కాళేశ్వరం ప్రోజెక్ట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష !

- మైంటైన్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలపై దృష్టి

- పంపుల సమీక్షపై కొనసాగుతున్న చర్చ

- మేడిగడ్డ బ్యారేజ్ పై రేవంత్ రెడ్డి ఫోకస్

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది.

ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు చేపట్టాల్సిన మరమత్తులపై కీలక చర్చ నిర్వహించనున్నారు. ఇవాళ్టి సమావేశంలో మరమత్తులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ అధ్వర్యంలో నియమించిన ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తన్నారు.

ప్రధాని మోడీ ఆస్తుల విలువ తెలుసా ?

- సొంత ఇల్లు, కారు లేవు.. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రధాని వెల్లడి

- వారాణసీ నుంచి నామినేషన్ 

- గంగా సప్తమి పర్వదినాన దాఖలు

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా.. మంగళవారం ఉదయం ఆయన జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశలో (జూన్‌ 1న) పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో వారాణసీ ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు మంగళవారమే. గంగాదేవి భూమికి దిగివచ్చిన గంగా సప్తమి, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో.. మోదీ ఈరోజును ఎంచుకున్నారు. నామినేషన్‌ వేయడానికి ముందు ఆయన దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేశారు.

అక్కడ జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ‘‘కాశీతో నా అనుబంధం అద్భుతమైనది, విడదీయలేనిది, పోలిక లేనిది. మాటల్లో చెప్పలేనిది. మీ అందరి ఆప్యాయతతో పదేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తురావట్లేదు. ఈరోజు గంగమ్మ తల్లి నన్ను తన దత్తత తీసుకుంది’’ అని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

ప్రతి బూత్‌లోనూ.. గతంలో పోలైన ఓట్ల కంటే 370 ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని సూచించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆయన ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ఈ చారిత్రక నియోజకవర్గం (వారాణసీ) నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం’’ అని పేర్కొన్నారు.

లండన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ !

- కుటుంబంతో జగన్‌ లండన్‌కు

- విమానం అద్దె గంటకు 12 లక్షలు!

- నలుగురు భద్రతాధికారుల ఖర్చే కోటిన్నర

- ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో?

- 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక

సీఎం జగన్‌ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మా త్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే! ఇది ప్రపంచంలోనే విలాసవంతమైనది.

విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు జగన్‌ తన కుటుంబంతో కలసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్‌కు బయల్దేరారు.

సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్‌ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి కోటిన్నర మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకొనే జగన్‌ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్‌ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు.

ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్‌ కుటుంబంతో కలసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్‌కు మంత్రులు జోగి రమేశ్‌, కొట్టు సత్యనారాయణ తదితరులు వీడ్కోలు పలికారు.

మాజి మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా !

మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది.

కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులతో కూడా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు.

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదనకు దిగారు.

ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకూ పోలీసులు సర్డి చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు.

Chhattisgarh:ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెట్రైతోల్నై అటవీప్రాంతంలో డీఆర్‌జీ సైనికులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి..

ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది.

తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ను సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్ ధ్రువీకరించారు..

Cabinet Meeting: నేడు క్యాబినెట్ భేటీ వ్యవసాయ రంగంపై ప్రధాన చర్చ?

Cabinet Meeting: కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నందున పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. . ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల బదిలీల సమస్యను ఇరు రాష్ట్రాల సమన్యాయంతో పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించగా.. సంబంధిత నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది..

జూన్‌ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచేలోపు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వంద రోజుల్లోనే ఐదు హామీలను హడావుడిగా అమలు చేశారు. ఆ పథకాల అమలుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలున్నాయి. లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు చర్చిస్తామన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాటు నెరవేర్చాల్సిన హామీలపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది..

రైతు పండించిన ప్రతి గింజకు బోనస్ ఇవ్వాలి

•పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవిగౌడ్

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో వడ్లకు కింటా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి నేడు మాట మార్చటం సబబు కాదని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవిగౌడ్ అన్నారు.

వరి నారు మడులు అలికిన నాటి నుండి వరి కోతల వరకు అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అని, పండిన పంటలో అధిక మొత్తం పెట్టుబడులకు పోతుంది ఆని ,చివరికి రైతుకు మిగిలేది ఏమ్ లేదని అన్నారు.

ఈ విధంగా నాన ఇబ్బందులు పడి పంటలు పండిస్తే సరైన ధర లేకపోతే రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అధికారం చేపట్టకముందు మీరు చెప్పిన మాట ప్రకారం రైతు పండించిన ప్రతి గింజకు ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని రవిగౌడ్ కోరారు.

భారత్ వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస

ఐరాస: భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి (United Nations) సవరించింది. దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని తెలిపింది..

2024లో భారత్‌ 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధిరేటును (Growth Rate) నమోదు చేస్తుందని ఐరాస (United Nations) అంచనా వేసింది. బహిర్గత డిమాండ్‌ తక్కువగా ఉంటుందని.. దీనివల్ల సరకుల ఎగమతిలో వృద్ధి దెబ్బతింటుందని తెలిపింది.

అదే సమయంలో ఔషధ, రసాయన ఎగుమతులు బలంగా పుంజుకుంటాయని పేర్కొంది. జనవరిలో 2024 భారత వృద్ధిరేటును ఐరాస 6.2 శాతంగా పేర్కొంది. దాన్ని ఇప్పుడు ఏకంగా 0.7 శాతం పెంచడం విశేషం. 2025 అంచనాలను మాత్రం సవరించలేదు.

భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం (Inflation) 2023 నాటి 5.6 శాతం నుంచి 2024లో 4.5 శాతానికి దిగొస్తుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. దక్షిణాసియా ప్రాంతవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంటుందని తెలిపింది. ద్రవ్యోల్బణం గరిష్ఠంగా ఇరాన్‌లో 33.6 శాతం, మాల్దీవుల్లో అత్యల్పంగా 2.2 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. బంగ్లాదేశ్‌, భారత్‌లో ఆహారపదార్థాల ధరలు కొంత తగ్గినప్పటికీ.. ఇంకా అధిక స్థాయుల్లోనే ఉన్నాయని తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో 2.7 శాతం, 2025లో 2.8 శాతం వృద్ధిరేటును (Growth Rate) నమోదు చేస్తుందని ఐరాస (United Nations) అంచనా వేసింది. 2024 అంచనాలను 0.3 శాతం పెంచడం విశేషం. అమెరికా సహా బ్రెజిల్‌, భారత్‌, రష్యా వంటి వర్ధమాన దేశాల్లో బలమైన వృద్ధే అంచనాలను పెంచడానికి దోహదం చేసిందని తెలిపింది. అధిక ద్రవ్యోల్బణంతో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలు తక్కువ వృద్ధిరేటుకు పరిమితం కానున్నాయని వెల్లడించింది.

టీపీసీసీ అధ్యక్ష పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా ?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనపడుతోంది.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అయితే పీసీసీ అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది.

ఏపీలో ఎన్నికల హింసపై ఈసీ కొరడా - ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్​పై చర్యలకు ఆదేశం

రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తరువాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు కీలక అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. మూడు జిల్లాలోని 12 మంది డీఎస్పీలపైనూ విచారణకు ఆదేశించింది. ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదించాలని స్పష్టం చేసింది.

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ అనంతరం రాష్ట్రంలో చోటు చేేసుకున్న పరిణాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హింసాఘటనలకు బాధ్యులను చేస్తూ, మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్‌ పోలీస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.

హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

ఆ అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోండి

పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

వరుస ఘటనలు జరుగుతున్నా ఎందుకు అదుపు చేయలేక పోయారు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని 9వ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడులకు పాల్పడ్డారు. పోలింగ్ మరుసటి రోజున 14వ తేదీన వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడిచేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపుచేయలేక విఫలమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డా.వినోద్ కుమార్ ను నివేదిక కోరింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది.

ఓట్ల లెక్కింపు పూర్తయిన బలగాలను కొనసాగించాలని ఆదేశం

తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పటేల్‌పైనూ సీఈసీ బదిలీ వేటు వేసింది. శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి ఘటనలో విఫలం చెందారని ఈసీ భావించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులుపెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది.