NLG: టి జి సి జి టి ఏ నూతన డైరీ ఆవిష్కరణ

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గేజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ అడ్మిషన్ క్యాంపెయిన్ పోస్టర్ మరియు నూతన డైరీ ఆవిష్కరణ, ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ గన్ శ్యామ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ.. సంఘ సభ్యులకు ఈ డైరీ ఎంతో ఉపయోగకరమని, దీనిలో సంఘ అధ్యాపకులకు సంబంధించిన విలువైన జీవోలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. ప్రతి ప్రాథమిక సభ్యునికి ఎంతో ఉపయుక్త కరంగా ఈ నూతన డైరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ సయ్యద్ మునీర్, వైస్ ప్రెసిడెంట్, టి భాస్కర్ రెడ్డి, యూనివర్సిటీ కోఆర్డినేటర్ యాదగిరి రెడ్డి సభ్యులు నరేష్, స్వామి, మంజుల, అపర్ణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కోసం 2 కే రన్.

నల్లగొండ: ఆర్థికపరమైన అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం, ఆర్ బీ ఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ భారియా తెలిపారు. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ఏర్పాటు చేసిన 2 కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతోపాటు, ప్రతి ఒక్కరిని ఆర్థిక అంశాల పట్ల సాధికారత కల్పించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈనెల 26 నుండి మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యువతపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతున్నదని, ప్రజలు బ్యాంకు కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు, బ్యాంకు ఖాతాను ఎలా ప్రారంభించాలి? ఏదైనా అనుమానాస్పద నంబర్ నుంచి మెసేజ్ లేదా కాల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చేపట్టే చర్యలు, తదిత అంశాలపై ఈ వారోత్సవాలలో వివరించడం జరుగుతుందని తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం చేస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఈ వారం రోజుల పాటు ,అన్ని బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఎస్ బి ఐ రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, ఎల్డీఎం శ్రామిక్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి కరుణాకర్ ,యూబీఐ చీఫ్ మేనేజర్ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

TS: ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలి: సీఎం రేవంత్ రెడ్డి

నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ ర‌వాణా అరిక‌ట్టాలి

వాణిజ్య ప‌న్నులు, రిజిస్ట్రేష‌న్ శాఖకు సొంత భ‌వ‌నాలు ఉండాలి

స‌మ‌గ్ర‌మైన ఇసుక విధానంతో అక్ర‌మాల‌ను అడ్డుకోవాలి

గ‌నుల శాఖ విధించిన జ‌రిమానాలు వ‌సూలు చేయాలి

ఏళ్లుగా తిష్ట‌వేసిన అధికారుల‌ను బ‌దిలీ చేయాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

HYD: ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. 

వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది వ‌ర‌కు జీఎస్టీ ప‌రిహారం కింద రూ. 4 వేల కోట్ల‌కుపైగా చెల్లించేద‌ని, దాని గ‌డువు ముగియ‌డంతో ఆ నిధులు రాక‌పోవ‌డంతో రాబ‌డిలో వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించిన లెక్క‌లు తేడాలు ఉంటున్నాయ‌ని, ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి డిస్ట‌ల‌రీ వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. 

మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చి వాటిని ట్రాకింగ్ చేయాల‌ని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాల‌ని, మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాలు వే బిల్లులు క‌చ్చితంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌తో పాటు గ‌తంలో న‌మోదు చేసిన ప‌లు కేసుల పురోగ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. 

రిజిస్ట్రేష‌న్ల శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంలో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు, జిల్లా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే స‌మ‌యంలో త‌మ‌ శాఖలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ టి.కె. శ్రీ‌దేవి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్య‌మంత్రి ఆదాయాన్ని తెచ్చే శాఖల‌కు సొంత భ‌వ‌నాలు లేక‌పోవ‌డం స‌రికాద‌ని, ప్రస్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న భ‌వ‌నాలు నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌రాల‌కు అనుగుణంగా హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. 

హైద‌రాబాద్‌తో పాటు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై కంక‌ర కుప్పలుగా పోసి విక్ర‌యిస్తున్నార‌ని, అలా కాకుండా న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ప్ర‌భుత్వ స్థ‌లాలను అందుకు వినియోగించాల‌ని పేర్కొన్నారు. 

