హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

స్వప్రలోక్‌ ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్‌ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది.. ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తీగా అదుపుచేశారు. 

ఈప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒకకారులో సెక్యూరిటీ గార్డ్‌ నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ గా గుర్తించారు పోలీసులు. ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ కు అమ్మ, న్నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. అబిడ్స్‌లో ఉదయం చెప్పులు కుట్టడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.

రోజు మాదిరిగానే నిన్న ఉదయం ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్ళిన సంతోష్ చెప్పులు దుకాణంలో విధులు ముగించుకొని కార్ల గ్యారేజ్ లో డ్యూటీకి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తరువాత పన్నెండు గంటలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తిన్నానని పడుకుంటున్నాని తల్లికి చెప్పి సంతోష్ కారులో నిద్రించాడు. ఉదయం సంతోష్ చనిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో గ్యారేజ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాను కుటుంబ సభ్యులు. ఈ మధ్యనే సంతోష్ అన్న చనిపోయాడని ఇప్పుడు చిన్న కొడుకు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కుగా వుండి పోషిస్తూ వస్తున్న సంతోష్‌ కూడా చనిపోయాడని ఇక మాకు దిక్కెవరని వాపోయారు. సంతోష్‌ కుటుంబ సభ్యుల రోదనలు విని స్థానికులు చలించిపోయారు. అయితే.. కామినేని హాస్పిటల్ కి అనుకునే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లను తరలించేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైర్‌ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నాందేడ్‌ జిల్లా కంధార్‌ నియోజకవర్గం లోహా పట్టణంలో ఈనెల 26న బీఆర్ఎస్ బహిరంగ సభ

బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బలపరచాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి రైతులకు హామీల వర్షం కుప్పించింది. తాజాగా మరోసారి అక్కడి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కంధార్‌ నియోజకవర్గం లోహా పట్టణంలో ఈనెల 26న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది.

బీఆర్ఎస్ పార్టీ బహిరంగ నేపథ్యంలో లోహా పట్టణం గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ బీఆర్ఎస్ బ్యానర్లు, హోర్డింగులతో ముస్తాబయ్యాయి. బైల్‌ బజార్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కంధార్‌ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, కన్నాడ్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ జాదవ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్‌, బీజేపీ, శివసేన కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు. దీంతో సభా ఏర్పాట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ‘మా నౌకర్లుమాగ్గావాలె’ నినాదంతో శనివారం బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ధర్నాలో 500 మందికి మించరాదని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది. ధర్నాలో పాల్గొనే బీజేపీ ముఖ్య నేతల వివరాలను శుక్రవారం రాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని సూచించింది.

ధర్నాకు అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. టీఎస్‌‌‌‌ పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25న ధర్నా చౌక్‌‌‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకోగా,శుక్రవారం మధ్యాహ్నం వరకు వారు స్పందించలేదు. దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి హైకోర్టులో లంచ్‌‌‌‌ మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ధర్నా చేస్తున్నదని ప్రభుత్వ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. పేపర్ల లీకేజీ విషయంలో బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌కి సిట్‌‌‌‌ నోటీసులిచ్చిందని, అయితే, ఆయన విచారణకు సహకరించడం లేదన్నారు. కోర్టు స్పందిస్తూ.. పేపర్ల లీకేజీపై రాజకీయ పార్టీలు నిరసనలు తెలపకూడదని ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించింది. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పింది. ధర్నా చౌక్‌‌‌‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారని ప్రశ్నిస్తూ, షరతులతో ధర్నాకు అనుమతి ఇచ్చింది. 

ధర్నా చౌక్‌‌‌‌ వద్ద ఏర్పాట్ల పరిశీలన...

మహా ధర్నాను సక్సెస్ చేసేందుకు బీజేపీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. శుక్రవారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తదితరులు ఇందిరా పార్క్‌‌‌‌ వద్దకు వెళ్లి సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, పార్టీ నాయకులు, స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ నేతలు కోరారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.

తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలాఖరులో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల‌ 31న సంగారెడ్డిలో పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంతగా మారాయి పరిస్థితులు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా పర్యటనపై తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

పరీక్ష రాస్తుండగానే.. తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం (మార్చి 23) పరీక్ష రాస్తున్న సమయంలో ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షరాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని అస్వస్థతకు గురైంది. దీంతో సదరు పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు 108కు ఫోన్ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్నివయసుల వారికి గుండెపోటు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు రావడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

TS : టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్‌.. అలాగే హాల్ టికెట్స్ ..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. శుక్రవారం నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది విద్యాశాఖ. వచ్చే నెల 3వ తేది నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ రాసేందుకు 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.

