Beauty Tips : అల్లంతో అందమైన చర్మం మీ సొంతం..

వంటల్లో ఘాటు పెంచే అల్లం గురించి అందరికి తెలుసు.. ఈ అల్లం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. అల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటారు..

ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అల్లం మనకు దోహదపడుతుంది. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం..

కొందరిలో కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా, ఎర్రగా ఉంటుంది. అలాంటి వారు అల్లం టీ బ్యాగ్ లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టీ తయారు చేసుకున్న తరువాత ఈ టీ బ్యాగ్ లను పడేయకుండా కళ్లపై ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే ఉబ్బుదనం తగ్గిపోతుంది. అలాగే మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు.. అలాంటి వాళ్లు అల్లం రసం లో తేనె కలిపి మొటిమల మీద రాస్తే చాలు అవి త్వరగా తగ్గిపోతాయి..

YSR Kapu Nestham: కాపులకు సీఎం జగన్‌ శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ

తాడేపల్లి: కాపులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈరోజు వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు..

రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు..

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం..

శనివారం రోజు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

శనివారం తిరుమలలో వీకెండ్ వచ్చిందంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.

కానీ,ఈ శనివారం రోజున మాత్రం భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. శుక్రవారం 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరగనుంది. రేపు సాయంత్రం మాడ వీధుల్లో స్వామివారు విహరించనున్నారు...

CWC Meeting:రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది..

ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి, అందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా రూపొందించనున్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ విజయోత్సవ ర్యాలీ చేపట్టి, తెలంగాణకు ఐదు హామీలను కూడా ప్రకటించబోతోంది. మల్లికార్జున్ ఖర్గే గత నెలలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. ఈరోజు జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు దేశం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద కాంగ్రెస్ నేతలు తరలిరావడం ప్రారంభించారు.

చట్టసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి: సీఎం కేసీఆర్

చట్టసభల్లో 33శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… బీసీ, ఓబీసీ, బిల్లు., మహిళా బిల్లు., ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది.

మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సిఎం కేసీఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు.

నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్ లేఖ

తమ తమ వృత్తులను తర తరాలుగా నిర్వరిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన సబ్బండ వృత్తి కులాలైన బీసీ ల కు చట్ట సభల్లో సముచిత ప్రాధాన్యత దిశగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం సుధీర్ఘంగా చర్చించింది.

ఉత్పత్తిలో భాగస్వాములౌతూ, సభ్య సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న బీసీ,ఓబీసీ, కులాలను సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో మరింత దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వున్నదని సమావేశం లో అభిప్రాయం వ్యక్తం చేస్తూ మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీ ల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది....

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

నళినీ చిందబరం తరహాలోనే తనకూ ఊరట ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్పై ఈడీ న్యాయవాది స్పందనను సుప్రీం ధర్మాసనం కోరింది. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.

అందులో భాగంగా ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది.

అందులో శుక్రవారం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఉంది. ఈ విషయంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు.

ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు. దీంతో సుప్రీంకోర్టు కాజ్లిస్ట్ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చి.. ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది....

అధినేతను కలిశాకే నిర్ణయం: ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కామ్ కేసులో నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఈడీ, అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో ఈ రోజు శుక్రవారం విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు.

ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా..

కాసేపట్లో కవిత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈడీ ముందుకు ఎలా వెళ్లాలి, ఏం చేయాలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తండ్రి సూచన మేరకు కవిత తన తదుపరి అడుగులు వేయనుందని సమాచారం. అంతేగాక, ఇవాళ కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం అటు జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలోనూ చర్చకు దారితీసింది. మార్చి 21న ఆమెను ఈడీ విచారించినా ఆరు నెలల పాటు ఎలాంటి హడావిడీ లేదు. కవితకు వ్యాపార సన్నిహితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజునే ఆమెకు ఈడీ నుంచి నోటీస్ రావడం రకరకాల చర్చలకు దారితీసింది.

పొలిటికల్ పార్టీల్లో జరిగే చర్చలు ఒక రకంగా ఉంటే సామాన్య జనంలో మాత్రం మరో తీరులో ఉన్నాయి. ఈడీ ఎంక్వయిరీకి కవిత హాజరవుతారా?.. అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది?.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి...

స్త్రీలకు మాత్రమే!!

ఇటీవల కాలంలో పలు రద్దీ ప్రాంతాలకు విద్యార్థినిలు, మహిళల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ లేడీస్ స్పెషల్ బస్సుల సర్వీస్ కల్పిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం మెహిదీపట్నం టూ సీబీఐటీ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

120 రూట్ నెంబర్ గల ఈ సర్వీస్.. ప్రతి రోజు ఉదయం 08:30 గంటలకు మెహిదీపట్నం నుంచి ప్రారంభమవుతుందని, తిరిగి సాయంత్రం 04:00 గంటలకు సీబీఐటీ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు.

ఆ మార్గంలో వెళ్లే ఇంజనీరింగ్ విద్యార్థినులు, మహిళలు ఈ స్పెషల్ బస్సు సదుపాయాన్ని వినియోగించుకోగలరని సూచించారు...

కరీంనగర్ లో భారీ ర్యాలీ ప్రారంభించిన: మంత్రి గంగుల

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోభారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందు ఈ ప్రదర్శన జరిగింది...

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి

సంగారెడ్డిజిల్లా:

టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఈరోజు ఉదయం జరిగింది.

సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.

ఈ క్రమంలో బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే రాధిక పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్‌ తీసుకెళ్లారు.

అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.