రేపు ఎన్టీఆర్ జిల్లాలో జగన్ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు లో పర్యటించనున్నారు. తాడేపల్లినుంచి బయలుదేరి తిరువూరు మార్కెట్ యార్డుకి చేరుకోనున్నారు సీఎం జగన్.

ఇందులో భాగంగా రేపు ఉదయం 11.00- 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఇవాళ రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లో వైర్ తెగిపోవడటంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 8 మంది కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఆరుగురిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ప్రతి రోజు ఉదయం లిఫ్ట్ ద్వారా కార్మికులు పైకెళ్లి పనులు చేస్తుంటారు.ప్రతి రోజూలాగే ఇవాళ కూడా కార్మికులు లిఫ్ట్‌లో వెళ్తుండగా కొంత దూరంపైకి వెళ్లిన తర్వాత వైర్ తెగి పోవడంతో లిఫ్ట్ అమాంతం కింద పడిపోవడం ఈ ప్రమాదం జరిగిందీ..అయితే ఓవర్‌ లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతున్నారు.ఇక అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన మాత్రమే ప్రమాదం జరిగిందని తోటీ కార్మికులు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

యువ గళం పాదయాత్రలో అపశృతి..లోకేష్‌ భుజానికి గాయం

యువ గళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువ గళం పాదయాత్ర చేస్తున్నా నారా లోకేష్‌ భుజానికి గాయం అయింది. అయితే.. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్ చెప్పాలని చూడడంతో కుడి భుజం నొప్పిగా ఉందంటూ ఎడమ చేతితో థాంక్స్ చెప్పారు నారా లోకేష్.

దీంతో నారా లోకేష్‌ భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుడి భుజం నొప్పిగా ఉందని చెప్పారు నారా లోకేష్. సెల్ఫీ తీసుకునే సమయంలో తన బిడ్డను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలని లోకేష్ ను కోరగా తన చేయి నొప్పిగా ఉందంటూ మహిళతో చెప్పారు నారా లోకేష్. ఈ సంఘటన నేపథ్యంలోనే… ఈ విషయం బయటపడింది.

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్​కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన కరెంట్​కు సంబంధించి తెలంగాణ, ఏపీకి బకాయిపడిందని వివరించారు. 

శుక్రవారం పార్లమెంట్ లోని పీఎం ఆఫీసులో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఏపీకి సంబంధించిన 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. విభజన జరిగి తొమ్మిదేండ్లు గడుస్తున్నా.. చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

కీలకాంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఏపీకి సంబంధించి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నాటి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద పెండింగ్​లో ఉన్న రూ.36,625 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

 కేంద్రం సహకారం అందిస్తే కొద్దికాలంలోనే పోలవరం పూర్తవుతుందని, ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసిందని, ఈ బకాయిలను చెల్లించాలని కోరారు. పోలవరం అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అడహక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

ఏపీ బడ్జెట్ పై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ బడ్జెట్ పేదరిక నిర్మూలనకు పునాది అని తెలిపారు మంత్రి రోజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఐదోసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పునాది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించేలా బడ్జెట్ లో డిబిటి పథకాలకు 54,228 కోట్ల కేటాయింపులు చేయడం హర్షణీయం అన్నారు రోజా.

ఈ రాష్ట్రంలోని పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ కొండంత భరోశాను కలిగించింది. జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు అని మరో సారి ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయింపుల ద్వారా స్పష్టమైంది. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను గౌరవించారు. ముఖ్యంగా ఓ మహిళా మంత్రిగా ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన ప్రాధ్యాన్యతకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు.

మహిళలకు ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపి జగనన్న మరోసారి మహిళా పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చి, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ తరువాత రాష్ట్ర ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యేలా ఈ బడ్జెట్ ను రూపొందించారు. ఇలాంటి బడ్జెట్ ప్రతులను చించేసిన తెలుగుదేశం పార్టీకి ఈ బడ్జెట్ ద్వారా మేలు జరిగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు రాబోయే రోజుల్లో వాళ్ల భవిష్యత్ ని చించేయడం ఖాయం.“ అన్నారు రోజా.

TTD : ఇక వారికి ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభం... - టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి.

తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. రోజూ వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అన్నారు.

రాష్టంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి.. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు.

మరో 36 శాటిలైట్లను ప్రయోగించనున్న ఇస్రో... ఎప్పుడంటే...

బ్రిటన్ కంపెనీ వన్ వెబ్ కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇస్రో ఈ నెల 26న ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది.

 ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 36 శాటిలైట్లను రాకెట్ లో అమర్చే ప్రక్రియ పూర్తయిందని గురువారం వన్ వెబ్ కంపెనీ వెల్లడించింది. వన్ వెబ్ కంపెనీతోపాటు సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతి ఎంటర్ ప్రైజెస్ కలిసి ‘వన్ వెబ్, లియో (లో ఎర్త్ ఆర్బిట్)’ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీని స్థాపించాయి. 

లో ఎర్త్ ఆర్బిట్ లోకి మొత్తం 618 శాటిలైట్లను పంపి.. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోయిన ఏడాది అక్టోబర్ 23న కూడా ఇస్రోకు చెందిన ఎల్వీఎం –3 (లాంచ్ వెహికల్ మార్క్–3) రాకెట్ ద్వారా 36 శాటిలైట్లను నింగికి చేర్చారు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మేరకు ఇప్పుడు మరో 36 శాటిలైట్లను పంపనున్నారు. 

అమెరికన్ కంపెనీ స్పేస్ ఎక్స్, ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ తోనూ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటివరకు 17 విడతల్లో 582 శాటిలైట్లను నింగికి పంపారు. ఇస్రో చేపట్టబోయే ప్రయోగంతో అంతరిక్షంలో వన్ వెబ్ శాటిలైట్ల సంఖ్య 618కు చేరుతుంది. దీంతో వన్ వెబ్ ఆధ్వర్యంలో జనరేషన్ 1 లియో కాన్ స్టెల్లేషన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

AP : MLC ఎన్నికలలో 4 స్థానాలు కైవసం చేసుకున్న వైకాపా

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా, శ్రీకాకుళం, కర్నూలులో మొత్తం 4 స్థానాలను వైకాపా గెలుచుకుంది. రాష్ట్రంలోని ముగ్గురు గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ఉపాధ్యాయులు, మూడు స్థానిక అధికారుల నియోజకవర్గాలకు మార్చి 16న పోలింగ్ జరిగింది. మూడు స్థానిక అధికారుల నియోజకవర్గాలు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలులో 95 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మార్చి 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 

శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు 632 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణపై 108 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో 12 ఓట్లు చెల్లని అని తేలింది.

అలాగే పశ్చిమగోదావరి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కావూరు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. శ్రీనివాస్‌కు 481 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,136 ఓట్లకు గాను ఆయనకు 988 ఓట్లు వచ్చాయి.

AP : దేవాలయాలలో తలనీలాల టికెట్ రేట్లు పెంచిన ఏపీ దేవాదాయ శాఖ

హిందూ సనాతన సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ టికెట్ ధర రూ. 40కి పెంచింది. ఇక నుంచి ఆలయాల్లో తలనీలాలను తీసే విధులను నిర్వహించే క్షురకులు కమిషన్ గా రూ. 20 లు ఇవ్వాలని దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.

అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!

అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెబుతారని ప్రశ్నించారు. 

ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టచ్చినట్లు కనపడుతోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అంటే 2014 నుండి రాష్ట్రానికి 9 లక్షల3 వేల 336 కొట్లు అప్పులు ఉన్న పరిస్ధితి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకున్న విధంగా ఇది ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు.

రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవిన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగక పోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు సోము వీర్రాజు.. మూలధనం వ్యయం లేక పోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు కుంటుపడతాయి. ద్రవ్యలోటు పెరిగిపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. 

ప్రతినెల సుమారుగా 21 వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా సుమారు 10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నా ప్రతి నెల నాలుగువేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.. మిగిలిన ఏడు వేల కోట్లు ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయం ప్రభుత్వం వెల్లడించడం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆర్ధిక తీరుతెన్నుల పై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోంది. కార్పోరేషన్ల పై తీసుకున్నరుణాలకు సంబంధించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి కార్పోరేషన్ లావాదేవీలు కంపెనీ రిజిస్ట్రార్ కు నివేదిస్తున్నారా? లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు సోము వీర్రాజు.

మూలధన వ్యయం విషయం బుగ్గన క్లారిటీ ఇవ్వక పోగా.. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కూడా వెల్లడించక పోతే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రజలకు ఏం చెప్పదల్చారని ప్రశ్నించారు సోమువీర్రాజు.. వ్యవసాయానికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పోలిస్తే రాష్ట్రం ఇస్తున్నది లేశ మాత్రమే. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేధ్యం, భూసార పరీక్షలు బడ్జె కేటాయింపులు అంకెల్లో ఘనంగా ఉన్నా క్షేత్రస్ధాయిలో రైతులకు నిరాశ ఎదురు అవుతోంది. మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెలగారడీగానే కనపడుతోంది.

ఉత్తరాంద్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుతార్కాణం. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోంది.. అయితే, బడ్జెట్ లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.