కాగా ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్‌ పేపర్స్‌లోని వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్‌ పెంచారు. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ జ‌న‌వ‌రి 11నే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌రు 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప క్వచ్చన్స్ సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో A లేదా B అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 

దీనిపై టీచర్స్‌తో పాటు పేరెంట్స్‌ నుంచి కాస్త వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే స్టూడెంట్స్ హాజరయ్యారు. దీంతో లెర్నింగ్ కెపాసిటీ తగ్గింది. దీంతో ఎగ్జామ్ పాట్రన్‌లో మార్పులు చేయాలని..ఛాయిస్‌ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్‌ ఛాయిస్‌ను రిమూవ్ చేసింది. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాయాలని పేర్కొంది.

దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల అలాట్‌మెంట్ మారింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మ్యాథ్స్, సైన్స్‌, సోషల్‌లకు…అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తించనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లలో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా బెంగళూరు రూట్‌లో 46 సర్వీసుల్లో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ సంయుక్తంగా డైనమిక్ ప్రైసింగ్ పాలసీ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు మార్చి 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లు, ఫ్లైట్ బుకింగ్‌లు, రైళ్లు (తత్కాల్ సర్వీస్) మొదలైన ఇతర రిజర్వేషన్ సర్వీస్‌లలో ఇప్పటికే డైనమిక్ ధరలను ఉపయోగిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అంటే ప్రయాణికుల సంఖ్య, ట్రాఫిక్, డిమాండ్ మొదలైన పారామితులపై ఆధారపడి టిక్కెట్ ధరలు మారుతూ ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటే, ఈ విధానంలో టిక్కెట్ ధర సాధారణ ధర కంటే తక్కువగా ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉన్నట్లయితే, తదనుగుణంగా ఛార్జీలలో మార్పులు ఉంటాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అధునాతన డేటా విశ్లేషణ మరియు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల ఏకైక వ్యూహం ఇతర రాష్ట్రాల్లో ధరలను ఆర్టీసీతో పోల్చడం.

“ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణ రోజుల్లో కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే పీక్‌ డేస్‌లో సాధారణంగా టిక్కెట్‌ ధరలు పెంచుతారు. ప్రైవేట్ ఆపరేటర్‌లతో పోల్చినప్పుడు సరసమైన మరియు బడ్జెట్-స్నేహపూర్వక ప్రయాణాన్ని అందించడానికి మరియు ఎక్కువ మందికి చేరుకోవడానికి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ విధానం వల్ల అసలైన ధర కంటే 20 నుంచి 30 శాతం వరకు అన్‌సీజన్ టికెట్ ధరలు తగ్గుతాయి. పీక్ సీజన్లు వరుసగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి” అని వారు తెలిపారు.

మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?

దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. “విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022” పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 

మహిళలపై మూడో వంతు దాడులు వారి భర్తలు, అత్తింటివారు, వారి బంధువులే చేస్తున్నవే కావడం గమనార్హం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వకదాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతంగా ఉండగా, 2019-21 నాటికి ఇవి స్వల్ప తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగివచ్చాయి. ఇపుడు మళ్లీ ఈ కేసులు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 

మరోవైపు మహిళపై జరుగుతున్న దాడుల కేసుల్లో అనేకం వెలుగులోకి రావడం లేదు. అలా వచ్చిన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో 21.22 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అదేవిధంగా గత 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఈ సంఖ్య 47,746కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 45,026కు తగ్గింది.

TS : సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట మట్టిపాలైంది. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి వెళ్ళి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, నష్టపోయిన రైతుల్లో మనోధైర్యం, భరోసా కల్పించేలా ఓదార్చుతారు. 

ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం కేసీఆర్ ఆక్కడ నుంచి హెలికాఫ్టరులో ఖమ్మంకు చేరుకుంటారు. 11.15 గంటలకు జిల్లాలోని బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామాపురం గ్రామం నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పాలమూరు జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. 

మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవి రంగాపురంగాపురం గ్రామం నుంచి 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రాపూర్‌లో దెబ్బతిన్న పంటలను ఆయన పరశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లక్ష్మీపురం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఆయా జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

శ్రీ శోభకృత్ రాష్ట్రప్రజలకు సకల శుభాలను కలుగజేయాలంటూ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది ఒకటి. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ఉగాది పండగ అన్నదాతలకు, అన్ని రంగాల్లోని వారికీ, రాష్ట్ర ప్రజలకు శుభాలను కలుగజేయాలని కేసీఆర్ కోరుకున్నారు. శ్రీ శోభకృత్‌ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా రైతులకు సకల శుభాలను చేకూర్చాలని సూచించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు, పచ్చని పంటలతో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు.

గవర్నర్ తమిళిసై

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ప్రజలకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

“శ్రీ శోభకృతు నామ సంవత్సరం సమాజంలోని ప్రజలందరికి.. అన్ని వర్గాలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, ఆరోగ్యం, సంతోషాన్ని కలిగిస్తుందని తాను విశ్వసిస్తున్నాను” అని ఆమె తెలిపారు.