రేపే గ్రేటర్ హైదరాబాద్ లో ఇండ్ల పండుగ...
రేపే ఇంటి పండుగ
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది.
ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్‌లో ఒకేరోజు 11, 700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
గ్రేటర్‌లో శనివారం డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపు
తొమ్మిది ప్రాంతాల్లో లాటరీ ద్వారా ఎంపిక
పంపిణీ చేయనున్న ఏడుగురు మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్
బహదూర్‌పల్లిలో 1700 లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్.. పటాన్‌చెరులో 3,300 మందికి అందజేయనున్న మంత్రి హరీశ్‌రావు
ఒకే రోజు 11,700 ఇండ్ల పంపిణీ
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది.
ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్‌లో ఒకేరోజు 11, 700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం బల్దియా పరిధిలోని తొమ్మిది ప్రాంతాలను వేదికలుగా ఏర్పాటు చేశారు. ఏడుగురు మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, మేయర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ముఖ్యంగా బహదూర్‌పల్లిలో జరిగే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ 1700 మందికి.. పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు 3,300 మందికి పంపిణీ చేయనున్నారు.
అగ్గిపెట్టెలాంటి రేకుల షెడ్డు.. ఒకే ఒక్క గది.. దానికి నెలకు రూ.3-4వేల అద్దె. యజమానికి ఎప్పుడు ఉండమంటాడో.. ఎప్పుడు ఖాళీ చేయమంటాడోనని క్షణక్షణం భయపడుతూ జీవనం. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగటు నిరుపేద పరిస్థితి. ఇలాంటి నిరుపేదకు సొంతింటి సాకారం సాధ్యమా? కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాకారం చేస్తున్నది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకడంతో పాటు మహా నగరంలో ఖరీదైన సొంతింటి కలను నెరవేర్చుకునే అదృష్టాన్ని కల్పించింది. అలా.. ఇలా.. కాదు… రెండు పడకలతో బహిరంగ మార్కెట్‌లో రూ.30-40 లక్షల విలువ చేసే పక్కా ఇంటిని నిర్మించి ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు అందించే సుముహూర్తం రానే వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం..
ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇండ్లను నిరుపేదలకు అందించగా నిర్మాణాలు పూర్తయిన దాదాపు 70వేల డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అందులో భాగంగా శనివారం ఒక్కరోజే ఏకంగా 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన దరిమిలా వారికి ఇండ్లను పంపిణీ చేసేందుకుగాను జీహెచ్‌ఎంసీ పరిధిలో తొమ్మిది ప్రాంతాలను వేదికగా ఏర్పాటు చేశారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, మేయర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 11,700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.
కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో 1700 గృహాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేస్తారు. గాజులరామారం (144), బహదూర్‌పల్లి (356), డి-పోచంపల్లిల్లో 1700 ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. గాజులరామారం (144), బహదూర్‌పల్లి (356) ఇండ్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లిలో నిర్మించిన 1200 గృహాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200మంది, సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని 500మంది, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
చాంద్రాయణగుట్టలో హోంమంత్రి మహమూద్ అలీ
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నంబరు 82, 83/పిలో నిర్మించిన 270 గృహాలు, బహదూర్‌పుర నియోజకవర్గం ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు. బండ్లగూడ పరిధిలో నిర్మించిన ఇండ్లను చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేయనుండగా, ఫారూక్‌నగర్‌లో నిర్మించిన ఇండ్లను బహదూర్‌పుర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్‌పూర్-2లో నిర్మించిన 3,300 గృహాలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1లోని 1500 గృహాలను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 156 మంది, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 144 మంది, పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అదేవిధంగా అమీన్‌పూర్-2లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది, కార్వాన్‌కు చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.
శేరిలింగంపల్లిలో మంత్రి తలసాని
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల సర్వే నంబరు 125లో నిర్మించిన 216 గృహాలు, సాయినగర్ హఫీజ్‌పేట్‌కు చెందిన 168 ఇండ్లను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పంపిణీ చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గృహాలను శేరిలింగంపల్లి పరిధిలోని లబ్ధిదారులకు అందజేయనున్నారు.
మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1500 గృహాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 500 మంది, ముషీరాబాద్‌కు చెందిన 500 మంది, సికింద్రాబాద్‌కు చెందిన 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేయనున్నారు.
రాజేంద్రనగర్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి
రాజేంద్రనగర్‌లో నిర్మించిన 356 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇండ్లు, నార్సింగి సర్వే నంబరు 117లో నిర్మించిన 196 గృహాలను రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఉప్పల్‌లో మేయర్ విజయలక్ష్మి
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్‌కాలనీ (సర్వే నంబరు 710/పి)లో నిర్మించిన 500 గృహాలను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పంపిణీ చేయనున్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.
ఘట్‌కేసర్ ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ప్రతాపసింగారంలో నిర్మించిన వెయ్యి గృహాలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మరో 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.
Sep 01 2023, 11:19