NLG: ఈనెల 5 న జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్
నల్లగొండ: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు యశోద హాస్పిటల్, మలక్ పేట సౌజన్యంతో ఈనెల 5 వ తేదిన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్,నల్గొండ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆశ్వాక్ అహ్మద్, మలక్ పేట యశోదా హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సాజిద్ లు వివరాలు వెల్లడించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు. ఈనెల 5న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, హెల్త్ క్యాంపు నిర్వహణకు వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ యశోద హాస్పిటల్స్ ముందుకు వచ్చారన్నారు.
యశోద హాస్పిటల్స్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు ను జిల్లా కేంద్రం లో పని చేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మలక్ పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మెగా హెల్త్ క్యాంపులో కార్డియాలజీ, ఆర్థోపెటిక్, గైనిక్, షుగర్, బిపి, ఈసిజి, 2D ఈకో, BMD బోన్ మినరల్ టెస్ట్, వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులన్నీ చేస్తామని తెలిపారు.అందుబాటులో లేని టెస్టు లను మలక్ పేట యశోద హాస్పిటల్ లో 50 శాతం డిస్కౌంట్ తో చేస్తామని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెస్టులలో ఏమైనా అనారోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్ట్ హెల్త్ కార్డు ద్వారా యశోద హాస్పిటల్ లో వైద్యం అందజేస్తామన్నారు.
Dec 03 2024, 17:43