నేడు వామపక్షాల కీలక సమావేశం

పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు తెలిపాయి.

ఇక, వామపక్ష పార్టీలతో పొత్తు లేదని సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు కీలక సమావేశం జరగనుంది.

భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం చర్చించనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో సీపీఐ, సీపీఎం ఉన్నట్లు తెలిసింది.

ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చించనున్నారు.పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు టికెట్లను వామపక్షాలు కోరాయి...

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి

పెద్దపల్లి జిల్లా:

మంథని నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ ఊహించినట్లు జరగలేదు పుట్ట మధుకు వ్యతిరేకంగా తిరుగుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జట్టు కట్టారు.

చల్ల నారాయణరెడ్డితోపాటు ఇతర నాయకులు మధుకు టికెట్ ఇస్తే సహకరించమని ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికల వరకు వాళ్ల సహకారం అందకుంటే మధు గెలుపు నల్లెరు మీద నడకే అవుతుందా? వ్యతిరేక వర్గానికి తన సత్తా చాటుతాడా? వేచి చూడాలి మరి

వేములవాడలో రమేష్ బాబుకు టికెట్ కేటాయించకపోవడంతో రమేష్ బాబు వర్గం నేతలు చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు ఎంత వరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో మోజార్టీ ప్రజాప్రతినిధులు సహకరించకుంటే లక్ష్మీనర్సింహరావు విజయతీరాలకు వెళ్లడం కష్టమే. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాంచడంతో అసంతృప్తి నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీని వీడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పాడి తీరును వ్యతిరేకిస్తున్న నేతలు పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా జరిగితే కౌశిక్ రెడ్డి ఓటమి మూటకట్టుకోక తప్పుదు.

రామగుండంలో చందర్ తీరుకు వ్యతిరేకంగా గళం విప్పిన నేతలు గడిచిన కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తున్న జెడ్పీటీసీ సంధ్యరాణి, మాజీ మేయర్లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్నేత రాజిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఇప్పుడు చందర్‌కు ఎంత వరకు సహకరిస్తారనేది? చర్చనీయాంశంగా మారింది.

వీరు పార్టీలో ఉంటారా..? పార్టీని వీడుతారా? అనేది తెలియాల్సి ఉంది. చొప్పదండి టికెట్ ఆశించిన నేతల్లో బండపల్లి యాదగిరి తాను టికెట్ రాకుంటే స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. యాదగిరితోపాటు బైరం పద్మయ్య, కౌంసాల శ్రీనివాస్తదితరుల మద్దతు ఎమ్మెల్యే రవి శంకర్‌కు ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది.

మిగిలిన జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్తదితర నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్నిర్ణయాలను బట్టే గెలుపు ఓటములు ప్రభావితం అవుతాయి....

చంద్రయాన్ - 3 కీలక ఘట్టం షురూ !

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.

2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 కూడా విఫలం కావడం, క్రాష్ ల్యాండింగ్ కావడం.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ఇస్రో.

ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండర్, రోవర్ ల్యాండింగ్‌ను ఖచ్చితంగా విజయవంతం చేసి తీరాలనే పట్టుదలతో ఉంది. లూనా 25 ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అయిందనే విషయంపై ఆరా తీస్తోంది. రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటోంది.ముందుగా నిర్దేశించిన షెడ్యూల్.. అంటే ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు ల్యాండింగ్ కావాల్సి ఉంది చంద్రయాన్ 3.

ఆ సమయానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోయినా ల్యాండింగ్‌ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చింది ఇస్రో. మళ్లీ ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి చేపట్టాలని భావిస్తోంది.

ఈ విషయాన్ని ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు.

నిర్దేశిత సమయానికి చంద్రుడిపై వాతావరణం అనుకూలించకపోయినా, ఇంకేదైనా అవాంతరాలు చోటు చేసుకున్నా ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.చంద్రయాన్-3 చంద్రునిపై దిగడానికి రెండు గంటల ముందు.. దీనిపై నిర్ణయం తీసుకంటామని దేశాయ్ పేర్కొన్నారు. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితుల ఆధారంగా నిర్దేశిత సమయంలో దాన్ని ల్యాండ్ చేయడం సరైనదా? కాదా? అనేది ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు నిర్ణయిస్తామని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనట్టయితే ఈ ప్రక్రియను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తామని పేర్కొన్నారు.

కేటీఆర్ సోపతికి ఎమ్మెల్యే టికెట్ !

- ఎమ్మెల్యే రేఖ నాయక్ గుస్సా

- కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రేఖ నాయక్

- జాన్సన్ నాయక్ కు టికెట్ ఖరారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మెుత్తం 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. పెద్దగామార్పులు చేర్పులు లేకుండా దాదాపు సిట్టింగ్‌లందరికీ టికెట్లు కేటాయించారు.

ఈ విడతలో ఎనిమిది స్థానాల్లో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్‌కు ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లను మార్చగా.. ఖానాపూర్ నియోజవర్గం నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు అవకాశం కల్పించారు.జాన్సన్ మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్య జాన్సన్‌ నాయక్‌. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమో పూర్తి చేశారు.

కొంత కాలం పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్‌ జాన్సన్ ఇద్దరు క్లాస్‌మేట్స్‌. దీంతో ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. గతంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌.. జాన్సన్‌ తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని చెప్పారు. ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటామని.. తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్‌ అన్నివిధాలుగా సహకరించేవాడని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఖానాపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌ను మారుస్తున్నారన్న ప్రచారం జరగ్గాన్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు టికెట్ కన్ఫార్మ్ అనే టాక్ వినిపించింది. అందరూ ఊహించినట్లుగానే జాన్సన్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. దీంతో అతడు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాంగ్రెస్ గూటికి రేఖా నాయక్

ఇక పార్టీ టికెట్ కేటాయించకపోవటంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌.. టికెట్లు ప్రకటించిన కాసేపటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేఖా నాయక్ ఇవాళ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఖానాపూర్ నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

తిరుమలలో నేడు పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. నిన్న కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉండగా..

నేడు శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

సోమవారం శ్రీవారిని 69,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

కాగా.. తిరుమల శ్రీనివాసుడికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈఏడాది అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌..

అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,

కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది..

యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు.

విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు..

21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు.

విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు.

ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు..

ప్రతిపక్షాలకు ట్రైలర్ కాదు ఫుల్ సినిమా చూపెట్టండి: మంత్రి కేటీఆర్

ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టీల్ బ్రిడ్జిను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరు మీద సచివాలయం నిర్మాణంతో పాటు ప్రపంచంలోని అత్యంత ఎత్తయినవి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1978లో నాయిని నర్సింహారెడ్డి గెలిచారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తన ముద్ర వేశారన్నారు. నాయిని నర్సింహారెడ్డి కేసీఅర్ వెంట పెద్దన్నలా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

నరసింహారెడ్డి ఆత్మ శాంతిస్తుందని కేటీఆర్ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇది 36వ ఫలితం అని అన్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే.. సినిమాలు విడుదల అయినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అని అన్నారు.

ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల సాకారం అయ్యిందని తెలిపారు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి.. అందుకే ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.ట్యాంక్ బండ్‌ను తీర్చి దిద్దాం, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలన్నారు. గతంలో కర్ఫ్యూలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవన్నారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందని ఆయన అన్నారు. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వారిని పట్టించుకోవద్దన్నారు. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి అని కోరారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జీపులో స్టీల్ బ్రిడ్జ్‌పై కేటీఆర్ ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, బేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు...

బండి సంజయ్‌కు నాలుగు రాష్ట్రాల బాధ్యతలు: హై కమాండ్ బిగ్ ప్లాన్?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతలను తొలగించిన అనంతరం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బండిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

ఆయనకు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, గోవా బాధ్యతలు ఆయనకు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ముంబై యూనిట్‌ను సైతం ఆయనకే అప్పగించనున్నట్లు టాక్. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జిగా ఆయన ఈ రాష్ట్రాల్లో పని చేయనున్నారు.

21న ఏపీలో మీటింగ్

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలోలా ఏపీలో పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావించి బండిని పంపించినట్లు తెలుస్తోంది.

ఈనెల 21వ తేదీన అక్కడి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వారికి ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో చేపట్టే రథయాత్రలో సైతం బండి ఇన్‌వాల్వ్ కానున్నారు.

బూత్‌ల వారీగా బీజేపీకి మద్దతు తెలిపే వారు ఎవరు? వారి ఓట్లు లిస్టులో ఉన్నాయా? అనే విషయాలను ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జులు పరిశీలించనున్నారు. మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ బండి పార్టీకి ప్లస్ అవుతారని భావిస్తున్నారు.

తెలంగాణకు రేఖా వర్మ రానున్నట్లు తెలుస్తోంది. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు...

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో లో అగ్ని ప్రమాదం

దేశంలో చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిషా రైలు యాక్సిడెంట్, తెలంగాణలో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలను పూర్తిగా మరువక ముందే.. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

శనివారం తెల్లవారుజూమున మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేశారు.

సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ట్రైన్ ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....