TG: మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
మెదక్ జిల్లా:
క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ ప్రఖ్యాత మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప చర్చ్ గా గుర్తింపు పొందిందని అన్నారు.
వందేళ్ల కిందట కరవు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహారం పథకం కింద భోజనం పెట్టి, చర్చి నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేటి ఉపాధి హామీ పథకానికి అదే స్ఫూర్తి ఉందని అన్నారు. చర్చి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని అన్నారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ఎనలేని సేవలు అందించాయని సిఎం కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్,ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
Dec 27 2024, 15:23