చం‍ద్రబాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి: విజయసాయిరెడ్డి

తాడేపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించిన విషయం తెలిసిందే..

ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఇక, ఐటీ నోటీసులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అక్రమాలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..'అమరావతి అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉంది' అని స్పష్టం చేశారు..

అధికారంలోకి వస్తే కరెంట్‌ ఛార్జీలు పెంచం: చంద్రబాబు

కాకినాడ: కరెంట్‌ కోతలతో జగన్‌ ప్రభుత్వం ప్రజలను అనేక కష్టాలు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు..

కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్‌-2 సమావేశంలో ఆయన మాట్లాడారు. '' కరెంట్‌ లేక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు.

డబ్బు సంపాదన తప్ప వైకాపా నేతలకు మరో పని లేదు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారు.'' అని చంద్రబాబు విమర్శించారు. ఇసుక దొరక్క పేదలు ఇళ్లు కట్టుకోలేక పోతున్నారని అన్నారు. తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు..

Korutla: దీప్తి హత్యకేసులో చందన, ఆమె ప్రియుడే హంతకులు

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈకేసులో ప్రధాన నిందితులు చందన, ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు..

శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్‌ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ''ఆర్మూరు-బాల్కొండ రోడ్‌లో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్‌ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. దీప్తి చెల్లెలు బంక చందన 2019లో హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ జాయిన్‌ అయ్యారు. రెండేళ్ల తర్వాత డిటెయిన్‌ అయ్యారు. అదే కాలేజీలో చదివిన హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ చందనకు పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామనుకున్నారు.

గత నెల 19న ఉమర్‌ కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయం మాట్లాడాడు. ఇద్దరం లైఫ్‌లో సెటిల్‌ కాలేదు.. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలని ఉమర్‌ చెప్పాడు. ఆ తరువాత ఉమర్‌కు కాల్‌ చేసి చందన.. ఇంట్లో ఎవరూ లేరూ నేను మాఅక్క మాత్రమే ఉన్నాం.. కోరుట్ల రావాలని చెప్పింది. దీంతో ఉమర్‌ 28వ తేదీ ఉదయం కోరుట్ల చేరుకున్నాడు. పథకం ప్రకారం చందన.. దీప్తి కోసం వోడ్కా , బ్రీజర్‌ తెప్పించింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది. దీప్తి నిద్రలోకి జారుకున్న తర్వాత .. ఉమర్‌కు ఫోన్‌ చేయడంతో ఇంటికి వచ్చాడు. చందన, ఉమర్‌ కలిసి ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా దీప్తి చూసి కేకలు వేసింది. దీప్తి మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరుస్తుండటంతో ఉమర్‌, చందన గట్టిగా పట్టుకుని.. దీప్తి ముఖానికి చున్నీ చుట్టి, మూతి, ముక్కుకు ప్లాస్టర్‌ వేశారు.

10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.1.20లక్షల నగదు, 70తులాల బంగారం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు మూతికి చుట్టిన ప్లాస్టర్‌ తీసేసి సహజ మరణంగా చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నాగ్‌పూర్‌ వెళ్లి స్థిరపడేందుకు బయల్దేరారు. ఈక్రమంలో ఆర్మూర్‌ రోడ్డులో శనివారం ఉదయం నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ (అడ్డగుట్ట ప్రగతినగర్‌, హైదరాబాద్‌), అతని తల్లి సయ్యద్‌ అలియా, షేక్‌ అసియా ఫాతిమా, హఫీజ్‌ను అరెస్టు చేశాం. నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం'' అని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు..

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ ఫోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిననలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు..

రూ.50కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల కొకైన్ ను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. లావోస్ నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తున్న తరుణంలో పట్టుబట్టారు. లావోస్ నుంచి ఢిల్లీకి చేరుకొని.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు.

వీరు బ్యాగ్ కింది భాగంలో డ్రగ్స్ పెట్టారు. కింది భాగంలో కొకైన్ నింపి నలుగురు మహిళలను తనిఖీ చేయగా కొకైన్ వెలుగులోకి వచ్చింది. కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు వద్ద నుంచి తీసుకొస్తారనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.50కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. లావోస్ లో వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు. హైదరాబాద్ లో ఎవరికీ డెలివరీ చేయనున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది: మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలోని కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సూటిగా ప్ర‌శ్నించారు. కొల్లూరులో శనివారం డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

కొన్ని రాజ‌కీయ పార్టీల జీవిత‌మంతా ధ‌ర్నాలే అని ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్ర‌జ‌లను గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ స‌ర్కార్ మాత్రం పేద‌ల‌ను గుండెల్లో పెట్టి చూసుకుంటుంద‌న్నారు. ఇవాళ ప్ర‌తిప‌క్షాలు అనేక ర‌కాల మాట‌లు చెప్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నాయి.

