తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !
- తగ్గనున్న భానుడి భగభగ
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...
వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది.
నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి .
ఏపీలో ఇలా..!
విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది.
మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !
అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
May 09 2024, 12:51