ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ఆర్మీ చీఫ్ మద్దతు.. పొలిటికల్ కెరీర్ ముగింపుగా ఆర్మీ ప్లాన్..
ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ముగింపు పలికే దిశగా అక్కడి ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సమర్థిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి పొలిటికల్ కెరీర్ ను అంతం చేయడాన్ని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమర్థించినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనకు ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసి చంపాలను ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఆర్మీ, పాకిస్తాన్ రేంజర్లు, పారామిటరీ, దర్యాప్తు సంస్థలపై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు.
ఇదిలా ఉంటే ‘తోషాఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ నెల 15న అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. చివరకు లాహోర్ హైకోర్టు కల్పించుకుని అరెస్ట్ ను వాయిదా తర్వాతి రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పరిణామాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, దీంతో దేశంలో అంతర్యుద్ధం వస్తుందా.?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి సైనిక పాలన వస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం, ఆర్మీ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ప్రజల నుంచి అనుహ్యంగా మద్దతు ఉన్న ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రజలు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ (పీటీఐ) కార్యకర్తలు అడ్డుపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడిగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆర్మీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ నిబద్ధతను కొనియాడారు.
Mar 17 2023, 19:28