Daggubati Purandeswari: పవన్‌ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు: పురందేశ్వరి

విజయవాడ: జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు..

ఈ సందర్భంగా పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

''పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. భాజపా అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని పవన్‌ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. పొత్తుల విషయం అధినాయకత్వమే చూసుకుంటుంది.

చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత భాజపానే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ భాజపా నేతలు ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది'' అని పురందేశ్వరి అన్నారు.

2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం:- రాజా సింగ్

హైదరాబాద్:-టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.

చంద్రబాబు అరెస్ట్ తప్పని ఆరోపించారు.

‘ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు అంటే భయం.. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు.. చంద్రబాబును ఎంత తిట్టిన , ఎంత ఇబ్బందులకు గురిచేస్తే.. అంత ఎదుగుతాడు.. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు.. ప్రజా సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లాడు.

అతనిపై పెట్టిన కేసు కోర్టు కొట్టివేస్తుందని ఆయన అన్నారు.

ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

•మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

•యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నారని శనివారం అడిషనల్ కలెక్టర్ అడిషనల్ విద్యాధికారులకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ కార్మికులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ అనేక పోరాటాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి 2022 మార్చి 15న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనంకు అదనంగా ₹2000/ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు.

జీవో నెంబర్ ఎంఎస్ 8 విడుదల చేశారు. కానీ నేటికీ అవి అమలు కాలేదని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, పెంచిన గౌరవ వేతనానికి బడ్జెట్ విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త మేనకు మరియు ఉదయం టిఫిన్ కు బడ్జెట్ కేటాయించి కార్మికులకు కనీస వేతనం ₹26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

కార్మికులు వంట చేసే సమయంలో ఏదైనా ప్రమాదాలకు గురి అయినట్లయితే వారికి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యాలు లేవని పోస్టల్ బీమా యోజన పథకం కింద ప్రతి కార్మికుడికి ప్రభుత్వము భీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు అట్లాగే ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు, వంటకు సరిపడా గ్యాస్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, ప్రభుత్వం ప్రోసిడింగ్ ఆర్డర్స్, గుర్తింపు కార్డులు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు ₹25/ రూపాయలు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో వంట బంధు చేసి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగోని యాదమ్మ, మేడి సైదులు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ నాయకులు ఇండ్ల రేణుక, చెరుపల్లి సత్తెమ్మ, జాకటి లక్ష్మి, కోయగుర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy: కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి వేర్వేరు కాదు: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్: భారాస నేతలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా.. దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కవన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని.. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు కేసీఆర్‌ కుటుంబం పాల్పడిందని విమర్శించారు..

''మద్యం కేసులో భాజపా, భారాస నాటకాలాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. కవిత అరెస్టుతో సానుభూతి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్‌.. కిషన్‌ రెడ్డి వేర్వేరు కాదు. కేసీఆర్‌ అనుచరుడు కిషన్‌రెడ్డి.

భాజపా పెద్దలు అతడిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారో కిషన్‌రెడ్డికి తెలుసా? సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్‌ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్‌ అవినీతిపై భాజపా ఎందుకు విచారణకు ఆదేశించలేదు'' అని రేవంత్‌ ప్రశ్నించారు..

Amit shah: పటేల్‌ 'ఆపరేషన్‌ పోలో'తో నిజాం మెడలు వంచారు: అమిత్‌షా

హైదరాబాద్‌: నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.

ఈ వేడుకల్లో అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

పటేల్‌ లేకపోతే అంత త్వరగా విముక్తి లభించేది కాదు

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ''హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగింది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. 'ఆపరేషన్‌ పోలో' పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు'' అని అమిత్‌షా అన్నారు. భారాస ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేకుండానే ఆయన తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అనంతరం పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా,హాజరయి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వార్ మెమోరియల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి,మాట్లాడుతూ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని, భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్‌ బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..

నేడే తుది పోరు.. టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, శ్రీలంక

ఆసియా కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4 లో సత్తాచాటిన భారత్, శ్రీలంక జట్లు ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్నాయి.

నేడు ఆదివారం భారత్, శ్రీలంక మధ్య ఫైన‌ల్ మ్యాచ్ జరగనుంది.

కాగా, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో దిగిన శ్రీలంక, మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. భారత్ కూడా టైటిల్ గెలిచి సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ సంస్థ ప్రకటించింది.ఒకవేళ అదే జరిగితే..?

శ్రీలంకలోని కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. ఒకవేళ వర్షం కారణం సెప్టెంబరు 17న జరిగే మ్యాచ్ కు ఆటంకం వాటిల్లితే ఆ తర్వాతి రోజు అనగా సెప్టెంబరు 18న రిజర్వ్ డేని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీపర్ కీపర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ వికెట్ కీపర్, సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక కెప్టెన్,దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా... ఆటను కొనసాగించే టీం సభ్యులు

పీవీ సింధుతో భేటీపై రాజకీయ వ్యూహం ఉందా❓️

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హైదరాబాద్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు.

పీవీ సింధు వెంట ఆమె తండ్రితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే అమిత్ షాను పీవీ సింధు కలిసినట్లు తెలుస్తోంది. పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్ చేశారు.

పీవీ సింధు అద్బుతమైన క్రీడాకారిణి అని, తన అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు.

పీవీ సింధు చేసిన కృషి, అంకితభావం యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల క్రమంలో అమిత్ షాతో పీవీ సింధు భేటీ చర్చనీయాంశంగా మారింది.

పీవీ సింధుతో భేటీ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె ఏమైనా ప్రచారం చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది...

విపక్ష కూటమిలోకి ఐఎన్ఎల్డీ ముహూర్తం ఖరారు

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్,ఇండి-కూటమి,లోకి త్వరలో మరో కొత్త పార్టీ చేరనుంది.

సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా హర్యానాలోని కైతాల్‌లో ఇండియన్ నేషనల్ లోక్‌ దళ్,ఐఎన్‌ఎల్డీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇండి కూటమిలోని పార్టీల నేతలందరినీ ఆ సభకు ఆహ్వానించింది. విపక్షాల ఐక్యతను చాటే వేదికగా ఈ సభను మార్చి, అదే వేదికపై ఇండి కూటమిలో చేరే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

దేవీ లాల్ గౌరవార్థం జరు గుతున్న ఈ భారీ సభకు వివిధ విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నేత అభయ్ చౌతాలా తెలిపారు. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో అభయ్ చౌతాలా, జేడీయూ,నేత కేసీ త్యాగి సంయుక్తంగా మాట్లాడుతూ..

భారతీయ జనతా పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాము కూడా కోరుకుంటున్నామని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలుస్తానని ప్రకటించారు.

తాము తలపెట్టిన బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీ, మల్లి కార్జున ఖర్గేలకు ఇప్పటికే ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే వారు హాజరవుతున్నారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు.

కూటమిలో ఉన్న 95% పార్టీలు తమ సభకు హాజరవుతామన్నారని చౌతాలా తెలిపారు. కొన్ని పార్టీల అధి నేతలు నేరుగా హాజరవుతుండగా, మరి కొందరు తమ ప్రతినిధులను పంపిస్తున్నారని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ సమయంలో విదేశాల్లో ఉంటానని చెప్పారని, ఆమె కూడా హాజరైతే బావుండని తాము కోరుకుంటున్నట్టు చౌతాలా అన్నారు..

నేడు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నేడు ఆదివారం తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటల స‌మ‌యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జ‌రుగుతుంద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, సెప్టెంబ‌ర్ 22న గరుడ సేవ నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల నేప‌థ్యంలో తిరుమల కొండపై ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.