హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి.. ప్రపంచంలో మూడో వ్యక్తిగా రికార్డ్..
హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు రోగులు ఇలాగే కోలుకున్నారు. తాజాగా ఫ్రాన్స్ కు చెందిన రోగి ఈ రెండు వ్యాధుల నుంచి కోలుకున్నారు.
53 ఏళ్ల వ్యక్తికి 2008లో హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఆ తరువాత మూడు ఏళ్లకు అతను ప్రాణాంతకమైన మైలోయిడ్ లుకేమియా అనే రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. 2013లో సీసీఆర్5 అరుదైన మ్యుటేషన్ తో ఒక మహిళా దాత మూలకణాలను ఉపయోగించుకుని బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు. ఆ తరువాత పరిశీలిస్తే ఈ మ్యూటేషన్ హెచ్ఐవీ కణాలు రోగి కణాల్లోకి చేరకుండా ఆపగలిగినట్లు తేలింది. 2018లో హెచ్ఐవీకి ఉపయోగించే యాంటీరెట్రో వైరల్ థెరపీని నిలిపివేశాడు. నాలుగు ఏళ్ల తరువాత పరీక్షిస్తే అతని శరీరంలో హెచ్ఐవీ జాడ కనుగొనబడలేదని అధ్యయనం తెలిపింది.
వైద్యరంగం ఇంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ హెచ్ఐవీ వ్యాధికి నివారణ తప్పితే క్యూర్ అనేది లేదు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే హెచ్ఐవీ, క్యాన్సర్ ఉన్న సమయంలో బోన్ బ్యారో మార్పిడి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్, హెచ్ఐవీ, క్యాన్సర్ తో బాధపడుతున్న కొద్ది మంది రోగులకు మాత్రమే ఈ చికిత్స సరిపోతుంది. ఇందులో అత్యంత రిస్క్ ఏంటంటే సీసీఆర్5 మ్యుటేషన్ కలిగిన బోన్ మ్యారో కలిగిన వ్యక్తిని కనుగొనడం అని వైద్యులు చెబుతున్నారు. ఈ విధానంలో రోగి వ్యాధినిరోధక కణాలు పూర్తిగా దాత కణాలతో మార్చబడతాయి. దీంతో ఇన్ఫెక్షన్ కు గురైన కణాలు అదృశ్యం అవడంవ సాధ్యపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.
Feb 22 2023, 10:16