LPG cylinder: ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 చొప్పున తగ్గించింది.

ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్‌ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..

Pawan Kalyan: అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం: పవన్‌

అమరావతి: తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. మన మాతృభాషను దూరం చేసేవిధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు..

తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలని తపించి.. ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పవన్‌ కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుజాతి ఎన్నడూ గిడుగు రామ్మూర్తి సేవలను మరువకూడదని పవన్‌ పేర్కొన్నారు.

తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పవన్‌ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు.. విద్యాశాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షరదోషాలు ఉంటున్నాయో తెలుస్తోందని చెప్పారు. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేమన్నారు. చిన్నారులు ఓనమాలు నేర్చుకునే దశ నుంచే మన మాతృభాషను దూరం చేసేలా పాలకుల తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు రామ్మూర్తి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలని పవన్‌ కోరారు..

GPS: జీపీఎస్‌పై మంత్రుల కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు

అమరావతి: గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(GPS)పై సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు..

జీపీఎస్‌పై లిఖిత పూర్వక ప్రతిపాదనలు ఇచ్చేందుకు జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆస్కార్‌రావు తదితరులు హాజరయ్యారు.

సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం వెలుపల వేచి చూస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. జీపీఎస్‌ ఆర్డినెన్స్‌లోని అంశాలు బయటకు చెప్పకుండా చర్చలేమిటని సీపీఎస్‌ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Vikarabad: కరెంటు బిల్లుపై వివాదం.. తండ్రిని చంపిన కుమారుడు

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలోని అత్తెల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదం ఒక ప్రాణాన్ని బలిగొంది..

వివరాల్లోకి వెళ్తే.. అత్తెల్లి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్న ఇంటి కరెంటు బిల్లు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లును నువ్వు కట్టు అంటే.. నువ్వు కట్టు.. అంటూ పరస్పరం గొడవకు దిగారు.

ఈ గొడవ తారస్థాయికి చేరింది. దీంతో ఈ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ గ్రామ పెద్దల వరకు వెళ్లింది. గ్రామ పెద్దలు మాట్లాడుతుండగానే తండ్రి రామచంద్రయ్యపై కుమారుడు యాదయ్య రాడ్డుతో దాడి చేశాడు. దీంతో రామచంద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పంచాయతీ పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్‌ పోలీసులు తెలిపారు..

దర్శకుడు సెల్వమణి కి అరెస్ట్ వారెంట్

ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది.

2016లో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అందులో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు.

ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు సెల్వ మణికి ఆరెస్టు వారెంట్ జారీ చేసింది........

గంగుల క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి: మోహరించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కరీంనగర్ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు.

విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

పోలీసులు విద్యార్థి నాయకులను చెదరగొట్టి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు, ఏబీవీపీ నాయకులకు గాయలయ్యాయి..

కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్ ఆచరణ లో సాధ్యం కాని హామీలు: మంత్రి తలసాని

కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని కానీ, దేశంలో కానీ ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.

హైదరాబాద్‌ గోషామహల్‌లో బీసీ కులవృత్తిదారులకు ఆర్ధిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం మంత్రి పాల్గొన్నారు. ఓట్లు దండుకోవడం తప్ప ఏరోజూ ప్రజల గురించి కాంగ్రెస్‌ ఆలోచించలేదన్నారు. 50 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించారని, అప్పుడు పేదలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదా అని నిలదీశారు.

గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.3 లక్షలు ఇస్తుంటే.. వాళ్లు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఆ పార్టీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధికారం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, అలవికాని హామీస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని చెప్పారు. ఆ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లు కనీసం మూతి తూడ్చుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 2న 12 వేల డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు...

Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు విటుల అరెస్ట్‌

హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు..

మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

14 మంది యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక్కో యువతికి వారానికి రూ.15వేలు ఇస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్వాహకులు అంగీకరించారు..

Polavaram: నేడు 'పోలవరం' పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు..

ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.

ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్‌తో పాటు అప్పర్‌, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ల పరిస్థితి.. రెండు చోట్ల నీటి లీకేజీపై అధికారులు సమీక్షించనున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటికే జలశక్తి శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల అమలు తీరుతెన్నులపై కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులను కూడా పిలవాలని జలశక్తి శాఖ అధికారులు భావించినప్పటికీ చివరి నిమిషంలో వారిని వద్దనుకున్నట్లు సమాచారం. మంత్రిత్వశాఖలో చర్చించిన తర్వాతే రాష్ట్ర అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది..

ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్

నగరంలోని ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోన్ని మంగళసూత్రాన్ని దొంగలించాడు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నర తులాల బంగారం చైన్‌ను దొంగ అపహరించాడు.

బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా హన్మకొండలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శివారెడ్డి గూడ చౌరస్తాలో బస్ స్టాండ్‌లో బస్ కోసం మంజుల ఎదురు చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఓ దొంగ.. కంట్లో కారం కొట్టి మంగళ సూత్రం దొంగలించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...