బంధువర్గాన్ని పాలకవర్గంలోకి తీసుకున్న అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ ట్రంప్... వివరాల్లోకి వెళ్ళితే...
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ ట్రంప్ ఎంపిక కాగా, ఆయన తన ప్రభుత్వ కూర్పుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే తన గెలుపు వెనుక కీలక పాత్ర పోషించిన సన్నిహితులు, యువ నేతలకు కీలక పదవులు ఆయన అప్పగించారు. తాజాగా తన బంధువర్గాన్ని పాలకవర్గంలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు వియ్యంకులకు కీలక బాధ్యతలు కేటాయించారు.
లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ బౌలోస్ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్’ సోషవ్ మీడియా ఖాతాలో ప్రకటించారు. ఈయన ట్రంప్‌నకు స్వయానా వియ్యంకుడు. మసాద్ కుమారుడు మైఖెలు టిఫానీ వివాహం చేసుకున్నారు.
కాగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో గాజా అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లను ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు.
ఇక, దీనికి కొన్ని గంటల ముందు తన మరో వియ్యంకుడు ఛార్లెస్ కుషర్న్ ఫ్రాన్స్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్ మామనే ఛార్లెస్ (జారెడ్ కుష్నర్ తండ్రి). ఈయన గతంలో ఓ కేసులో దోషిగా తేలగా.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వియ్యంకుడికి క్షమాభిక్ష పెట్టడంతో శిక్ష నుంచి బయటపడ్డారు.
ఇక, ఈసారి ట్రంప్ పిల్లలు గానీ, అల్లుడు జారెడ్‌గానీ పాలకవర్గంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశాలు కన్పించట్లేదు. వీరంతా తెరవెనుక నుంచి కాబోయే అధ్యక్షుడికి సలహాలు అందిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.
Dec 04 2024, 14:43