మరో ఐటీ సెక్టార్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు... మైగేట్ 30 శాతం మందిని...
ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో ఉంది. అయితే తాజాగా ఇండియాకు చెందిన పలు కంపెనీలు కూడా నెమ్మదిగా ఉద్యోగులను తీసేసే పనిలో ఉన్నాయి.
తాజాగా ప్రముఖ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ‘మైగేట్’ తన మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మందిని తొలగించింది. బెంగళూర్ కు చెందిన ఈ స్టార్టప్ మిడ్ మేనేజ్మెంట్, జూనియర్ రోల్స్ లో ఉన్నవారిని ఉద్వాసన పలికింది. ఈ సంస్థలో మొత్తం 600 మంది ఉద్యోగులు ఉంటే 400 మందికి తగ్గించింది. గత డిసెంబర్ లో కూడా మైగేట్ ఇదే విధంగా కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి రెండు నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది.
2016లో విజయ్ అరిసెట్టి, వివైక్ భరద్వాజ్, శ్రేయాన్స్ దాగా, అభిషేక్ కుమార్ లు ‘మైగేట్’ను స్థాపించారు. అపార్మెంట్ల భద్రతాకు సంబంధించిన పలు సేవలను ఈ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. పెట్టుబడులు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలోని చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. బైజూస్, కార్స్ 24, ఓఎల్ఎక్స్, ఎంపీఎల్, ఉడాన్, అన్ అకాడామీ, వేదాంతు, ఓయో, లీడ్, ఓలా వంటి భారతీయ స్టార్టప్స్ 2022 నుంచి ఇప్పటి వరకు 22,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
Feb 21 2023, 14:03