317 GO : నేడు 317 జీవో అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌజ్, మెడికల్, మ్యుచువల్ తదితర బదిలీలకు సంబంధించి ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశం కానున్నది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం గురువారమే భేటీ కావాల్సి ఉన్నా ఒక రోజు వాయిదా పడింది. గతంలోనే రాష్ట్రంలోని జిల్లా, మల్టీ జోనల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలపై ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన సబ్ కమిటీ... శాఖలవారీగా జాబితాను తయారుచేసి సమర్పించాలంటూ గత వారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. సాధారణ పరిపాలన శాఖ వాటిని తదుపరి భేటీకి అందజేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రకారం జీఏడీకి అన్ని శాఖల నుంచి నివేదికలు అందాయి. వీటిని పరిశీలించిన తర్వాత సబ్ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2008 బ్యాచ్ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నది. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే దానికి సంబంధించిన విధివిధానాలపై చర్చిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నది.
అదే తరహాలో తెలంగాణలోనూ ఆలోచించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బాధ్యతలను అప్పగించింది.
ఉమ్మడి జిల్లావారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆరు వారాల్లోగా ఉద్యోగాలను ఇస్తామంటూ గత నెల 27న హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
తదుపరి విచారణ వచ్చే నెల 8న జరగనున్నందున అప్పటికల్లా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాల్సి ఉన్నది. దీంతో కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం జరిపే సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. విధివిధానాలను ఏ తరహాలో రూపొందిస్తున్న ఆసక్తి నెలకొన్నది.
మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.
స్పౌజ్, మ్యుచువల్, మెడికల్, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో భార్యభర్త ఉద్యోగం రీత్యా చేసుకున్న బదిలీ దరఖాస్తులపై జీఏడీ ఇచ్చే జాబితాను పరిశీలించి స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు 2008 డీఎస్సీ బాధితుల విషయంలోనూ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నది.
Jul 19 2024, 15:26