ఇసుక విక్ర‌యాల‌పై స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే బిల్లుల‌తో పాటు ఇసుక స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు ట్రాకింగ్ ఉండాల‌ని, అక్రమ ర‌వాణాకు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకుగానూ ప‌లు గ‌నుల‌పై గ‌తంలో జ‌రిమానాలు విధించార‌ని, కేసులు న‌మోదు చేశార‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. విధించిన జ‌రిమానాల‌ను వెంట‌నే వ‌సూలు చేయాల‌ని ఆదేశించారు. గ‌తంలో జ‌రిమానాలు విధించి త‌ర్వాత వాటిని త‌గ్గించార‌ని, అందుకు కార‌ణాలు ఏమిటో తెలియ‌జేయాల‌ని, దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. 

టీఎస్ ఎండీసీతో పాటు గ‌నుల శాఖ‌లో ప‌లువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల త‌ర‌బ‌డి తిష్ట వేశార‌ని, కొంద‌రిపై ఆరోప‌ణ‌లున్నాయ‌ని, వారిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

NLG: దారుణం.. అన్నను చంపిన తమ్ముడు

నల్లగొండ జిల్లా: 

శాలిగౌరారం: మండలంలో అన్నను తమ్ముడు చంపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పెరిక కొండారం గ్రామానికి చెందిన చర్లపల్లి రాంబాబు, చర్లపల్లి నవీన్ అన్నదమ్ములు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రాంబాబును అతని తమ్ముడు ఇవాళ మధ్యాహ్నం కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: రోడ్డు పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలి

నల్గొండ జిల్లా, నేరేడు గుమ్మ మండలం లో గత ఆరు నెలల క్రితం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద శాంక్షన్ అయినటువంటి రోడ్లను పేర్వాల నుండి పందిరిగుండ తండా వరకు, మెటల్ కంకర పరిచి, రోడ్డు పని పూర్తి చేయక పోవడం వల్ల, గత సంవత్సరం నుండి స్థానికంగా గ్రామస్తులు రోడ్డుపై వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

టూ వీలర్ వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైతులు వెళ్లేందుకు రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేసి, ఆర్ అండ్ బి అధికారులు మరియు రోడ్డు కాంట్రాక్టు ప్రజలకు పూర్తిస్థాయిలో రోడ్డు సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

SB NEWS

NLG: రైతు మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి: మేడి ప్రియదర్శిని

కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్ అనే రైతు మరణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రైతుల పై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాడి చేసి రైతులను చంపడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. ఫిబ్రవరి 21న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతాంగం పై పంజాబ్, హర్యానా సరిహద్దు ఖీ నౌరి వద్ద రైతాంగం పై పోలీసు యంత్రాంగం జరిపిన పాశావిక దాడులలో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి సంతానం సంతాపాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

పోలీస్ కాల్పుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి, పోలీసు కాల్పుల్లో క్షత్రగాత్రులైన రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి వారిని ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందని అన్నారు.

TS: బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది ఎంక్వైరీ లో తెలుసుకుని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలం ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

NLG: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ నియామకం పట్ల హర్షం

నల్లగొండ జిల్లా:

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కే. శ్రీనివాస్ రెడ్డి ని నియమించడం పట్ల, నాంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి మండలం ప్రెస్ క్లబ్ కార్యదర్శి గాలెంక వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.

TS: ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

HYD: ధరణి లో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. అప్పుడు కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. 

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు. 

భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు.

TS: సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నాయకులు

తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జి.ఏడి ఆదేశాలను అనుసరించి ప్రణాళిక బద్ధంగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బి. శ్యామ్, ఉపాధ్యక్షులు ఏ.జగన్మోహన్ రావు, కోశాధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఏ. పరమేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధి జి.దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం. రామకృష్ణ గౌడ్, కార్యనిర్వాహక సభ్యుడు పి.యాదగిరి గౌడ్, సలహాదారులు టి.రవీందర్ రావు, జి. పురుషోత్తం రెడ్డి, వి. సురేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లలో ఒకటైన సత్వరమే పార్లమెంట్ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని వారు కోరారు. ఈ - కుబేరు లో ఉన్న బిల్లుల విడుదల, పెండింగ్లో ఉన్న డిఏ ఎరియల్స్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.