NLG: బైక్ ను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

చింతపల్లి: మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై మదనాపురం గేటు సమీపంలో, బైక్ పై వెళుతున్న పాండురంగారెడ్డి ని డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్ హరిచందన

నల్లగొండ: జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 

నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి, వాటి పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లా స్థాయితో పాటు, కిందిస్థాయి అధికారులు సైతం ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

NLG: గృహజ్యోతి లబ్ధిదారుల తో ముఖాముఖి మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుండి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద 200 రూపాయల లోపు బిల్లులు వచ్చిన అర్హులైన పేద వారికి విద్యుత్ బిల్లుల మాఫీ, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ వంటివి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఈ రోజూ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడారు. గృహజ్యోతి పథకం కింద నల్గొండ జిల్లాలో లక్ష 82 వేల మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు. 200 రూపాయల లోపు విద్యుత్ బిల్లులు వచ్చే అర్హులైన గృహ జ్యోతి లబ్ధిదారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది అన్నారు. 10 రోజుల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని, ముఖ్యంగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని చూపించి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో మామిళ్ళ గూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

3 నెలల్లో మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామని, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్ , డిఇ వెంకటేశ్వర్లు, ఏ డి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు

NLG: లెంకలపల్లి లో పల్స్ పోలియో కార్యక్రమం

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ వద్ద పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వర్ణలత పాల్గొని మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

NLG: జనం హృదయంలో నిలిచిన పగడాల కనకయ్య ఫౌండేషన్

నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం:

నిరంతరం సేవలందిస్తున్న పగడాల కనకయ్య ఫౌండేషన్ మరోసారి సాయం అందించి జనం హృదయంలో నిలిచింది. గొడకొండ్ల రిజర్వాయర్ లో పనిచేస్తున్న రషీద్ అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మానవత దృక్పథంతో చింతపల్లి మండలం, మాల్ లో గల శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.20,000 ఆర్థిక సాయం చేశారు. ఫౌండేషన్ సభ్యులు శిరీష, కళ్యాణ్, మొగిలి కిషన్, తదితరులు ఉన్నారు.

NLG: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు అభినందనీయం: కుంభం నర్సిరెడ్డి

త్వరలో వేసవికాలం సాయంత్రం పూట ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో సీనియర్ సిటిజన్ ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహణ-బొమ్మపాల గిరిబాబు

నల్లగొండ: ప్రతి ఆదివారం పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో CSL ఫుట్బాల్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు CSL ఫుట్బాల్ లీగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా యోగ అసోసియేషన్, మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులైన కుంభం నర్సిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుంభం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన ఎంతోమంది జాతీయస్థాయి కబడ్డీ, మరియు ఫుట్బాల్ క్రీడాకారులు తయారవుతున్నారని తెలియజేస్తూ, స్పోర్ట్స్ క్లబ్ సేవలు చిరస్మరణీయమని తెలియజేశారు. అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.

చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి CSL లీగ్ పోటీల్లో పాల్గొనడానికి 50 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం సాగుతుందని తెలియజేశారు.

రాబోయే వేసవికాలంలో సీనియర్ సిటిజన్స్ కు మరియు ఉద్యోగస్తులకు కూడా సాయంత్రం పూట ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో సీనియర్ సిటిజన్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని గిరిబాబు తెలిపారు.

మాడుగుల శ్రావణ్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు సేవ చేసే అవకాశం రావడం నాకు చాలా సంతృప్తినిచ్చిందని, భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, మాడుగుల శ్రావణ్ ,రాచూరి గణేష్, యువ నగేష్, వెంకట సాయి, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

Ads

NLG: ముకుందాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం

నల్లగొండ జిల్లా: నిడుమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలో, ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్, ఏఎన్ఎం సుచిత్ర పాల్గొని మాట్లాడుతూ.. 0 - 5 పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించాలని తల్లిదండ్రులను కోరారు. పలువురు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

నేటి నుండి మరో రెండు రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆశాలు గోవిందమ్మ, సైదాబీ, అంగన్వాడీ టీచర్ మనెమ్మ, వాలంటీర్ స్వప్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

NLG: CPI (ML) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు మెమోరాండం

నల్గొండ: సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు అవుట్ సోర్సింగ్ కార్మికులు.. ఏజెన్సీ కాంట్రాక్టర్ వేధింపుల మూలంగా నిన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఘటనపై విచారణ జరిపి, సంబంధిత ఏజెన్సీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఇందూరు సాగర్, జ్వాల వెంకటేశ్వర్లు, బొమ్మిడి నగేష్, బివి.చారి, రావుల వీరేశ్, జానపాటి శంకర్ ఉన్నారు.

NLG: జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో క్యాంపస్ క్లీనింగ్

నల్లగొండ: ఈ రోజు స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) నందు జాతీయ సేవా పథకం ( ఎన్. ఎస్. ఎస్) యూనిట్ - 1 ఆధ్వర్యంలో, కళాశాల "క్యాంపస్ క్లీనింగ్" కార్యక్రమంలో భాగంగా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల పార్కింగ్ పరిసరాలలో మరియు గ్రంథాలయం వెనుక వైపు ఉన్న చెత్తను, కంప చెట్లను తొలగించి కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్- 1 ప్రోగ్రాం ఆఫీసర్ ఈ.యాదగిరి రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, లైబ్రేరియన్ డా.దుర్గాప్రసాద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

NLG: జిల్లా రెవెన్యూ అధికారిణి గా రాజ్యలక్ష్మి

నల్లగొండ: జిల్లా రెవెన్యూ అధికారిణిగా డి.రాజ్యలక్ష్మి, శనివారం బాధ్యతలు స్వీకరించారు.

డిఆర్ఓ గా పదవి భాద్యతలు చేపట్టిన రాజ్యలక్ష్మి కి కలెక్టర్ కార్యాలయంలో ఏఓ మోతిలాల్, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన డిఆర్ఓ రాజ్యలక్ష్మి జిల్లా కలెక్టర్ హరిచందన ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.