NLG: సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి: సిపిఐ
నల్గొండ: సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ రోజు నిరవధిక సమ్మె శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష మన రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మరియు రాత పరీక్ష ద్వారా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ చే ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తున్నారు.
గత 18 నుండి 20 సంవత్సరాలుగా సర్వ శిక్ష ఉద్యోగులు పాఠశాల విద్య అభివృద్ధి కోసం వారి నైపుణ్యాన్ని మరియు కృషిని అందిస్తున్నారు. వీరిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పే స్కేల్ వర్తింపచేయాలని, ప్రతి ఉద్యోగి కి జీవిత బీమా 10 లక్షలు ,ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని, పదవి విరమణ చేస్తున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సర్వ శిక్ష ఉద్యోగుల ను వెంటనే రెగ్యులైజేషన్ కు కావలసిన చర్యలను చేపట్టాలని అనేకమార్లు ముఖ్యమంత్రిని వివిధ రాష్ట్ర ,జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాతపూర్వకంగా సమ్మె నోటిస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే సమ్మెలోకి వెళ్ళామని.. తక్షణం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి చొర చూపాలని ప్రభుత్వానికి కోరారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెపుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవస్థ దోపిడి వ్యవస్థ అని.. కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి అందులో పని చేస్తున్న వారందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఓటు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వమ్ము కాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్వ శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మెలుగురి కృష్ణ, ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు, క్రాంతి లింగయ్య, వివిధ కేటగిరి ల ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.
Dec 14 2024, 00:09