ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు...జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ...
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ
అనంతరం 20 రోజులపాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ
కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ
సబ్‌రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.
గ్రామీణంలో కసరత్తు ఇలా..
జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు.
భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండటాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతుల్ని గుర్తిస్తారు.
వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాకు వస్తారు.
పట్టణ ప్రాంతాల్లో ఇలా..
పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు- అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేపట్టడానికి వీలుంది.
పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేపడతారు.
కార్యాచరణ ఇలా..
రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమావేశం: 18.6.2024
మార్కెట్ విలువల సవరణ పూర్తి: 23.6.2024
పునస్సమీక్ష : 25.6.2024
కమిటీ ఆమోదం : 29.6.2024
వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శన : 1.7.2024
సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం: 20.7.2024
శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్: 31.7.2024
సవరించిన ధరల అమలు: 1.8.2024 నుంచి.
Jul 10 2024, 21:20