ఆ రాష్ట్రంలో మందుబాబులకు షాక్.. ప్రతి మద్యం బాటిల్‌పై గో సంరక్షణ పన్ను
ఇటీవల 20 ఏళ్ల పాత కారులో అసెంబ్లీకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కూ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది మందుబాబులకు కొంత వరకు నచ్చకపోవచ్చు. అదేంటంటే మద్యం అమ్మకాల్లో ప్రతి లిక్కర్ బాటిల్ పై పది రూపాయల పన్నును తమ ప్రభుత్వం విధించనుందని తెలిపారు.
అయితే ఈ పన్ను కూడా గో సంరక్షణ పన్ను కావడం మరో విశేషం. శుక్రవారం రోజున అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధానం వల్ల ఏడాదికి దాదాపు 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే జీడీపీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పన్నులు పెంచడం చర్చనీయాంశమైంది.
2021-22 మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ జీడీపీ రేటు 7.6 నుంచి 6.4 కు పడిపోయింది. హిమాచల్ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే లిక్కర్ బాటిల్ పై 2 రూపాయల గౌ సెస్ ను విధిస్తోంది. ఇందులో నుంచి వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో ఉన్న 12 జిల్లాల్లో గో సంరక్షణ కోసం వినియోగించేవారు.
అయితే సుఖ్వీందర్ సింగ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడు రాష్ట్రానికి గత పాలకులు 10 వేల కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చారంటూ చురకలంటించారు.
ప్రస్తుతం తన ముందు రాష్ట్ర ఆర్థిక సవాళ్లున్నాయని తెలిపారు. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా సబ్సీడీ ఇస్తున్నట్లు సుక్విందర్ సింగ్ ప్రకటించారు.
Mar 18 2023, 13:57