తెలంగాణలో వానలు లేకున్నా చెరువులు ఫుల్.. నీటి నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్...
వానల్లేకున్నా చెరువులు ఫుల్.. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్
ఈఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
కాళేశ్వరంతో భూగర్భ జలాలు పైపైకి
60 ఏండ్ల గోస పదేండ్లలో తీర్చిన కేసీఆర్
ఇతర రాష్ర్టాల్లో దిగజారిన నీటి నిల్వలు
మన సరిహద్దు రాష్ర్టాల రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్ నమోదు
సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలో వెల్లడి
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలోని ఐదు రాష్ర్టాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పదేండ్ల సగటు కంటే తక్కువగా ఉన్నాయని సీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొన్నది. తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు 68.3% ఉండగా, ఆ తర్వాత గుజరాత్ 14.6%తో రెండో స్థానంలో నిలిచింది.
ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్ 44.2%, మహారాష్ట్రలో మైనస్ 8.9%, ఛత్తీస్‌గఢ్‌లో 11%, ఒడిశాలో మైనస్ 13.9 శాతానికి పడిపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు రాష్ర్టాన్ని జలభాండాగారం తీర్చిదిద్దాయి. దీంతో ఒకనాడు బీటలు వారిన చెరువుల్లో నేడు జల రావాలు వినిపిస్తున్నాయి. బీడువారిన భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఏ పల్లెకు వెళ్లినా వాగులు, వంకలు గలగలలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ రిజర్వాయర్‌ను చూసినా పాల నురగల జలహేల కనిపిస్తున్నది. ఏ రైతు ఇంటి తలుపు తట్టినా ఆనందం వెల్లివిరుస్తున్నది. లోటు వర్షపాతంలోనూ తెలంగాణ జలసిరులతో అలరారుతున్నది. వరుణుడు కరుణించకున్నా రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి. దీంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురకవపోయినా తెలంగాణలో పంటల సాగు ఆగలేదు. అనుకున్న సమయానికే ఎక్కువ మొత్తంలో రైతులు విత్తనాలు విత్తారు. ఇదంతా రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలతోనే సాధ్యమైంది.
భూగర్భ జలాల్లో దేశంలోనే టాప్
'రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుంది' అని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వరాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రైతుల స్థితిగతులను మార్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రపంచమే అబ్బుర పడేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా మొక్కవోని దీక్షతో అనతికాలంలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేశారు. దీనితోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కొత్త జలాశయాలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 15-20 మీటర్లు ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో సగటు నీటిమట్టం 6 మీటర్లు. రాష్ట్రంలోని 98% గ్రామాలు సేఫ్‌జోన్ జాబితాలో చేరాయి. వర్షపాతం ద్వారానే కాకుండా ఇతర జలసంరక్షణ చర్యల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 21.45% మేర భూగర్భజలాలు పెరిగాయి. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో రాష్ట్ర సర్కారు విజయం సాధించింది. ఫలితంగానే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
ఆగస్టులో 36% లోటు వర్షపాతం
ఈ సీజన్‌లో నిరుడు ఇదే సమయానికి ప్ర ధాన రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వల కం టే ఈ ఏడాది 23% తకువగా నమోదయ్యాయని సీడబ్ల్యూసీ తెలిపింది. ఇది పదేండ్ల సగటు కంటే 9% తకువన్నది.
ఆగస్టులో వర్షపాతం 36% తకువగా నమోదైంది. దీంతో ఆగస్టు ప్రారంభంలో 7% లోటు పెరిగింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) కంటే 40% తకువని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రస్తుతం 113.417 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) మాత్రమే ఉన్నది. ఇది మొత్తం నీటినిల్వ సామర్థ్యంలో 63శాతమే.
నిరుడు ఇదే కాలంలో 146.828 బీసీఎం జలాలు నిల్వ ఉన్నాయి. పదేళ్ల సగటు చూసినా ఆగస్టులో 125.117 బీసీఎం జలాలు నిల్వ ఉండేవి. మొత్తంగా 9% మేర నీటినిల్వలు తగ్గిపోయాయి.
హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, అస్సాం, నాగాలాండ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే మెరుగ్గా నీటినిల్వలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఒడిశాతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గత సంవత్సరంతో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయాయి.
తూర్పు భారతదేశంలోని 23 ప్రధాన డ్యామ్‌లలో నీటి మట్టాలు నిరుటి కంటే 38% తకువగా ఉన్నాయి.
దక్షిణ ప్రాంతంలోని 42 రిజర్వాయర్లు గత సంవత్సరం స్థాయి కంటే 10% తకువగా ఉన్నాయి.
Sep 22 2023, 09:43