భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్..
భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది.
భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం ‘2024-ఆర్వోఆర్’ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్‌ను తెచ్చే చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024-ఆర్వోఆర్ ముసాయిదా బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్వోఆర్ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్వోఆర్-2024 ముసాయిదాకు రూపకల్పన చేసింది
ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్ ద్వారా అయితే ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, ేస్టషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్వోఆర్ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీల్లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు.
ఈ మేరకు మొత్తంగా 20 సెక్షన్‌ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకొనే వెసులు బాట కల్పించారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్వోఆర్‌లను సవరించుకోవచ్చు. రికార్డుల్లో లేని భూమును రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మినెంట్ భూధార్ నంబరు కేటాయించనున్నారు.
సెక్షన్-5 కింద మ్యూటేషన్ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్-7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్ చేసే అధికారం ఉంటుంది.
సెక్షన్-8 కింద.. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదాభైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ఓఆర్సీ ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. మ్యూటేషన్ చేసేకంటే ముందు అభ్యంతరాలొస్తే మ్యూటేషన్ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలకు కల్పించారు
సెక్షన్-6 కింద సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి, నోటీసులు ఇచ్చి మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఫీజలు వసూలు చేసి, సంబంధిత రైతులకు మ్యూటేషన్ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు.
కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీలు కింద కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్, రెండో అప్పీలు కింద సీసీఎల్‌ఏకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
రికార్డుల మార్పు కోసం సివిల్ కోర్టుకు వెళ్లనక్కర్లేదు. రెవెన్యూశాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఈ ఆర్వోఆర్ ప్రకారం పహాణిలు మళ్లీ నమోదు చేయనున్నారు.
Aug 04 2024, 12:30