నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హన్మకొండ లో రోడ్ షో నిర్వహించనున్నారు.

ఆదివారం సాయంత్రం నగరానికి చేరుకునే కేసీఆర్.. నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.

అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదు గా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు...

నేడు హైదరాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవాళ హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు

సీఎం రేవంత్‌ రెడ్డి.అనం తరం రాత్రి మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు..

దక్షిణాదిలో దంచికొడుతున్న ఎండలు..

weather Report: దక్షిణాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓవైపు.. ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జనాలను ఎండ వేడికి ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవసరమైతేనే బయటికి రావాలని.. వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో వేడిగాలుల వీస్తాయని.. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి, జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.

ఎండ వేడిమికి అల్లాడుతున్న సాధారణ జనాలు ఓవైపు అయితే... సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి జనాలు రాక.. పార్టీల నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి... పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ... ప్రచారాలు ముమ్మరం చేయాల్సిన సమయంలో.. ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. వీలైనంత వరకూ పార్టీలు సైతం.. ఉదయం.. సాయంత్రం మాత్రమే ప్రచారాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.

సౌత్ మొత్తంలో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేరళలో హీట్‌వేవ్ ఎక్కువగా ఉండటంతో.. పాలక్కాడ్‌, మలప్పురం, అలప్పుజా నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు మృతిచెందారు. ఎండ వేడి తట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. 48 డిగ్రీలు ఎండ, వేడిగాలులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

అమరావతి: పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్‌ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు..

సీఎం జగన్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు..

గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడే బైఠాయించి సీఎస్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం.. పింఛను పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా? అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. తెదేపా నేత దేవినేని ఉమా, జనసేన నేత శివశంకర్‌, భాజపా నేత లంకా దినకర్‌ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు..

ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ..

అమరావతి: సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు..

ఈ మేరకు జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు..

''మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ తరఫున ఇదే మా డిమాండ్‌'' అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు..

రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాపాడుకోవాలి: చంద్రబాబు

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు..

జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు. ''గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీసేశారు. గాయం కపడిందా?'' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

'' సీఎం జగన్‌ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి.. గోదావరిలో కలిపారు. వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ నెరవేరిందా? రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైకాపా మేనిఫెస్టోలో లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ పైనే. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేస్తా. తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.15 వేలు ఇస్తా. ఆత్మకూరు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్‌ నొక్కండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను మార్చబోతున్నాయి.

మేం వస్తే అభివృద్ధి.. వైకాపా వస్తే అరాచకం. మా పాలన స్వర్ణయుగం.. వైకాపా పాలన రాతియుగం. సీఎం జగన్‌ ఇవాళ చేతులెత్తేశారు. వైకాపా మేనిఫెస్టోతో పోలిస్తే.. మా మేనిఫెస్టో సూపర్‌ సక్సెస్‌. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్‌. నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు. వైకాపా మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్‌. తమ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని అన్నారు. అందులో హామీలను నెరవేర్చారా?మద్య నిషేధం చేస్తానన్న హామీ ఏమైంది? స్వార్థం కోసం మహిళల తాళిబొట్లు తెంపేసిన వ్యక్తి జగన్‌'' అని చంద్రబాబు విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితుడు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లో బీఆర్ ఎస్ పార్టీ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కేసీఆర్ కు అత్యంత సన్ని హితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి శనివా రం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరగా, అతనికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...

చట్టపరమైన భద్రత లేకనే బీసీ సామాజిక వర్గాల పై దాడులు : పాలకూరి రవి

చట్టపరమైన భద్రత లేని కారణంచేత బీసీ సామాజిక వర్గాల పై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థులు పాలకూరి రవి పాలకూరి రమాదేవి..

నల్గొండ పార్లమెంటు నుండి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతూ..

బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని మన ఓటు మనం వేసుకుంటేనే పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తుందని నల్గొండ పార్లమెంటు నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో న నిలబడడం జరిగిందని అన్నారు..

వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలను జెండాలు మోయిస్తూ తమ దగ్గర బానిసల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రశ్నించినటువంటి కార్యకర్తలపై కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి గడగోజు విజయ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దొరేపల్లి హరిశంకర్, పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీశైలం యాదవ్,మాదగోని శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

AP Election : కొత్త స్కీం లేదు మెరుపులు లేవు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు..

మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలు ఉంటాయని వైసీపీ క్యాడర్ ఎక్స్ పెక్ట్ చేసింది. శ్రేణుల ఆశలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నీళ్లు చల్లారు..

లేని జనాకర్షక పథకాలు

మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు లేకపోవడంతో శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త పథకాలు, జనాలను ఆకర్షించే పథకాలు లేకపోవడంపై క్యాడర్‌లో నిర్వేదం నెలకొంది. కూటమి ఇచ్చిన హామీలతో పోలిస్తే తమది మేనిఫెస్టోనేనా అనే సందేహాం కలుగుతుందని కొందరు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో ఏడాదికి రూ.2 వేల మాత్రమే పెంచారు. రూ.500 పెన్షన్ పెంచడానికి 5 సమయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ రెండు అంశాలతో తమ పార్టీ పని అయిపోయిందని క్యాడర్ కాస్త ఆగ్రహంతో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దాంతో ఆ ఓటర్లను తమ పార్టీ కోల్పోతుందని వివరిస్తున్నారు..

అదిరిన కూటమి మేనిఫెస్టో

కూటమి మేనిఫెస్టోలో 50 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. దివ్యాంగులకు రూ.6 వేలు అందజేస్తామని స్పష్టం చేసింది. ఆ రెండు ప్రకటనలు బాగున్నాయని వైసీపీ ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. తమ పార్టీ మాత్రం సోసోగా మేనిఫెస్టో రూపొందించినట్టు ఉందని మండిపడ్డారు. మూడు రాజధానులపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తామని ప్రకటించడంపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇది జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. మేనిఫెస్టోలో చంద్రబాబు గురించి ప్రస్తావించడం, ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పడం తప్ప.. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఉన్న పేరు కాస్త పోతుందని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు..

టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.