కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !
- కవితకు మళ్లీ చుక్కెదురు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న కవితకు.. కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. పైగా.. కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న కోర్టు.. ఇప్పుడు మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్‌లో ఉంచారు. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే.. ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కేసం పిటిషన్లు వేస్తూ ఉంటే.. ఈడీ, సీబీఐ మాత్రం కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ పిటిషన్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. న్యాయస్థానం కూడా ఈడీ, సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించటమే కాకుండా కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది.
ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నాయి. ఇందుకు గానూ.. ఆప్‌కు కవిత రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని అభియోగం మోపగా.. ఆ రూ.100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారంటూ వాధిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. కాగా.. బెయిల్ ఇవ్వటం వల్ల.. సాక్ష్యాధారాలను కవిత తారుమారు చేసే అవకాశాలున్నాయంటూ న్యాయస్థానం ముందు అధికారులు వాధిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము పలు ఆధారాలు సేకరించామని.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని.. కవితను విచారిస్తే తమకు కావాల్సిన వివరాలు దొరుకుతాయంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు. దీంతో.. అటు బెయిల్ దొరకట్లేదు.. ఇటు కస్టడీ కూడా పొడిగిస్తూ వస్తున్నారు.
అయితే.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కావాలనే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని.. ఇప్పుడు కూడా విచారణ పేరుతో కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు.. ఎన్నికలయ్యే వరకు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బెయిల్ రాకుండా.. కస్టడీని పొడిగిస్తూ.. కవితను జైలులోనే ఉండేలా చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
May 08 2024, 15:20