కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు..?
- త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ
- కాంగ్రెస్‌లో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు.
తాజాగా.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ అయిందిన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరనున్నట్లు కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆరుగురు నామినేషన్ కంటే ముందు తనను సంప్రదించారని మరో బాంబ్ పేల్చారు.
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిందేలు ఎవరూ లేరని.. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంటుందని.. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు పెరుగుతుందని చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటంపైనా కోమటిరెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణ పరువు తీస్తున్నారని ఫైరయ్యారు.
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని.. జూన్ 5న వారు హస్తం గూటికి చేరనున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 154కు చేరుకుంటుందని... ఇందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
May 09 2024, 11:57