ కంపెనీలోనే పని చేస్తున్నామని నకిలీ పత్రాలు సృష్టించి.. బ్యాంక్ వాళ్లకు సబ్మిట్ చేశారు. మొత్తం 44 మంది ఆ పత్రాలను తనిఖీ చేసిన తర్వాత ఆ ఇద్దరికి రూ.1.28 కోట్ల రుణం ఇచ్చారు.
ఆ పత్రాలు నకిలీవి అని తేలిన తర్వాత.. మండల మేనేజర్ సెంథిల్‌కుమార్ కొబయాషి వెంటనే మునిసిపల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ ఇద్దరికి బ్యాంక్ మేనేజర్ దండపాణి, జయప్రకాష్ నారాయణన్, అసిస్టెంట్ మేనేజర్ రాధిక సహకరించారు. వీరితో పాటు మార్టిన్ సాకో, విజయకుమార్‌లపై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మార్టిన్ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Mar 21 2023, 14:58