YS Sharmila : వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే..

హైదరాబాద్ : పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే..

సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని సోనియా, రాహుల్ తనతో అన్నారన్నారు.

కేసీఆర్ అవినీతి పాలను అంతమెందిచటానికే సోనియాతో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. కేసీఆర్‌ను గద్దె దించే అంశంపై సోనియా, రాహుల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు వెల్లడించారు. తమ క్యాడర్, లీడర్స్‌తో మాట్లాడాక విలీనంపై మీడియాకు చెప్తానన్నారు. తెలంగాణలో తాను 3,800 కి.మీ పాదయాత్ర చేశానని షర్మిల పేర్కొన్నారు..

కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు మంచి జరుగుతోందన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకు చెబుతున్నానని.. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదన్నారు. తనతో నడిచిన వారిని తనతో పాటు నిలబెడుతానని షర్మిల పేర్కొన్నారు..

ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక రాయిని దాటింది: సీఎం కేసీఆర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్ష పరిశోధనవిజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రో ప్ర‌యోగించిన‌ ఆదిత్య ఎల్‌1,స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత క‌క్ష్య‌లోకి చేరుకున్న‌ది. విజ‌య‌వంతంగా పీఎస్ఎల్వీ సీ57 నుంచి ఆదిత్య వేరుప‌డింది. దీంతో మిష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు ఇవాళ‌ ఇస్రో ప్ర‌క‌టించింది. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ త‌న జ‌ర్నీ మొద‌లుపెట్టిన‌ట్లు ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు.

సుమారు 1.04 నిమిషాల త‌ర్వాత రాకెట్ నుంచి వేరుప‌డిన ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య‌లోకి చేరింది. ఉద‌యం 11.50 నిమిషాల‌కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. నిర్దేశిత క‌క్ష్య‌లోకి ఆదిత్య ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పేర్కొన్న‌ది. ఎల్‌1 పాయింట్ దిశ‌గా ఆదిత్యుడి సౌర‌యానం మొద‌లైన‌ట్లు వెల్ల‌డించింది...

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

వైఎస్సార్‌: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్‌.. తల్లి వైఎస్‌ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు.

ఓటుందా తెలుసుకో.. లేదంటే దరఖాస్తు చేసుకో

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. పాలకులను ఎన్నుకునేది ఓటర్లే. ఈ క్రమంలో ఓటుహక్కు.. వజ్రాయుధం మాదిరిగా పనిచేస్తుంది. అందుకే అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఆరు నెలల ముందే కసరత్తు ప్రారంభించింది. ఓటుహక్కు ప్రాధాన్యం, ఓటరు నమోదుకు అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా శని, ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించనుంది. ఆగస్టు 26, 27 తేదీల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో నమోదైన ఓటర్లతో కూడిన ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది.

ఈ నెల 19 వరకు గడువు

రాబోయే శాసనసభ ఎన్నికల్లో కొత్తగా ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ఈనెల 19 వరకు Ëఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు అదే తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటరు నమోదుకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను శని, ఆదివారం నిర్వహించనుంది.

గ్రామాల్లో విస్తృత ప్రచారం

తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా గ్రామాల్లో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫారమ్‌-6 ద్వారా నూతన ఓటుహక్కు, ఫారమ్‌-7 ద్వారా ఓటు తొలగింపు, ఫారమ్‌-8 ద్వారా తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారు. బీఎల్‌ఓలకు కలెక్టర్లు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

అక్టోబరు 4న తుది జాబితా

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు తుది జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదవటానికి అవకాశం కల్పిస్తోంది. ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువులోపు అందిన దరఖాస్తులను సెప్టెంబరు 28 వరకు అధికారులు పరిశీలిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం అక్టోబరు 1న జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాక అక్టోబరు 4న ఓటరు తుది జాబితాను వెల్లడిస్తారు.

Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం..

హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..

శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్‌లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు..

జమిలి ఎలక్షన్లు వస్తేఎలా ❓️

జాతీయ రాజకీయాల్లో సంచలనం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ -2024 ప్రారంభించారు. తమకు అనుకూలంగా పరిణామాలను మలచుకొనేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం కనిపిస్తోంది.

మోదీ కొత్త లెక్కలు

ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం కోసం కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ సమావేశాల అజెండా బయటకు రాకపోయినా..మూడు కీలక బిల్లుల ఆమోదం కోసమేనే ప్రచారం సాగుతోంది. అందులో యూసీసీ బిల్లు, మహిళా బిల్లుతో పాటుగా జమిలి ఎన్నికల పైనా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

జమిలి ఎన్నికల వెనుక భారీ ప్లాన్ కనిపిస్తోంది. ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ లక్ష్యంగా రాజ్యంగ సవరణకు సిద్దం అవుతోంది. దీని ద్వారా పార్లమెంట్ తో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది అసలు లక్ష్యం. ఈ ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు వస్తే ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్

ఈ డిసెంబర్ లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల దిశగా పార్లమెంట్ లో బిల్లు లేదా రాజ్యంగ సవరణలు చేస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ గడవు ముగిసే సమయానికి కొత్త సభ్యులతో సభ కొలువు తీరాల్సి ఉంది.

Pawan Kalyan: ఆ నిస్పృహ వెంటాడేది.. అదే చివరి సినిమాకావాలనుకున్నా: పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఈ పేరే కొందరికి ఓ మంత్రం.. ఓ బ్రాండ్‌.. ఓ శక్తి.. ఒకప్పుడు ఒక్క స్నేహితుడూ లేని ఆయనకు ఇప్పుడు కోట్లమంది అభిమానులు..

తొలి సినిమానే చివరి సినిమా కావాలనుకున్న ఆయన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. శనివారం పవన్‌ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం..

ఈ ఏడాది జులైలో పవన్‌ కల్యాణ్‌ 'ఇన్‌స్టాగ్రామ్‌' ఖాతా తెరిచారు. ఒక్క పోస్ట్‌ పెట్టకపోయినా ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కొన్ని గంటల్లోనే మిలియన్‌కుపైగా చేరడం ఓ రికార్డు.

2014లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన ఇండియన్‌ సెలబ్రిటీ పొలిటిషియన్‌ పవన్‌ కల్యాణ్‌.

'ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ 100 సెలబ్రిటీస్‌' (2013) జాబితాలో పవన్‌ కల్యాణ్‌ 26వ స్థానంలో నిలిచారు.

కరాటేలో 'బ్లాక్‌ బెల్ట్‌' పొందిన అతి కొద్దిమంది నటుల్లో పవన్‌ ఒకరు.

అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీలో 2017లో నిర్వహించిన 'ఇండియా కాన్ఫరెన్స్‌'లో పవన్‌ ఇచ్చిన ఉపన్యాసం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ అరుదైన అవకాశం పొందిన కొద్దిమంది నటుల్లో పవన్‌ ఒకరు.

పవన్‌ నటించిన 'తొలిప్రేమ' జాతీయ అవార్డుతోపాటు వివిధ విభాగాల్లో ఆరు నంది పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.

'జాని', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లకు కథ, 'గుడుంబా శంకర్‌' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసింది పవనే. 'జాని'కి దర్శకత్వం కూడా వహించారు.

'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి', 'జానీ', 'గుడుంబా శంకర్‌', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తదితర చిత్రాల్లోని కొన్ని స్టంట్స్‌కు పవన్‌ కొరియోగ్రఫీ చేశారు.

'గుడుంబా శంకర్'లోని అన్ని పాటలు, 'ఖుషి'లోని పలు గీతాలు, 'పంజా' టైటిల్ సాంగ్‌కు పవన్‌ సాంగ్స్‌ విజువలైజర్‌గా వ్యవహరించారు. 'తాటి చెట్టెక్కలేవు..', 'బంగారు రమణమ్మలాంటి', 'కాటమరాయుడా'వంటి బిట్‌ సాంగ్స్‌ను ఆలపించి ఉర్రూతలూగించిన పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'ఛల్‌ మోహన్‌రంగ' తదితర చిత్రాలను నిర్మించారు.

