వందేండ్లు బతికినోళ్ల జీన్‌తో గుండె ఏజ్ పదేండ్లు వెనక్కి
చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే ప్రొటీన్లు
అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి సైంటిస్టులు
మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాల లైఫ్ టైం పెంచే ప్రొటీన్
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మన గుండె కండరాల్లోని కార్డియో మయోసైట్స్ అనే కణాలు డ్యామేజ్ అవుతాయి. ఇలా దెబ్బతినే గుండె కణాలు మళ్లీ రికవర్ కావడం అసాధ్యం. జీబ్రా ఫిష్ వంటి వాటిలోనైతే హార్ట్ ఎటాక్ వల్ల దెబ్బతిన్న గుండె కణాల స్థానంలో కొత్తవి 20% రెండు నెలల్లోపే మళ్లీ ఉత్పత్తి అవుతాయి. మనుషుల్లో మాత్రం దెబ్బతిన్న గుండె కణాలను కొత్తవి రీప్లేస్ చేయవు. ఇక గుండె మార్పిడి చేసుకుందామన్నా .. అది చాలా కష్టం. ఒకవేళ అది చేసుకున్నా.. అమర్చిన గుండె ఎలా పనిచేస్తుందో చెప్పలేం. ఈనేపథ్యంలో శాస్త్రవేత్తల ముందున్న ఏకైక మార్గం.. మనిషి శరీర కణాలను గుండె కణాలుగా మార్చడం. వాటిని వినియోగించి దెబ్బతిన్న గుండెకు పూర్వపు శక్తిని అందించడం !! ఈ దిశగా ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల వివరాలతో కథనమిది.
మన చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే సరికొత్త పద్ధతిని అస్సాంలోని ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – గౌహతి (ఐఐటీ–జీ) పరిశోధకులు కనుగొన్నారు. 6 ప్రొటీన్లతో కూడిన ‘రీకాంబినంట్ ప్రొటీన్ టూల్ బాక్స్’ ను వారు అభివృద్ధి చేశారు. ఇవి ఆరు కూడా రీకాంబినంట్ డీఎన్ఏ టెక్నాలజీతో తయారుచేసిన రీకాంబినంట్ ప్రొటీన్లు. మనిషి చర్మ కణాల్లోకి ఈ ప్రొటీన్లను ప్రవేశపెట్టి.. వాటికి గుండె కణాల లక్షణాలు వచ్చేలా చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మ కణాల్లోకి 6 ప్రొటీన్లు వెళ్లి వాటి డీఎన్ఏను రీ వైరింగ్ చేస్తాయి. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా, గుండె కణాలుగా మారేందుకు అనువుగా ఉండేలా చర్మ కణాల లోపల మార్పులు, చేర్పులు చేస్తాయి.
మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలకు ఎనర్జీ
మస్క్యులర్ డిస్ట్రోఫీ అరుదైన వ్యాధి. దీని బారిన పడిన వారు నడవలేరు. కొంతమందికి పుట్టుకతోనే ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న ప్రతి 5వేల మంది పిల్లల్లో ఒకరు డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ సమస్యతో బాధపడుతున్నారు. శరీర కండరాలు సంకోచ, వ్యాకోచాలకు గురైనప్పుడు గాయాలు కాకుండా రక్షణ కల్పించే ప్రొటీన్లలో ‘డిస్ట్రోఫిన్’ ఒకటి. ఇది లోపించిన వారికి మస్క్యులర్ డిస్ట్రోఫీ సమస్య వస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనం అవుతాయి. చివరకు గుండె సమస్యలతో ఈ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోతుంటారు. వారి ఆయుష్షును పెంచే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ ఫర్డ్ మెడిసిన్ సంస్థ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల నుంచి సేకరించిన గుండె కణాలపై ప్రయోగాలు చేశారు. మనుషుల క్రోమోజోమ్‌ల చివరన టెలోమెర్స్ ఉంటాయి. శరీరంలో కణాల విభజనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కణాల విభజన జరిగే కొద్దీ.. టెలోమెర్స్ బలహీనపడి సైజులో తగ్గిపోతూ మనిషిలో ముసలితనానికి దారితీస్తుంది. టెలోమెర్స్ అంచుల్లో ఉండి.. వాటిని రక్షించే ఒక ప్రోటీన్ పేరు ‘టీఆర్ఎఫ్2’. ఇప్పుడు దీనితోనే మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలను సైంటిస్టులు బూస్ట్ చేశారు. వాటి జీవితకాలాన్ని పెంచి, పనితీరును మెరుగుపర్చారు.
హార్ట్ ఎటాక్
ఏటా ప్రపంచంలో ఎక్కువమంది దీనివల్లే చనిపోతున్నారు
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు1.79 కోట్ల మంది హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు విడుస్తున్నారు.
ప్రపంచంలోని హృద్రోగుల్లో 60 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు.
గత నాలుగేళ్లుగా మన దేశంలో ఏటా సగటున 28వేల మంది హార్ట్ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది దీనివల్ల చనిపోయిన ఇండియన్స్ లో 70 శాతం (19వేల) మంది 30 నుంచి 60 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం.
ఈవిధంగా భారీగా మరణాలకు కారణమవుతున్న హార్ట్ ఎటాక్ సమస్యపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి
బయటపడేసే మార్గం కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతోంది.
వందేళ్ల వారి జీన్‌తో..
గుండె వయసును తగ్గించగలిగితే.. మనిషి జీవితకాలం దానంతట అదే పెరిగిపోతుంది. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్ సైంటిస్టులు కలిసి ఈ దిశగా జరిపిన పరిశోధనల్లో ముందడుగు పడింది. దాదాపు వందేళ్లు వయసు కలిగిన కొంతమంది నుంచి సేకరించిన ఒక జీన్‌తో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. నడి వయసు, పెద్ద వయసులకు చెందిన ఎలుకల్లోకి బీపీఐఎఫ్బీ4 అనే జీన్‌ను ప్రవేశపెట్టగా.. చాలా కాలంపాటు వాటి గుండె ఆరోగ్యంలో ఎలాంటి క్షీణత రాలేదని, హార్ట్ ఎటాక్ వంటివి సంభవించలేదని సైంటిస్టులు గుర్తించారు. ఈ జీన్ ఎలుకల శరీరం లోపలికి వెళ్లి గుండె బయొలాజికల్ క్లాక్ వయసును దాదాపు పదేళ్లు తగ్గిస్తోందని వెల్లడించారు. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రయోగంలో భాగంగా ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్ సైంటిస్టులు ఈ జీన్ ను టెస్ట్ ట్యూబ్ లోని మనుషుల గుండె కణాల్లోకి ప్రవేశపెట్టారు. హృద్రోగాలతో బాధపడుతున్న వృద్ధులు, ఆరోగ్యంగా ఉన్న వృద్ధుల నుంచి సేకరించి గుండెకణాలను ఈ ప్రయోగం కోసం వాడారు. ప్రవేశపెట్టిన జీన్స్ ప్రభావంతో హృద్రోగాలు కలిగిన వృద్ధుల గుండె కణాల పనితీరు మునుపటి కంటే మెరుగుపడినట్లు తేలింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘కార్డియో వాస్క్యులర్రిసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమైంది. - V6
Feb 22 2023, 13:20