తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలాఖరులో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల‌ 31న సంగారెడ్డిలో పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంతగా మారాయి పరిస్థితులు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా పర్యటనపై తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

పరీక్ష రాస్తుండగానే.. తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం (మార్చి 23) పరీక్ష రాస్తున్న సమయంలో ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షరాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని అస్వస్థతకు గురైంది. దీంతో సదరు పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు 108కు ఫోన్ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్నివయసుల వారికి గుండెపోటు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు రావడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

TS : టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్‌.. అలాగే హాల్ టికెట్స్ ..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. శుక్రవారం నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది విద్యాశాఖ. వచ్చే నెల 3వ తేది నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ రాసేందుకు 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.

కాగా ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్‌ పేపర్స్‌లోని వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్‌ పెంచారు. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ జ‌న‌వ‌రి 11నే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌రు 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప క్వచ్చన్స్ సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో A లేదా B అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 

దీనిపై టీచర్స్‌తో పాటు పేరెంట్స్‌ నుంచి కాస్త వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే స్టూడెంట్స్ హాజరయ్యారు. దీంతో లెర్నింగ్ కెపాసిటీ తగ్గింది. దీంతో ఎగ్జామ్ పాట్రన్‌లో మార్పులు చేయాలని..ఛాయిస్‌ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్‌ ఛాయిస్‌ను రిమూవ్ చేసింది. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాయాలని పేర్కొంది.

దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల అలాట్‌మెంట్ మారింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మ్యాథ్స్, సైన్స్‌, సోషల్‌లకు…అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తించనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లలో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా బెంగళూరు రూట్‌లో 46 సర్వీసుల్లో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ సంయుక్తంగా డైనమిక్ ప్రైసింగ్ పాలసీ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు మార్చి 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లు, ఫ్లైట్ బుకింగ్‌లు, రైళ్లు (తత్కాల్ సర్వీస్) మొదలైన ఇతర రిజర్వేషన్ సర్వీస్‌లలో ఇప్పటికే డైనమిక్ ధరలను ఉపయోగిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అంటే ప్రయాణికుల సంఖ్య, ట్రాఫిక్, డిమాండ్ మొదలైన పారామితులపై ఆధారపడి టిక్కెట్ ధరలు మారుతూ ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటే, ఈ విధానంలో టిక్కెట్ ధర సాధారణ ధర కంటే తక్కువగా ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉన్నట్లయితే, తదనుగుణంగా ఛార్జీలలో మార్పులు ఉంటాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అధునాతన డేటా విశ్లేషణ మరియు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల ఏకైక వ్యూహం ఇతర రాష్ట్రాల్లో ధరలను ఆర్టీసీతో పోల్చడం.

“ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణ రోజుల్లో కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే పీక్‌ డేస్‌లో సాధారణంగా టిక్కెట్‌ ధరలు పెంచుతారు. ప్రైవేట్ ఆపరేటర్‌లతో పోల్చినప్పుడు సరసమైన మరియు బడ్జెట్-స్నేహపూర్వక ప్రయాణాన్ని అందించడానికి మరియు ఎక్కువ మందికి చేరుకోవడానికి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ విధానం వల్ల అసలైన ధర కంటే 20 నుంచి 30 శాతం వరకు అన్‌సీజన్ టికెట్ ధరలు తగ్గుతాయి. పీక్ సీజన్లు వరుసగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి” అని వారు తెలిపారు.

మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?

దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. “విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022” పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 

మహిళలపై మూడో వంతు దాడులు వారి భర్తలు, అత్తింటివారు, వారి బంధువులే చేస్తున్నవే కావడం గమనార్హం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వకదాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతంగా ఉండగా, 2019-21 నాటికి ఇవి స్వల్ప తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగివచ్చాయి. ఇపుడు మళ్లీ ఈ కేసులు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 

మరోవైపు మహిళపై జరుగుతున్న దాడుల కేసుల్లో అనేకం వెలుగులోకి రావడం లేదు. అలా వచ్చిన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో 21.22 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అదేవిధంగా గత 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఈ సంఖ్య 47,746కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 45,026కు తగ్గింది.

