టీడీపీ ఎంపీ పేరిట సోషల్ మీడియాలో రచ్చ

•కావాలనే నాపై దుష్ప్రచారం

•ట్విటర్ వేదికగా స్పందించిన గల్లా జయదేవ్

'యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదు.. ఈ పాదయాత్ర వల్ల ఒరిగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటి..? పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తి స్తున్నారు.. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు 'ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది.

లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మడం లేదు. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదు. టీడీపీ హైకమాండ్ ఇకనైనా పునరాలోచన చేయాలి' అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారం టీడీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది.

అందులోనూ లోకేశ్ పాదయాత్రలో గల్లా జయదేవ్ కనిపించకపోవడంతో ఒకవేళ నిజంగానే చేసి ఉంటారే మొనన్న అనుమానం కూడా కలిగింది.

అయితే ఈ ప్రచారంపై గల్లా జయదేవ్ ట్విటర్ వేదికగా స్పందించారు.

నారా లోకేశ్, యువగళం పాదయాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు. 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద, ఆయన తలపైట్టిన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం తప్ప ఏమాత్రం నిజం లేదు.

నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు.

నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని తెలిపారు.

అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని గల్లా జయదేవ్ తేల్చి చెప్పారు.

రణరంగంగా మారిన వరంగల్ జిల్లా కేంద్రం:తీవ్ర ఉద్రిక్తత

హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. హన్మకొండ లోని బి అర్ ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు జిల్లా ధర్మారం అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వరంగల్ పట్టణ సమస్యలు పరిష్కరించడంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొంటూ బీజేపీ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ గానే మోహరించారు.

బీజేపీ నేతలు రాకను తెలుసుకున్న బీఆరెస్ నేతలు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రెండు పార్టీల నేతలు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు.

రెండు పార్టీల నేతల తలలకు, కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. బీజేపీ అధికారప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గాయపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.....

యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం.. బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం చేశాడు ఓ భర్త. మగశిశువుకు జన్మనిచ్చి ఆ ఇల్లాలు కన్నుమూసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామవాసి మాదేశ్‌తో 2021లో వివాహం జరిగింది.

మాదేశ్‌ సేంద్రియ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య ఇటీవల గర్భం దాల్చగా.. సేంద్రియ పద్ధతిలాగే ఆమెకు కూడా ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు.

ఆ మేరకు లోకనాయకికి వైద్యపరీక్షలు సైతం చేయించలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. మాదేశ్‌ ససేమిరా అన్నాడు. ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతోపాటు పౌష్టికాహారాన్నీ నిరాకరించాడు..

తనే ఆమెకు గింజలు, ఆకుకూరలు ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 22న ఇంట్లో ఉన్న లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. మాదేశ్‌ తన ఫోనులో యూట్యూబ్‌ చూస్తూ భార్యకు ప్రసవమయ్యేలా చేశాడు.

సరైన రీతిలో వైద్యం అందకపోవడం వల్ల మగశిశువుకు జన్మనిచ్చిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

ఇక తప్పదని.. కున్నియార్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లోకనాయకి మరణించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..

నేడు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తెలంగాణ కెబినెట్లోకి తీసుకోనున్నారు. ఈటల రాజేందర్ స్థానంలో ఖాళీ అయిన బెర్త్‌ను ఇప్పటి వరకు అలాగే ఉంచారు.

ఖాళీగా ఉన్న ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి తాండూరు నుండి పోటీ చేయాలనుకున్నారు.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వడం తో పట్నం కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు.

దీంతో గురువారం మధ్యాహ్నం గం.3కు రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై. మంత్రిగా పట్నంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు...

చందమామ అందిన రోజు

శ్రీహరికోట:ఆగస్టు 24

చంద్రయాన్-3 ల్యాండింగ్ అనంతరం విక్రమ్ ల్యాండర్ తొలిసారి చంద్రుడి చిత్రాలను తీసింది.

విక్రమ్ తీసిన ఫోటోలను ఇస్రో తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. బెంగళూరు ఇస్రో కేంద్రంతో చంద్రయాన్-3 ల్యాండర్ అనుసంధానమైంది.

ఇదిలా ఉండగా, ల్యాండర్ నుండి రోవర్ బయటకు వచ్చిన తర్వాత సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది.

ఇస్రో సాధించిన ఘనతకు గుర్తుగా చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ దేశ జాతీయ చిహ్నంతో పాటు ఇస్రో లోగోను ముద్రించనుంది.

ఇందుకు తగినట్లు రోవర్ ఆరు చక్రాలను డిజైన్ చేశారు. ఇందులో కుడి చక్రాలు ఇస్రో లోగోను, ఎడమవైపు చక్రాలు జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తాయి.

పద్నాలుగు రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ సంచరిస్తూ ల్యాండర్‌కు కమ్యూనికేట్ చేస్తుంది.

ప్రగ్యాన్ రోవర్‌లోని రెండు పేలోడ్‌లు చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలాగే మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తించి సమాచారాన్ని విశ్లేషిస్తాయి....

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 24

నేడు గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.

శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శ్రీవారిని 71,122 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.

27 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది....

భారత్ ఖ్యాతిని సగౌరవంగా చాటుదాం: సోమనాథ్ ఇస్రో చైర్మన్

చంద్రుడి దక్షిణ ధ్రువంమీద అడుగుడిన తొలి దేశంగా భారత్‌ ఖ్యాతిని సగర్వంగా సాధించుకుంది. చంద్రయాన్‌ -3 ఈ ఘనతను సాకారం చేసింది.

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది కళ్లప్పగించి చూస్తుండగా మన విక్రముడు వినమ్రంగా చంద్రుడిపైకి అడుగుపెట్టాడు. శాస్త్రవేత్తల మోముల్లో ఆనందం వెల్లివరిసింది. ఆ క్షణాన భరతమాత తలఎత్తుకు నిలిచింది. ప్రపంచం మనవైపు తేరిపార చూసింది.

అలా మనవైపు చూసేలా చేసిన చంద్రయాన్‌ వెనుక ప్రధానంగా తొమ్మిదిమంది శాస్రవేత్తల బృందం పనిచేసింది. వీరిలో ఆరుగురు అత్యంత కీలక పాత్ర వహించారు.

వేయిమంది యువ ఇంజనీర్లు, 53మంది మహిళా శాస్త్రవేత్తలు చేయందించారు. నాసా, యూరోపియన్‌ యూనియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి స్టార్టప్‌ల వరకు ఈ విజయంలో పాలుపంచుకున్నాయి. దాదాపు రూ. 700 కోట్ల ఈ ప్రాజెక్టులో ఎవరేమి చేశారో చూద్దాం.

టీమ్‌ చంద్రయాన్‌

1 ఎస్‌.సోమనాథ్‌ ఇస్రో చైర్మన్‌

చంద్రయాన్‌ 3లో ఉపయోగించిన వ్యోమనౌక మార్క్‌ 3. దీనిని బాహుబలి రాకెట్‌గా అభివర్ణిస్తారు. చంద్రుని కక్ష్యలోకి ల్యాండర్‌ను మోసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ను డిజైన్‌ చేసింది ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ ఎస్‌.సోమనాథ్‌.

ఆయన పేరు సోమనాథ్‌. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు.

ఆయన పేరులోనే చంద్రుడి పేరుండటం కాకతాళీయం. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టుకు ఆయన బాధ్యత వహించడం విశేషం. ఆయన బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో విద్య అభ్యసించారు. సంస్కృతంలో మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. యానమ్‌ అనే శీర్షికతో వచ్చిన చిత్రంలో ఆయన నటించారు కూడా. ఈసారి చంద్రుడి దక్షిణధ్రువంమీద అడుగుపెట్టాల్సిందేనన్న పట్టుదలతో టీమ్‌ను అనుక్షణం ప్రోత్సహిస్తూ వచ్చారు....

చంద్రయాన్‌-3 సక్సెస్‌తో ప్రపంచం మన వైపే చూస్తుంది: కల్వకుంట్ల కవిత

చంద్రయాన్‌-3 విజయవంతం చారిత్రాత్మకమైనదని, దేశం గర్వంతో ఉప్పొంగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

చంద్ర మండలంపై త్రివర్ణ జెండా రెపరెపలాడుతుందని తన సంతోషాన్ని ట్విటర్‌ వేదిక ద్వారా పంచుకున్నారు. విశ్వప్రయాణంలో అద్భుతమైన ఘట్టమని ఆమె పేర్కొన్నారు . చంద్రయాన్ 3తో సక్సెస్‌ ప్రతీ భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుందని, ప్రపంచం మనవైపే చూస్తుందని అన్నారు.

అద్భుత విజ‌యం .. మంత్రి ఎర్రబెల్లి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమ‌వ‌డం చ‌రిత్రలో అత్యంత అద్భుత విష‌య‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు.

ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ సాధించిన తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచింద‌ని పేర్కొన్నారు.

ఈ విజయం భ‌విష్యత్తులో మ‌రిన్ని విజ‌యాల‌కు అంకురార్పణ జ‌రిగింద‌న్నారు.

ఇది భార‌త జాతి గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల‌కు మంత్రి శుభాకాంక్షలు, అభినంద‌న‌లు తెలిపారు.......

మాటిస్తున్నా! మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాలో ప్రగతి శంఖారావం సభ జరిగింది. బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.

పోయిన ఎన్నికల్లో మెదక్ వచ్చినప్పడు నేను ఒకటే మాట మీతో మనవి చేయడం జరగింది. పద్మ నా బిడ్డ, ఆమె అడిగితే నేను ఏదీ కూడా కాదనే పరిస్థితి ఉండదు. దాని ఫలితమే ఇంద్ర భవనం లాంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు ఇవ్వాల చూస్తున్నారు. ఉద్యమంలో నాతో పాటు కలిసి ఉండి.. ఇవ్వాల్టి వరకు మనతో కలిసి ఉన్న బిడ్డ పద్మక్క. ఇప్పుడే నన్ను ఆమె కోరింది.

మెదక్ పట్టణంలో రోడ్లు చిందరవందరగా అయ్యాయి. వాటిని బాగు చేసుకోవాలే.. పంచాయతీలకు కూడా నిధులు కావాలనే అడిగింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగింది. మీకు ఎల్లుండి సాయంత్రంలో లోగా సాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తానని మాట ఇస్తున్నా.

రామాయంపేటలో డిగ్రీ కాలేజీ కూడా కావాలని కోరారు. అది కూడా మంజూరు చేస్తున్నా. మెదక్కు రింగ్రోడ్డు కూడా మంజూరు చేస్తున్నా.. అదేవిధంగా, ఏడు పాయల టెంపుల్ దుర్గ మాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో వంద కోట్ల రూపాయలు కావాలని అడిగారు.. దానికి కూడా మంజూరు ఇస్తున్నా.. కౌడిపల్లిలో కూడా డిగ్రీ కాలేజీ అడిగారు. దానికి కూడా మంజూరు చేస్తున్నా..

మెదక్ జిల్లాలో ప్రతి పంచాయతీకి నిధులుమంజూరు చేస్తున్నా.. అదేవిధంగా.. నాలుగు మున్సిపాలిటీలకు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ కు తలా 25కోట్లు.. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఫండ్స్తో పనులన్నీ చేయాలని చెబుతున్నా.

ఇగ ఇప్పుడు మీ పని అయిపోయింది.. ఇగ నాపని ఉన్నది.. మిమ్మల్నందరినీ కోరేది ఒక్కటే.. ఎవరూ ఆగమాగం కావద్దు.. పంట కోతలయినంక గంగెడ్ల వారు వచ్చినట్టు వస్తుంటరు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వారు కోరుతున్నారు.

ఇప్పటికే వారికి చాలా చాన్స్లు ఇచ్చినం.. ఎవరూ గణపురం కాల్వలను బాగు చేయలే.. అప్పడు తుమ్మ చెట్ల మొలిచినయ్.మనం గణపురం కాల్వలు బాగుచేస్కున్నమ్. 40లక్షల ఎకరాల దాకా నీరు అందుతోంది. మంచిగ పంటలు పండుతున్నయ్.. గణపురం ఆయకట్టు కింద ఒక గుంట కూడా దెబ్బతినకుండా పంటలు పండిస్తున్నమ్.

తెలంగాణ రాకముందు చెట్టుకొక్కరు గుట్టకొకరు అయ్యారు. అందరం బాధపడ్డాం. రైతులను బాగు చేయాలనే సంకల్పం తీసుకుని దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వచ్చినం. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు మేలు చేసినం. కాళేశ్వరం జలాలతో పంటపొలాలకు నీళ్లు పారుతున్నాయి.....

ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు

చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సంపూర్ణ విజ‌యాన్ని సాధించ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

చంద్రుని ద‌క్షిణ ధ్రువం మీద‌కు లాండ‌ర్ మాడ్యూల్‌ను చేర్చిన మొట్ట‌మొద‌టి దేశంగా ప్ర‌పంచ అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో భార‌త‌దేశం స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఇది ప్ర‌తీ భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు, ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంలో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రికి అభినంద‌న‌లు.

చిర‌కాల ఆకాంక్ష నెర‌వేరిన సంద‌ర్భంలో యావ‌త్ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ఇది పండుగ రోజు. భ‌విష్య‌త్‌లో ఇస్రో చేప‌ట్టే అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు, ప్ర‌యోగాల‌కు చంద్ర‌యాన్-3 విజ‌యం గొప్ప ప్రేర‌ణ‌ను ఇస్తుంది.

ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ, దేశ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను మ‌రింత‌గా పెంచే దిశ‌గా అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో ఇస్రో త‌న విజ‌య పరంప‌ర‌ను కొన‌సాగించాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు...,......