గురుకుల విద్యార్థిని కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా :ఆగస్టు 29

జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ‌లో ఉన్న గంధవారి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు తెలిసింది.

ప్రమాదంలో అమ్మాయికి కాళ్లు, పళ్ళు విరగడంతో పాటు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు తెలియకుండా పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచిపెడుతున్నట్లు సమాచారం.

కాగా, విద్యార్థిని భవనంపై నుండి దూకడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అయితే, గురుకుల కాలేజీలో సరైన సౌకర్యాలు లేవని.. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదేమిటని టీచర్లను ప్రశ్నిస్తే విద్యార్థులను వేధింపులకు గురిచేస్తారంటూ అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు కాలేజీలోకి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే వాళ్లను కూడా లోనికి రాకుండా అడ్డుకుంటారని పిల్లలు తెలిపారు...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భర్తను హతమార్చిన భార్య

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే బాధలు భరించలేక, భార్య, తన తల్లిదండ్రుల‌తో కలిసి గొడ్డలితో నరికి దారుణంగా చంపేసింది. ఈ ఘటన నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సోమవారం రాత్రి జ‌రిగింది.

రూరల్ సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కృష్ణకు అదే కాలనీకి చెందిన గంగతో వివాహం అయ్యింది.

అయితే భర్త కృష్ణ, భార్య గంగతోపాటు అత‌ని అత్తామామలతో తరచూ గొడవ పడేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ భార్య తో వాగ్వాదానికి దిగాడు. దీంతో విసిగిపోయిన భార్య, ఆమె తండ్రి మురళి, త‌ల్లి స‌త్తమ్మ క‌లిసి గొడ్డలితో నరికి హత్య చేశారు.

మొదట భర్త కంట్లో కారం చ‌ల్లి, అనంతరం గంగ తండ్రి, మురళి, తల్లి సత్తమ్మ గొడ్డలి తీసుకుని కృష్ణ పై దాడి చేసి, నరికి వేశారు. బయటకు వచ్చిన కృష్ణ అక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు......

మ‌రో రెండు కొత్త మండ‌లాలకు నోటిఫికేష‌న్

తెలంగాణ‌లో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది. లేటెస్ట్‌గా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది..

ఇక‌.. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ని ప్ర‌భుత్వం విడుదల చేసింది.

వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొంది......

మహిళా సెక్యూరిటీ గార్డ్పై గ్యాంగ్ రేప్?

ఢిల్లీ సమీపంలోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న ఓ 19 ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డు గ్యాంగ్ రేప్కు గురైనట్టు తెలిసింది.ఆ మహిళ అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటికి తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఆ మహిళ పరిస్థితి విషమించడంతో సహోద్యోగులు బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని అజయ్ (32)గా గుర్తించి, అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఆ మహిళ జార్ఖండ్‌కు చెందినదని, హౌసింగ్ సొసైటీకి సమీపంలో తన అత్తతో కలిసి నివసిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, సొసైటీలోని బేస్‌మెంట్‌లో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత విషం తాగిచగా.. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారని ఆమె కుటుంబం ఆరోపించింది.

మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు అంటున్నారు. అయినా వారి కుటుంబం ఫిర్యాదు మేరకు అత్యాచారం సెక్షన్ (376 ఐపిసి) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి రూరల్ వివేక్ చంద్ యాదవ్ తెలిపారు.

బేస్‌మెంట్ లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాల నుంచి పోలీసులు ఫుటేజీని సేకరించారు.అందులో ఎలాంటి సామూహిక అత్యాచార ఘటన కనిపించలేదని ఆయన చెప్పారు.

ఆమె విషం తాగి చనిపోయిందా? ఊపిరితిత్తుల వ్యాధి వల్ల చనిపోయారా? అని నిర్ధారించుకోవడానికి ఆమె విసెరాను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపినట్లు చంద్ తెలిపారు...

Vizag: విశాఖ కంటైనర్‌ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన

జగదాంబ సెంటర్‌(విశాఖపట్నం): నగరంలోని కంటైనర్‌ టెర్మినల్ (వీసీటీ) వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్‌కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ధర్నాకు దిగారు..

దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

2002లో విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిని అధికారులు నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు.

ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్‌ టెర్మినల్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. మత్స్యకారుల ఆందోళనకు తెదేపా, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. విశాఖ పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు తాతాజీ, సీఐటీయూ నేత సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు..

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరగగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు.

దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్ , స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని అధికారులు తేల్చారు. మెయిల్‌ ఆధారంగా దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి- సీబీఐ కోర్టును కోరిన జగన్, విజయసాయిరెడ్డి..

ఎపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా విదేశీ పర్యటనలు చేయబోతున్నారు. వ్యక్తిగత పనుల కోసం ఈ పర్యటనలు చేయనున్నారు..

ఇందుకోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును అనుమతి కోరారు. దీనిపై సీబీఐ అభిప్రాయం తీసుకున్న తర్వాత సీబీఐ కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోతే మాత్రం విదేశీ టూర్లు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిస్తుంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకూ యూరప్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా లండన్ లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ తేదీల్లో విదేశీ పర్యటన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. సీబీఐ అంగీకరిస్తే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది..

అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాబోయే ఆరు నెలల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చారు. పలు యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం అమెరికా, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లాల్సి ఉందని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో విజయసాయిరెడ్డి తెలిపారు. వీటి కోసం ఆరు నెలల్లో 30 రోజుల పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సాయిరెడ్డి కోరారు. దీనిపైనా సీబీఐ అభిప్రాయం తెలుసుకున్నాక కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

గతంలో జగన్ అక్రమాస్తులకేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు కూడా ఉంది. ఈ మేరకు వీరిద్దరూ విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. గతంలోనూ సాయిరెడ్డి ఓసారి కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై స్పందించేందుకు సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది..

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శ్రీవారిని 68,263 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 28,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

టీఎస్‌ సెట్‌ దరఖాస్తుకు రేపే తుది గడువు

ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్‌.. రేపే టీఎస్‌ సెట్‌-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి గానూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియనుంది. కాగా, రూ.1500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 9వ తేదీ వరకు, రూ.3000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షలను అక్టోబర్‌ 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 13, 14వ తేదీలలో దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.అక్టోబర్‌ 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పీజీ ఉత్తీర్ణులైన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు టీఎస్‌ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

పేపర్‌ -1ను 50 ప్రశ్నలకు నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. పేపర్‌ -2లో 100 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఓసీలు 40 శాతం, రిజర్వేషన్‌ క్యాటగిరీలో 35 శాతం మార్కులు పొందితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు...

నేనేమైనా ఎన్టీఆర్ కు ఇల్లీగల్ భార్యనా? పురందేశ్వరి పై లక్ష్మీపార్వతి ఫైర్

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన కేంద్రం.. ఆయన సతీమణి లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై ఆమె ఇవాళ నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.

ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని లక్ష్మీపార్వతి తెలిపారు.

ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు......