GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది

దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలని.. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు కూటమి కట్టి.. నైతికత లేకుండా పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే.. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేని ఆరోపణలు చేశారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గమంతా దొంగలు అనడం.. రాహుల్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. ఈసారి తమకు అవకాశం ఇస్తే, సమస్యలను ప్రధాని మోడీకి చూపించి అభివృద్ధి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని.. ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన ఎంపీలు.. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్‌లో గానీ, సంబంధిత మంత్రులు గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్దపెద్ద నాయకులు ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కరెంట్ ఛార్జీలపై కీలక నిర్ణయం

2023-24కి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను రిలీజ్‌ చేశారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ , రిటైర్డ్‌ జస్టిస్‌ సీవి. నాగార్జునరెడ్డి. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 3 డిస్కంలకు(రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు) కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్‌ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు.

సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్‌ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్‌ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.

జనసేనానితోనే నా ప్రయాణం.. ఆదేశిస్తే సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తా.. ఆ నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోకి పృథ్విరాజ్

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అధినేతకు సినీ పరిశ్రమ నుంచి బహిరంగంగా మద్దతు ప్రకటించిన నటుడు పృథ్విరాజ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ఫేమస్ అయిన పృథ్వి రాజ్ జగనన్న వెంటే నేను, ఈ జీవితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితం అంటూ ఆంధ్రపదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాలక్రమంలో అనుకోని పరిణామాల మధ్య వైసీపీ కి గుడ్ బై చెప్పారు.. జనసేనకు దగ్గరయ్యారు. అంతేకాదు తన ప్రయాణం ఇక నుంచి జనసేన పార్టీతోనే అని చెబుతున్నారు. అంతేకాదు తాను నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తానని.. పోటీ చేయనున్న నియోజక వర్గాన్ని కూడా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రకటించారు.

వాస్తవానికి పృథ్వి సొంత ఊరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. అయితే తాను ఎన్నికల బరిలో అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి దిగనున్నానని వెల్లడించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో ఏ మాత్రం విచారణ జరపకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పించారంటూ గుర్తు చేసుకున్నారు. మరి వైసీపీలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి వారిపై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు పార్టీ తీసుకోలేదని .. నా పై మాత్రమే చర్యలు తీసుకున్నారంటూ ఆరోపించారు.

తాను కరోనా సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కనీసం వైసీపీ ఏ విధంగా స్పందించలేదని.. సహాయం చేయలేదని చెప్పారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నా స్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. చికిత్స అందించడం కోసం ఏర్పాట్లు చేశారని.. అప్పటి మా నుంచి ఇన్సూరెన్స్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. తనకు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని వదిలి తప్పు చేసినట్లు అనిపించిందన్నారు పృథ్వి.

తనను జనసేన అధినేత ఎన్నికల్లో ప్రచారం చేయమంటే పవన్ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్తా.. చోడవరం నుంచి పోటీ చేయమన్నా తాను రెడీ అన్నారు. తనకు వైజాగ్ తో పాటు.. చోడవరం నియోజవర్గంలో బంధువులున్నారని.. తనకు తాతావరస అయ్యే బలిరెడ్డి సత్యారావు అని కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈ నియోజవర్గంలో 44వేల మంది తన వాళ్ళు ఉన్నారంటూ వెల్లడించారు.

తిరుపతిలో కారు బీభత్సం..

తిరుపతిలో షోరూం నుంచి అప్పుడే కొనుగోలు చేసిన కారు బీభత్సం సృష్టించింది. కారును కొన్న వ్యక్తి డ్రైవ్ చేశాడు. అయితే బ్రేక్ వేయబోయే క్రమంలో అతను ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో కారు రయ్యమంటూ రోడ్డు పక్కన షాప్ లోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కనే ఉన్న మరో నాలుగు బైకులను ఢీకొట్టింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. 

  

షోరూం నుంచి కొత్త కారు తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు కొనుగోలు చేసిన వ్యక్తికి డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఏపీ లో ఈ రోజు నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ఇవాళే ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ఈ వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగం గానే ఇప్పటికే రెండు విడతల్లో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారు – రఘురామకృష్ణం రాజు

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారని చురకలు అంటించారు రఘురామకృష్ణం రాజు.పులివెందులలో పులి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు తమ ఊరు ఉండి, భీమవరంలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేను చులకనగా చూస్తే ఎలా?, మీ చేత తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజకీయాలలోకి రాలేదని, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని, వారిని గౌరవించడం ఇకనైనా నేర్చుకోవాలని, లేకపోతే పరిస్థితులు తిరగబడతాయి అని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చుట్టూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పి ఎ రెడ్డిలు మాత్రమే ఉంటారని, వారంతా లోపల ఉంటే ఎస్సీ బీసీ ఎంపీలు మాత్రం షెడ్డు వంటి చోట కూర్చోవలసిన పరిస్థితిని కల్పించారని, తాను వెళ్ళాక సహచర ఎంపీలను చూసి ఇక్కడ కూర్చున్నారు ఏమిటని ప్రశ్నించగా, లోపల వారంతా ఉన్నారని… ముఖ్యమంత్రి గారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారన్నారు. తాను లోపలికి దూసుకు వెళ్ళగా లోపల సీఎం గారితో పాటు ఇతర రెడ్డి ప్రజా ప్రతినిధులు జీడిపప్పు తింటూ కూర్చున్నారని తెలిపారు. ఎవరైనా బీసీ, ఎస్సి నేతలు తాము కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి జీడిపప్పు తిన్నామని చెబితే అదంతా ఉత్తి అబద్ధమేనని, అదే నిజమైతే ఒక ఫోటోను విడుదల చేయాలని అన్నారు.

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం సీరియస్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులలో కర్నూలుకు తరలిస్తామని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

ఏపీ హైకోర్టు తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారు కానీ.. మూడు రాజధానుల పై సీఎం ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ లో ఉమ్మడి హైకోర్టు ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత టిడిపి హయంలో ఏపీ హైకోర్టును అమరావతి వేదికగా ఏర్పాటు చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ క్రమంలో విశాఖను పరిపాలన, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి వరకూ చదివారు. ఆ తర్వాత తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ చదివారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్‌ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. మొదట్లో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఇంగ్లీషు పేపర్లలోనూ చాలాకాలం పాటు పని చేశారు. 

రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’ పేరుతో దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాసిన కాలమ్స్ విశేష ప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పని చేసిన శ్రీనాథ్‌ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు.

క్రిమినల్‌ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: ఏపీ హైకోర్టు

క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్న వారికి పాస్ పోర్టు పునరుద్ధరణ కావాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించాకే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.

మరోవైపు న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు.. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గెజిట్‌ జారీ..

అమ‌రావ‌తి కేపిట‌ల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ తుది నోటిఫికేష‌న్ జారీ చేసింది ప్రభుత్వం. గ‌తంలో ఉన్న జోన్ల‌లో కొన్ని భాగాల‌తో కొత్తగా R-5 జోన్ ఏర్పాటు చేసింది స‌ర్కార్. కోర్టు ఆదేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జోన్ ఏర్పాటుచేసిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా పేద‌ల ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టడంతో పాటు అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో నిర్మాణాలు చేప‌ట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా జోన్ ఏర్పాటు చేసింది.

మంగ‌ళ‌గిరి మండ‌లంలోని కృష్ణాయ‌పాలెం, నిడమర్రు, కుర‌గ‌ల్లుతో పాటు తుళ్లూరు మండ‌లంలోని మంద‌డం, ఐన‌వోలు గ్రామాల్లోని 900.97 ఎక‌రాలతో జోన్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో గ‌తంలో ఉన్న జోన్లలో ప‌లు స‌ర్వే నెంబ‌ర్లు కొత్త జోన్ ప‌రిధిలోకి వ‌చ్చాయి. ఈ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టాలి, ఏవి చేప‌ట్టకూడ‌ద‌నే వివ‌రాల‌న్నీ గెజిట్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.

కొన్ని నిర్మాణాలకు కండిష‌న‌ల్ అనుమ‌తులు ఇచ్చింది. స‌ర్వీస్ అపార్ట్‌మెంట్స్, ఇండ‌స్ట్రియ‌ల్ అవ‌స‌రాల కోసం, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు అనుమ‌తులు ఇవ్వకూడ‌ద‌ని జీవోలో పేర్కొంది. ఇక నిర్మాణాల విష‌యంలో కూడా ఎన్ని ఫ్లోర్‌లు నిర్మించాలి? ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి ? పార్కింగ్ స్థలం ఎంత ఉండాల‌నేది కూడా జీవోలో పేర్కొంది. ఈ జోన్‌లో ప్రభుత్వం పేర్కొన్న నిబంధ‌న‌ల ప్రకార‌మే ఎలాంటి నిర్మాణాలైనా చేప‌ట్టాలనేదే ప్రధాన విషయం.

మొత్తంగా గ‌తంలో R-5 జోన్ పై వ‌చ్చిన అభ్యంత‌రాలు, ఆ త‌ర్వాత కోర్టు క్లియ‌రెన్స్‌తో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఇప్పటికే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేశారు రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాలి.