బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున రాష్ట్రంలో సమగ్ర కులగనణ చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినందున తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
కులగణన చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేసి కులగణన చేపట్టడానికి రూ 150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని గుర్తుచేశారు. కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతనే గ్రామపంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. కులగణన లేకుండా, బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేవని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మూలంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గాయన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పాపానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి, బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఆధారంగా అదేవిధంగా ఇతరత్రా లెక్కల ఆధారంగా ఎన్నికలకు వెళితే న్యాయ పరమైన చిక్కులు ఏర్పడి బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా పెంచకపోయే ప్రమాదం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే శాస్త్రీయబద్ధంగా బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని ఇందుకు ఒకటి రెండు నెలల్లోనే బీసీ కులగణన మొత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు అనే ఆయుధంతో సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, అనిల్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
Sep 04 2024, 10:26