TS : సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట మట్టిపాలైంది. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి వెళ్ళి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, నష్టపోయిన రైతుల్లో మనోధైర్యం, భరోసా కల్పించేలా ఓదార్చుతారు. 

ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం కేసీఆర్ ఆక్కడ నుంచి హెలికాఫ్టరులో ఖమ్మంకు చేరుకుంటారు. 11.15 గంటలకు జిల్లాలోని బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామాపురం గ్రామం నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పాలమూరు జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. 

మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవి రంగాపురంగాపురం గ్రామం నుంచి 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రాపూర్‌లో దెబ్బతిన్న పంటలను ఆయన పరశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లక్ష్మీపురం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఆయా జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

శ్రీ శోభకృత్ రాష్ట్రప్రజలకు సకల శుభాలను కలుగజేయాలంటూ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది ఒకటి. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ఉగాది పండగ అన్నదాతలకు, అన్ని రంగాల్లోని వారికీ, రాష్ట్ర ప్రజలకు శుభాలను కలుగజేయాలని కేసీఆర్ కోరుకున్నారు. శ్రీ శోభకృత్‌ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా రైతులకు సకల శుభాలను చేకూర్చాలని సూచించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు, పచ్చని పంటలతో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు.

గవర్నర్ తమిళిసై

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ప్రజలకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

“శ్రీ శోభకృతు నామ సంవత్సరం సమాజంలోని ప్రజలందరికి.. అన్ని వర్గాలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, ఆరోగ్యం, సంతోషాన్ని కలిగిస్తుందని తాను విశ్వసిస్తున్నాను” అని ఆమె తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి… తెలంగాణ హైకోర్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పోటీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ పోటీ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు సక్రమంగా జరగలేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినపిస్తూ, ‘రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు’ అని కోర్టుకు వివరించారు.

ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా వేసింది.

N5 H1 వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమా..?

నిన్నటి వరకూ కరోనా పీడ వెంటాడింది. ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్.. కరోనా కంటే చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. కొన్ని రకాల జంతువుల నుంచి సోకుతున్న వైరస్.. కరోనా మహమ్మారిగా కంటే ప్రమాదకరమా..? ఇప్పుడు చర్చ యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది.

ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్‌ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ముంగిస, పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షులకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి H5N1. 

1997లోనే H5N1ను తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. హెచ్‌5ఎన్‌1 సోకిన వారిలో 50 శాతం మంది ఇప్పటివరకూ మృత్యువాత పడ్డారు. అంటే ఇన్‌ఫ్లూయెంజా వెయ్యి మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారట. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే కొత్త వైరస్ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615 జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు 2,701 కేసులు నమోదయ్యాయి. 

బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం నమోదవడంతో శాస్త్రవేత్తలు, వైద్యాధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్‌1ఎన్‌1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్‌లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉందంటున్నారు. ఒకవేళ హెచ్‌5ఎన్‌1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య హెచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ చెప్పిన విషయం తెలిసిందే. 

అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ… పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు వైరస్ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ…

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖనే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఇయాళ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్ద కకుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్ కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు.

తన కుటుంబమే పరమావధిగా వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యే సరికి అకస్మాత్తుగా కార్యకర్తలపైన ప్రేమ పుట్టకొచ్చింది. పేపర్ లీకేజీలో కొడుకు, లిక్కర్ స్కామ్ లో బిడ్డ పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోవడంతోపాటు అనేక స్కాముల్లో పాలుపంచుకుందనడానికి రుజువు దొరుకుతుండటంతో తన కుటుంబ అవినీతిపై చర్చ జరగకుండా మరోసారి కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాల కు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడన్నారు.