HYD: ఖైదీ కడుపులో బ్లేడ్లు, మేకులు
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు లో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారు ఉంటారు.
అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానంటూ కేకలు వేశాడు.
జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.
ఎక్స్ రే పరిశీలించిన డాక్టర్లు.. షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఇతర చిన్నపాటి వస్తువులు ఖైదీ కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు పంపించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు.
అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.
అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి, అతనికి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.
Jan 10 2024, 21:57