పవన్‌కు దర్శకుడు త్రివిక్రమ్‌ మంచి స్నేహితుడనే సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పనిచేసిన తొలి చిత్రం 'గోకులంలో సీత'. ఈ చిత్రానికి నటుడు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. అప్పట్లో త్రివిక్రమ్‌ ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. అలా.. ఆ

చిత్రం కోసం త్రివిక్రమ్‌ రాసిన 'ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుడగకు మూలం' అనే డైలాగ్‌ పవన్‌కు బాగా నచ్చిందట. అయితే, అప్పట్లో త్రివిక్రమ్‌ ఎవరో పవన్‌కు తెలియదు. ఆ తర్వాత ఈ కాంబోలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు తెరకెక్కాయి.

సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. పారా గ్లైడింగ్ చేశారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించి కొంత తెలుసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు.

వెంటవెంటనే సినిమాలు చేసేయాలనే ఆలోచన పవన్‌కు ఉండదు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, అభిమానులను మెప్పించేగలిగే పవర్‌ఫుల్‌ రోల్స్‌, సందేశాత్మకమైన కథలనే ఎంపిక చేసుకుంటుంటారు. అందుకే.. 27 ఏళ్ల ప్రస్థానంలో పవన్ నటించిన సినిమాల సంఖ్య 28. వాటిలో 12 రీమేక్‌లు. ప్రస్తుతం 'ఓజీ' (OG), 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh), 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రాలతో బిజీగా ఉన్నారు.పలు సందర్భాల్లో పవన్‌ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే (Happy Birthday Power Star)..

వారి వల్లే బతికా..!

''చిన్నప్పుడు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యేవాణ్ని. అప్పట్లో నాకు స్నేహితులు లేరు. నేను ఇంటర్‌లో చేరే సమయానికి అన్నయ్య (చిరంజీవి) చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. నేను ఇంటర్‌ పాస్‌కానని నాకు అర్థమైంది. చదువు విషయంలో అమ్మ, నాన్న నన్ను ఒక్క మాట అనకపోయినా నాలో ఏదో అపరాధభావం. 'స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం' అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడడం వల్ల బతికి బయటపడ్డా. 'నువ్వు చదివినా చదవక పోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో' అని ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు (చిరంజీవి, నాగబాబు), సురేఖ వదిన అండగా నిలిచారు''

High Tension in Amalapuram: అమలాపురంలో హై టెన్షన్

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు..

పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తిని హత్యకు గురయ్యాడు. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు.

ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. వైసిపి నేత హత్యకు ప్రతిక్రియ చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు..

అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో గంధం పళ్ళంరాజు.. రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ ఘటనలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారం పై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉభయ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.. అయితే, మొత్తంగా తాజా హత్య మరోసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది..

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ టిపి అది నేత్రి షర్మిల ఘన నివాళి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్‌ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లెళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా ఇదే సీన్ రిపీట్ అవగా.. ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఎదురు చూశారు.

అయితే తండ్రి వర్ధంతి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు షర్మిళ చేరుకున్నారు. ఉదయమే తండ్రికి నివాళులర్పించిన షర్మిల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు. షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.....

సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్ : డైరెక్టర్ బలరామ్

సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్‌ అందుకుంటాడని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.

కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని, ఈ బకాయిలను నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు.

పర్సనల్‌, అకౌంట్స్‌, ఆడిటింగ్‌, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచే వేతన బకాయిల లెకింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు.

తొలుత వేతన బకాయిలకు సంబంధించిన ఆడిటింగ్‌ను, ఆ తర్వాత మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు వివరించారు.

ముందే చెల్లించేందుకు కృషి

వేతన బకాయిలను నెలరోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్‌ తెలిపారు. 11వ వేజ్‌ బోర్డు సిఫారసులను అందరికన్నా ముందే సింగరేణిలో అమలు జరిపామని, దీంతో సంస్థపై ఏటా దాదాపు రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు.

దీనికి రూ.1,726 కోట్ల ఎరియర్స్‌ను కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు అవుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగంలో ఉన్న కార్మికులకు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు......