NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, డీఎస్పీ శివరాం రెడ్డి సూచనల మేరకు, నేడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో,  పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు.

1) ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు  ప్రతి విగ్రహాన్ని విధిగా ఆన్లైన్ చేసుకోవాలని, ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని విగ్రహాన్ని ఆన్లైన్ చేసుకోవడం వల్ల పోలీస్ వారు ప్రతి రోజు రాత్రి పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జియో టాగ్ చేసి, నిఘా పెడతామని  తెలిపారు. 
2)మండపాలను రోడ్ కి అడ్డంగా నిర్మించటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మండపాలను నిర్మించుకోవాలి.
3)ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సంప్రదించి, వారి వద్ద నుండి పర్మిషన్ తీసుకుని, తగు జాగ్రత్తలు పాటిస్తూ, మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3)నిమజ్జనం రోజు గణేష్ మండపాల నిర్వాహకులు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి.
4)DJ లకు పర్మిషన్ లేదు. సౌండ్ బాక్స్ లకు కూడా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఒక వేళ DJ లు పెట్టినట్లయితే అట్టి DJ లను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
5)తప్పనిసరిగా మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లడ్డు విషయంలో దీపం విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు. 

అదే విధంగా ప్రతి గణేష్ మండపం వద్ద భక్తి భావం పెంపొందించేలా, సమాజ వికాసానికి సంబంధించిన వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అంతేతప్ప రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని అసభ్యకరంగా ఉండే పాటలు డాన్సులు చేయవద్దు అని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఐ సందీప్ రెడ్డి, ఎస్.ఐ శంకర్, ఎస్.ఐ సైదులు, సురేష్, వార్డు కౌన్సిలర్లు సమద్, అభిమన్యు, శ్రీను, కంకణాల నాగిరెడ్డి, పూజిత శ్రీను, బాబా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సంపత్, హషం, నర్సిరెడ్డి, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంధర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్  మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా సంస్కరణల రూపశిల్పి అని ఆయన సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవి,స్టాఫ్ క్లబ్ సెక్రటరీ జి.బాగ్య లక్ష్మి,యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యన్.కోటయ్య , యమ్. వెంకటరెడ్డి,  ఏ.మల్లేశం, అనిల్ కుమార్,యమ్. సావిత్రి, కళాశాల బోధనా బోధనేతర సిబ్బంది,యన్ యస్ యస్ వాలంటీర్స్ మరియు విద్యార్దిని విద్యార్దులు   పాల్గొన్నారు.
NLG: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ
హైస్కూల్ కు చెందిన హిందీ స్కూల్ అసిస్టెంట్ ఎస్కే సలీం 2024-జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని, జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును ప్రకటించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన ఇవాళ ఉపాధ్యాయుడు సలీం కు సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పాఠశాలలో విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్
సూర్యాపేట జిల్లా:
ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్ లు మొత్తం రూ.5,44,000/- విలువ గల వస్తువులు సీజ్ చేశారు.

4 చైన్ స్నాచింగ్ కేసులు, 10 బైక్ దొంగతనం కేసులు ఛేదించిన తిరుమలగిరి పోలీస్, CCS సిసిఎస్ పోలీసులు.

3.95 లక్షల విలువగల 13 బైక్స్, 1.49 లక్షల విలువగల 3.7 తులాల బంగారు ఆభరణాలు సీజ్, ఇద్దరు నిందితుల రిమాండ్
TG: గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్.. ఇక అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రక్షాళన
ఇప్పటి వరకు గురుకులాలు అంటే కులం, మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహ ప్రజల్లో అయితే.. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కులం, మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని డిమాండ్ వస్తుండడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇండిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై స్టూడెంట్స్, పేరెంట్స్, విద్యావేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఏకపక్షంగా విధానాలు రూపొందించి, పిల్లలపై రుద్దడం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విస్తృతంగా అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు 55 ప్రశ్నలతో కూడిన క్వశ్చనేర్‌ను రూపొందించింది. ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా గురుకులాల్లో వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ప్రస్తుతం రెసిడెన్సియల్ స్కూల్స్‌లో ఉన్న సిస్టమ్‌ పై సమగ్రంగా ఆధ్యయనం చేస్తుండగా.. ముందుగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలపై ఆరా తీస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,024 గురుకులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్సియల్) ఉండగా, అందులో కేవలం 324 గురుకులాలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా స్కూల్స్ ప్రైవేటు భవంతుల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో దశలవారీగా అన్ని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో గురుకులం కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నది. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో క్లాస్ రూమ్స్, లైబ్రరీ, మోడ్రన్ డైనింగ్, కిచెన్, రీడింగ్ టెబుల్స్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది.

ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి దాదాపు రూ.70 కోట్ల వరకు అద్దె పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. త్వరలో వాటిని క్లియర్ చేసి, ఆ బిల్డింగ్స్‌లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఓనర్లకు టార్గెట్ పెట్టనుంది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం, బెడ్స్, దోమల బెడదను ఆరికట్టేందుకు రెగ్యులర్‌గా ఫాగింగ్, కిటికీలకు జాలీల ఏర్పాటుకు ఆదేశించనున్నారు. పాములు సంచరించకుండా, పరిసరాలను క్లీన్ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపనున్నారు. అలాగే సొంత బిల్డింగ్స్ ఉన్న గురుకులాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు రంగంలోకి దిగనున్నారు. అందుకోసం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలతో నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతున్నారు. ప్రస్తుతం 5,6,7 క్లాస్ స్టూడెంట్స్‌కు రోజుకు రూ.31.6 పైసలు అందిస్తుండగా.. 8,9,10 చదవుతున్న పిల్లలకు రూ.36.66 పైసలు, ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్‌కు రూ.50 ఖర్చు చేస్తున్నారు. ఈ చార్జీలతో టిఫిన్, లంచ్, డిన్నర్, వారంలో రెండుసార్లు నాన్ వెజ్ అందించడం కష్టంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. అందుకని త్వరలో మెస్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి పౌష్ఠికాహారం అందించేందుకు ఎంత మేరకు మెస్ చార్జి ఇవ్వాలనే ఆంశంపై ఆరా తీస్తున్నది.

విస్తృత అభిప్రాయాల మేరకే గురుకులాలను ప్రక్షాళన చేస్తాం. ఏకపక్షంగా నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించదు. పిల్లలకు సరైన విద్యతోపాటు, ఆధునిక వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రస్తుత అకడమిక్ ఇయర్ నుంచే గురుకులాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆ వర్గం, ఈ వర్గం అనే తేడా లేకుండా ఆడ్మిషన్ కోసం స్టూడెంట్స్‌ను చేర్చుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పెండింగ్‌లో ఉన్న అద్దెలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే అన్నిరకాల సౌకర్యాలు అందించాలని ఓనర్లను ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
TG: రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పాలకులుగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపిక
HYD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్, గ్రంథ పాలకులు, డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రాష్ట్ర స్థాయి కళాశాల ఉన్నత విద్య ఉత్తమ గ్రంథపాలకునిగా ఎంపిక అయ్యారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తమ అధ్యాపకుల అవార్డు లలో భాగంగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్  ఎంపికయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా గురువారం 5 వ తేదీ రవీంద్ర భారతిలో ఉత్తమ గంధ పాలకుడు అవార్డు తీసుకోబోతున్నారు.

దుర్గాప్రసాద్ గత 11 సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ లో (2018-2024) దాదాపుగా 63 వేల పుస్తకాలు నిర్వహణ, 55 పత్రికల నిర్వహణ, ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ, మరొక ఐదు సంవత్సరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అటానమస్ లో (2013-2018) కళాశాల గ్రంథ పాలకులుగా 53,000 పుస్తకాలు, 45 పత్రికలు, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కళాశాల అనుబంధ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ విద్యార్థులకు అందించారు.

గ్రంథాలయ నిర్వహణ, పుస్తకాల ఎంపిక, జర్నల్ లు, మ్యాగజైన్ లు నిర్వహణ, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, గ్రంథాలయ అభివృద్ధి గ్రంథాలయ వనరులు, గ్రంథాలయ సేవలు, పరిశోధన విధానం, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై మూడు పుస్తకాలు ప్రచురణ, రాష్ట్రస్థాయి జాతీయస్థాయి సెమినార్లు, వేబినార్లు , వర్క్ షాప్ లో నిర్వహణ, రిసోర్స్ పర్సన్ గా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ప్రజెంటేషన్, 42 పరిశోధన వ్యాసాలు,  ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాక్ ద్వారా విద్య ఉద్యోగ సమాచారం సమాజాభివృద్ధి కోసం , విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సేవ చేయడం ద్వారా పనిచేస్తున్న కళాశాలల విద్యార్థులతో పాటు, విద్యార్థుల ప్రగతిని రికార్డ్స్ లో మరియు గూగుల్ ఫామ్స్ లలో నిర్వహణ , రాష్ట్రంలో దేశంలో వివిధ స్థాయిలలో వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ ద్వారా ఒకరోజులో 24 గంటలలో, రౌండ్ ద క్లాక్, ఎప్పుడైనా, ఎక్కడనైనా, అకాడమిక్ రీసెర్చ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమాచారాన్ని 7 లక్షల మందికి పైగా, 144 దేశాల పాఠకులు ఉపయోగించుకున్నారని తద్వారా. ఎంతోమంది విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం తోడ్పడ్డారని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సమాచార వనరులు సామాజిక మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ద్వారా విద్య ఉద్యోగ సమాచార వనరులను అందించడంలో, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిసోర్స్ పర్సన్ గా ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై అధ్యాపకులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, గ్రంథాలయ సమాచార సేవ చేసినందుకు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథపాలకుని అవార్డుకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్న   ప్రభ  తెలిపారు.

ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవాళ బాధితులకు మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ అందజేశారు.

పిట్టల చిన్న తిమ్మయ్య కు రూ. 30 వేల రూపాయలు,  గ్యార యాదయ్య కి 30 వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదలకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాస నీలమ్మ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి వెంకట పేట బాలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు పొనుగుంటి శేఖర్, కోడాల అల్వాల్ రెడ్డి, జానయ్య, గ్యార వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్ జి కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పురస్కారాలు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ బుధవారం తెలిపారు. వాణిజ్య శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ర్యాక శ్రీధర్ మరియు రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అనిల్ అబ్రహం  లకు అవార్డులు లభించాయని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం నుండి ఉత్తర్వులు అందినట్లు తెలిపారు.

ఈ ఇద్దరు అధ్యాపకులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు.

ఈ సందర్బంగా అవార్డు పొందిన అధ్యాపకులను వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, వాణిజ్య శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. జె. నాగరాజు, డా. అంతటి శ్రీనివాస్, పరిపాలన అధికారి డి. శ్రావణి, ప్రజా సంబంధాల అధికారి డా. వెల్డండి శ్రీధర్, ఇతర అధ్యాపకులు ఎ. మల్లేశం, డా.మునిస్వామి, డా. కిరీటం, తదితరులు అభినందించారు.
గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి: మునుగోడు ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గంలో గంజాయి అనేది కనిపించవద్దని గంజాయి నిర్మూలించడానికి పోలీసులు నిబద్దతతో పని చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు.బెల్ట్ షాపుల నిర్మూలన,గంజాయి వాడకంపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు,గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని,అవసరమైతే దోషులను అరెస్టు చేసి జైల్లో కి పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా  యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఎవరు పాల్పడిన సహించేది లేదని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు మునుగోడు సర్కిల్లో  బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై 30 కేసులు నమోదు చేశామని, 105 మందిని బైండోవర్ చేశామని  పోలీసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బెల్ట్ షాపు ల నిర్మూలనకు  కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

మునుగోడు నియోజకవర్గానికి గంజాయి ఎక్కడినుండి వస్తుందో వాటి మూలాలను తెలుసుకుని, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ నిర్మూలిస్తూనే  గంజాయికి అలవాటైన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ  గంజాయి బారిన పడకుండా చూడాలని అన్నారు.
NLG: ఎన్ జి కళాశాలలో డిగ్రీ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి దశ అడ్మిషన్ల  కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ విడుదల అయినట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 4 వ తేది నుంచి 9 వ తేది లోపు దోస్త్ వెబ్ సైట్ లో రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

దివ్యాంగులు, ఎన్ సి సి, స్పోర్ట్స్, అదనపు సహపాఠ్యంశాలలో ప్రతిభ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్ ఆప్షన్లు  ఈ నెల 9 వ తేదీ లోపు ఇవ్వాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా 9 వ తేదీనే  ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ఈ నెల 11 న జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 13 వ తేదీ లోపు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని సీట్లు పొందని వారు మరియు రిజిస్ట్రేషన్ చేయించుకోనివారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.