నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 12:33

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి..

ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుని జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న కూడా జ్వరంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపితో కలిసి ఆమె సమావేశాల్లో పాల్గన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 09:33

వేముల అశ్విని వివాహ ప్రధాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి పుష్ప

శాలిగౌరారం,

ఊట్కూరు గ్రామపంచాయతీ సిబ్బంది వేముల లింగస్వామి కూతురు వేముల అశ్విని వివాహ ప్రధానం ఊట్కూరు గ్రామంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప శనివారం రాత్రి అశ్విని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది వేముల అందీప్, పాస్టర్ హనోక్, జహంగీర్ ,బాష పాక చంద్రశేఖర్, యాదగిరి ,కుర్ర సురేష్ ,వేముల ఇద్దయ్య, వేముల గోపీనాథ్, ధన శేఖర్,మేడి రమేష్, వేముల పవన్,వేముల భాస్కర్, వేముల జనార్దన్, వేముల వెంకటేష్ ,గ్రామస్తులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 08:32

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది..

రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు..

ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, మదాపూర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఎక్కడా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కాలేదు. అటు.. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేయడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 08:30

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం!

•సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది..

దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది.

విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 21:51

ఉత్తమ సేవలందించిన 54,మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు.

2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవోను జారీచేశారు.

ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, డైట్‌కాలేజీల్లో పనిచేస్తూనే, ఉత్తమ సేవలందించినందుకు గాను వీరిని అవార్డులు వరించాయి.

హెడ్‌ మాస్టర్‌ కేటగిరిలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ,కేటగిరిలో 11 మంది, డైట్‌ లెక్చరర్‌ కేటగిరిలో ఒకరు, స్పెషల్‌ కేటగిరిలో 12 మంది టీచర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో సన్మానిస్తారు. అలాగే అవార్డు కింద రూ. 10వేల నగదుతో పాటు సర్టిఫికేట్‌, మెడల్‌ అందజేస్తారు...

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 19:25

jamili Elections: జమిలి ఎన్నికల కమిటీ.. 8 మంది సభ్యులు వీళ్లే..

దిల్లీ: జమిలి ఎన్నికల (Jamili Elections) కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది..

కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌,

సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గుచూపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 18:44

నన్ను చంపేందుకు బీఆర్‌ నాయుడు ప్లాన్‌ చేస్తున్నాడు: పోసాని

హైదరాబాద్‌: ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్‌నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు..

చంపించడం అనేది బీఆర్‌ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు.

కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు.

బీఆర్‌ నాయుడికి దివంగత నేత వైఎస్సార్‌ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్‌ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 17:39

చం‍ద్రబాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి: విజయసాయిరెడ్డి

తాడేపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించిన విషయం తెలిసిందే..

ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఇక, ఐటీ నోటీసులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అక్రమాలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..'అమరావతి అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉంది' అని స్పష్టం చేశారు..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 17:38

అధికారంలోకి వస్తే కరెంట్‌ ఛార్జీలు పెంచం: చంద్రబాబు

కాకినాడ: కరెంట్‌ కోతలతో జగన్‌ ప్రభుత్వం ప్రజలను అనేక కష్టాలు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు..

కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్‌-2 సమావేశంలో ఆయన మాట్లాడారు. '' కరెంట్‌ లేక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు.

డబ్బు సంపాదన తప్ప వైకాపా నేతలకు మరో పని లేదు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారు.'' అని చంద్రబాబు విమర్శించారు. ఇసుక దొరక్క పేదలు ఇళ్లు కట్టుకోలేక పోతున్నారని అన్నారు. తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 17:37

Korutla: దీప్తి హత్యకేసులో చందన, ఆమె ప్రియుడే హంతకులు

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈకేసులో ప్రధాన నిందితులు చందన, ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు..

శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్‌ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ''ఆర్మూరు-బాల్కొండ రోడ్‌లో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్‌ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. దీప్తి చెల్లెలు బంక చందన 2019లో హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ జాయిన్‌ అయ్యారు. రెండేళ్ల తర్వాత డిటెయిన్‌ అయ్యారు. అదే కాలేజీలో చదివిన హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ చందనకు పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామనుకున్నారు.

గత నెల 19న ఉమర్‌ కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయం మాట్లాడాడు. ఇద్దరం లైఫ్‌లో సెటిల్‌ కాలేదు.. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలని ఉమర్‌ చెప్పాడు. ఆ తరువాత ఉమర్‌కు కాల్‌ చేసి చందన.. ఇంట్లో ఎవరూ లేరూ నేను మాఅక్క మాత్రమే ఉన్నాం.. కోరుట్ల రావాలని చెప్పింది. దీంతో ఉమర్‌ 28వ తేదీ ఉదయం కోరుట్ల చేరుకున్నాడు. పథకం ప్రకారం చందన.. దీప్తి కోసం వోడ్కా , బ్రీజర్‌ తెప్పించింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది. దీప్తి నిద్రలోకి జారుకున్న తర్వాత .. ఉమర్‌కు ఫోన్‌ చేయడంతో ఇంటికి వచ్చాడు. చందన, ఉమర్‌ కలిసి ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా దీప్తి చూసి కేకలు వేసింది. దీప్తి మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరుస్తుండటంతో ఉమర్‌, చందన గట్టిగా పట్టుకుని.. దీప్తి ముఖానికి చున్నీ చుట్టి, మూతి, ముక్కుకు ప్లాస్టర్‌ వేశారు.

10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.1.20లక్షల నగదు, 70తులాల బంగారం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు మూతికి చుట్టిన ప్లాస్టర్‌ తీసేసి సహజ మరణంగా చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నాగ్‌పూర్‌ వెళ్లి స్థిరపడేందుకు బయల్దేరారు. ఈక్రమంలో ఆర్మూర్‌ రోడ్డులో శనివారం ఉదయం నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ (అడ్డగుట్ట ప్రగతినగర్‌, హైదరాబాద్‌), అతని తల్లి సయ్యద్‌ అలియా, షేక్‌ అసియా ఫాతిమా, హఫీజ్‌ను అరెస్టు చేశాం. నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం'' అని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు..