NLG: ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వడ్డేపల్లి గ్రామ వాసి బుషిపాక సునీత

నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బుషిపాక. సునీత ఇటీవల వెలువడిన గురుకుల పరీక్ష ఫలితాల్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన సునీత.. చిన్నప్పటి నుండి చదువుల్లో తనకు ఉన్న జిజ్ఞాసను గమనించిన ఆమె తల్లిదండ్రులు బుషిపాక సాలమ్మ- రాములు, పై చదువులు చదువుటకు ప్రోత్సాహించారు. 

ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త డాక్టర్ జి.వంశీధర్ సహకారంతో పరీక్షలకు సన్నద్దమై D.L, J.L ఉద్యోగాలు సాధించడంతో పలువురు అభినందించారు. తన విజయంలో కుటుంబం, స్నేహితులు, గ్రామస్థుల సహకారం ఉన్నదని సునీత తెలిపింది.

NLG: ఈ నెల 16 న 'జాతీయ లోక్ అదాలత్'

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో ఈనెల 16 న, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు పర్యవేక్షణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సంస్థ సెక్రటరీ బి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్ లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహనాల, ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాల కేసులు పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయాన్ని పొందాలని వారు సూచించారు.

NLG: ఈ నెల 4న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం, ఈనెల నాలుగో తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి, పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరుకావాలని ఈ సందర్భంగా కోరారు.

NLG: బూర నర్సయ్య గౌడ్ ను కలిసిన మర్రిగూడ మండల బీజేపీ నాయకులు

ఈ రోజు భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా, మర్రిగూడ మండల బీజేపీ నాయకులు హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిసి, ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పిట్టల శ్రీనివాస్, గ్యార గోపాల్, చాపల వెంకన్న, కుక్కల వెంకటేష్, బోయపల్లి రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

NLG: "నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత" పై సెమినార్.. ప్రసంగించిన హెచ్ సి యూ ప్రొఫెసర్

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం మరియు ఇండియన్ ఉమెన్ మ్యాథమెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శుక్రవారం "నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అర్చనా మోరే  ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత, రేఖీయ బీజగణిత ప్రాధాన్యత, అదేవిధంగా గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే అవకాశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. 

ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగ అధిపతి నక్క నరసింహ మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులు కూడా గణితశాస్త్రంలో సులభంగా రాణించవచ్చు, అదేవిధంగా గణిత శాస్త్ర విద్యార్థులు కేంద్ర మరియు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు అని అన్నారు. గణిత శాస్త్రం వల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో మంచి అవకాశాలు పొందుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. మ్యాథమెటికల్ టాలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డి. మధుకర్, కనకయ్య, సీకే రజిని, కే.బాల, రాజశేఖర్, వెంకట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించిన తుమ్మలపల్లి వాసి

నల్లగొండ జిల్లా:

చండూరు: మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బత్తుల వినోద్ కుమార్, ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాలలో గురుకులం జూనియర్ లెక్చరర్, గురుకులం పి జి టి ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం పట్ల, మండలంలో ఆయనను పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

.

TS: నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌

‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది.

NLG: ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై కళాశాలకు మంచి పేరు తేవాలి: ఎస్సై నాగరాజు

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం, బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టూ టౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థినిలు, కళాశాలలో అన్ని వసతులు వినియోగించుకొని ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై, కళాశాలకు మంచి పేరు తేవాలని, అలాగే బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థినులు.. రెండవ, మూడవ సంవత్సర విద్యార్థుల నుంచి అన్ని విషయాలపై అవగాహన చేసుకుని మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ కళాశాలలో అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయని, ఉత్తమ విద్యను బోధించేందుకు మంచి నిపుణులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో మంచి ఆటస్థలం, గ్రంథాలయం మరియు ఇతరత్రా అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని వినియోగించుకొని కళాశాలకు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీకాం డిపార్ట్మెంట్ హెడ్ జబీన్, అధ్యాపకులు ఎస్. రాజు, శైలజ, సుధాకర్, రేణుక, రమేష్, మరియు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవవాని, భాస్కర్ రెడ్డి, అపర్ణ, చతుర్వేది, రాజశేఖర్, మల్లికార్జున్, శంకర్, హసేన, గ్రంథాల శాఖ అధ్యాపకులు డాక్టర్ సుంకర రాజారామ్, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

నల్లగొండ: ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలిపిన ఇసుక ట్రాక్టర్ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పెట్టిన ఇసుక ట్రాక్టర్లు మొత్తం 16 వెహికల్ లకు గాను 15 వెహికల్ లకు రాంగ్ పార్కింగ్ మరియు డాక్యుమెంట్స్ లేని కారణంగా ఒక్కొక్క బండికి రూ.1100/- చొప్పున 15 బండ్లకు రూ.16,500/- ఫైన్ వేయడం జరిగిందని ట్రాఫిక్ సీఐ డానియల్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని హెచ్చరించారు.

NLG: జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ -1861 అమలు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మార్చి 1 నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.