మీరు ఆలోచించండి.. ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు కల్యాణ‌ల‌క్ష్మి కార్య‌క్ర‌మం తెచ్చింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. బ‌స్తీ ద‌వఖానాల్లో పేద రోగుల‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వాల హయాంలో న‌ల్లా బిల్లు క‌ట్ట‌క‌పోతే తెల్లారేస‌రికి క‌నెక్ష‌న్ క‌ట్ చేసేవారు. కేసీఆర్ హ‌యాంలో మంచినీళ్లు అందించాం. ధ‌ర్నాలు లేనే లేవు అని స్ప‌ష్టం చేశారు.......

YS Sharmila : వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే..

హైదరాబాద్ : పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే..

సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని సోనియా, రాహుల్ తనతో అన్నారన్నారు.

కేసీఆర్ అవినీతి పాలను అంతమెందిచటానికే సోనియాతో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. కేసీఆర్‌ను గద్దె దించే అంశంపై సోనియా, రాహుల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు వెల్లడించారు. తమ క్యాడర్, లీడర్స్‌తో మాట్లాడాక విలీనంపై మీడియాకు చెప్తానన్నారు. తెలంగాణలో తాను 3,800 కి.మీ పాదయాత్ర చేశానని షర్మిల పేర్కొన్నారు..

కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు మంచి జరుగుతోందన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకు చెబుతున్నానని.. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదన్నారు. తనతో నడిచిన వారిని తనతో పాటు నిలబెడుతానని షర్మిల పేర్కొన్నారు..

ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక రాయిని దాటింది: సీఎం కేసీఆర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్ష పరిశోధనవిజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రో ప్ర‌యోగించిన‌ ఆదిత్య ఎల్‌1,స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత క‌క్ష్య‌లోకి చేరుకున్న‌ది. విజ‌య‌వంతంగా పీఎస్ఎల్వీ సీ57 నుంచి ఆదిత్య వేరుప‌డింది. దీంతో మిష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు ఇవాళ‌ ఇస్రో ప్ర‌క‌టించింది. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ త‌న జ‌ర్నీ మొద‌లుపెట్టిన‌ట్లు ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు.

సుమారు 1.04 నిమిషాల త‌ర్వాత రాకెట్ నుంచి వేరుప‌డిన ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య‌లోకి చేరింది. ఉద‌యం 11.50 నిమిషాల‌కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. నిర్దేశిత క‌క్ష్య‌లోకి ఆదిత్య ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పేర్కొన్న‌ది. ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్యుడి సౌర‌యానం మొద‌లైన‌ట్లు వెల్ల‌డించింది...

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

వైఎస్సార్‌: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్‌.. తల్లి వైఎస్‌ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు.

ఓటుందా తెలుసుకో.. లేదంటే దరఖాస్తు చేసుకో

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. పాలకులను ఎన్నుకునేది ఓటర్లే. ఈ క్రమంలో ఓటుహక్కు.. వజ్రాయుధం మాదిరిగా పనిచేస్తుంది. అందుకే అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఆరు నెలల ముందే కసరత్తు ప్రారంభించింది. ఓటుహక్కు ప్రాధాన్యం, ఓటరు నమోదుకు అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా శని, ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించనుంది. ఆగస్టు 26, 27 తేదీల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో నమోదైన ఓటర్లతో కూడిన ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది.

ఈ నెల 19 వరకు గడువు

రాబోయే శాసనసభ ఎన్నికల్లో కొత్తగా ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ఈనెల 19 వరకు Ëఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు అదే తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటరు నమోదుకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను శని, ఆదివారం నిర్వహించనుంది.

గ్రామాల్లో విస్తృత ప్రచారం

తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా గ్రామాల్లో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫారమ్‌-6 ద్వారా నూతన ఓటుహక్కు, ఫారమ్‌-7 ద్వారా ఓటు తొలగింపు, ఫారమ్‌-8 ద్వారా తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారు. బీఎల్‌ఓలకు కలెక్టర్లు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

అక్టోబరు 4న తుది జాబితా

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు తుది జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదవటానికి అవకాశం కల్పిస్తోంది. ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువులోపు అందిన దరఖాస్తులను సెప్టెంబరు 28 వరకు అధికారులు పరిశీలిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం అక్టోబరు 1న జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాక అక్టోబరు 4న ఓటరు తుది జాబితాను వెల్లడిస్తారు.

Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం..

హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..

శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్‌లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు..