పాలమూరులో డీసీసీబీ బ్యాంకు సిబ్బంది ఓవరాక్షన్

మూడు వాయిదాల రుణం చెల్లించలేదన్న కారణంగా డీసీసీ బ్యాంకు సిబ్బంది రుణదాత అయిన ఓ రైతు ఇంటి తలుపులు ఊడపీకారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే రైతు తన 2.05 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాన్ని గత 2021లో గూడూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో తాకట్టుపెట్టి రూ.4.50 లక్షల రుణం తీసుకున్నాడు.

ఒక్కో వాయిదాకు రూ.62 వేలు చొప్పున మరో నాలుగు నెలలు చెల్లించాల్సివుంది. అయితే, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మరో మూడు వాయిదాలు చెల్లించాల్సివుంది.

బ్యాంకు అధికారులు మాత్రం మిగిలిన రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించాడు. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీన పోలీసులతో కలిసి డీసీసీబీ బ్యాంకు అధికారులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రైతు మోహన్ కుమారుడు, మాజీ సర్పంచి అయిన ఆయన కోడలు స్వరూప ఉన్నారు. 

రుణం బకాయిలు చెల్లించని కారణంగా ఇంటి తలుపులు తీసుకెళ్తున్నట్టు వారికి చెప్పి ద్వారం నుంచి వాటిని తొలగించి వాహనంలో పడేశారు. ఈ క్రమంలో బ్యాంకు ధికారులకు, ఇంటి సభ్యులకు వాగ్వాదం జరింది.

మిగిలిన సొమ్ము త్వరలోనే చెల్లిస్తామని ప్రాధేయపడటంతో ఊడదీసిన తలుపులు తిరిగి అప్పగించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డీసీసీబీ అధికారులు స్పందించారు. తాము రైతు కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదని, మందలించి తలుపులు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.

TS : లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ విచారణకు MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నేతలు ఢిల్లీకి భారీగా చేరుకున్నారు.

ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రులు కేటీఆర్, హరీష్ చర్చలు జరిపారు.  

 ఆందోళన చేసే ఛాన్స్ ఉండటంతో.. ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, ఈడీ విచారణకు కన్‌ఫ్రంటేషన్‌ విధానంలో బుచ్చిబాబు, పిళ్లై, సోసిడియాతో కలిపి కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది.

గొంతు నొప్పి... కారణాలు - నివారణ మార్గాలు

మీ గొంతులో గడ్డ ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఆహారం మింగడం కష్టంగా ఉందా? గొంతులో నొప్పి, కరుకుదనం, పొడిబారినట్లుగా ఉంటోందా? అయితే, మీరు బహుశా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. శ్లేష్మ పొర సాధారణ వాపు ప్రాథమికంగా గొంతు నొప్పికి కారణం. అలాంటి సమయంలో భయపడాల్సిన పని లేదు. కొన్ని ఇంటి నివారణలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

గొంతు నొప్పికి కారణాలు...

1. చాలా పొడి వాతావరణం.

2. వాయు కాలుష్యం – పొగ, దుమ్ము.

3. అలెర్జీ, ఆస్తమా.

4. వైరల్ జ్వరం, సాధారణ జలుబు.

5. శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు.

6. ఉబ్బిన గ్రంధులు.

ఇలా పుక్కిలించండి..

ఉప్పునీరు: అర టీస్పూన్ రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి పుక్కిలించాలి. ఇది మీ గొంతులో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శ్లేష్మం వెళ్లడానికి సహాయపడుతుంది.

హెన్నా ఆకులు: 

హెన్నా ఆకులతో డికాక్షన్ చేసి పుక్కిలించొచ్చు.

యాలకుల పొడి: 

నీళ్లలో యాలకుల పొడిని కరిగించి, వడకట్టి పుక్కిలించాలి.

మెంతి గింజలు:

 నీటిలో మరిగించి, వడకట్టి పుక్కిలించాలి.

పసుపు నీరు: 

పసుపు ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. ½ టీస్పూన్ పసుపు పొడిని ½ టీస్పూన్ ఉప్పును వేడి నీటిలో కలపాలి. ప్రతి 2 గంటలకు గార్గిల్ చేయండి.

తులసి నీరు: 

తులసి ఆకులతో నీటిని మరిగించాలి. వడకట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు. లేదా పుక్కిలించవచ్చు.

నిమ్మ / అల్లం నీరు త్రాగాలి:

గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తేనె సహాయపడుతుంది.

వెచ్చని డ్రింక్స్ మాత్రమే త్రాగాలి..

1. వెచ్చని ద్రవాలు మీ గొంతును తేమ, పొడి గొంతు, నిర్జలీకరణం మొదలైన సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. వేడి డ్రింక్స్ తీసుకోవచ్చు.

2. అల్లం, తేనె టీ అనేది గొంతు మంటను తగ్గించడానికి ఒక ప్రసిద్ధమైన డ్రింక్.

3. రెడ్ హైబిస్కస్ టీ మీ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్ హైబిస్కస్ టీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

4. గొంతు తేమగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటిని తాగాలి.

5. తమలపాకులు నమలాలి. తమలపాకులు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే పురాతన, సాంప్రదాయ ఔషధం. తమలపాకులు, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించవచ్చు. వడకట్టి ఆ నీటిని తాగాలి. రుచి కోసం తేనె లేదా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు.

6. లవంగాలను నమలాలి. నోట్లో పగుళ్లు, పుళ్లు అయితే లవంగాలను నోట్లు వేసుకుని ఉంచుకోవాలి. తద్వారా ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

పేపర్ లీకేజీపై మంత్రులు ఎందుకు మాట్లాడరు?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కవితకు లిక్కర్ స్కాంపై ఈడీ నోటీసులు ఇస్తే.. మంత్రులంతా మాట్లాడిండ్రు.. మరి పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడ్డం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ప్రశ్నించారు. 

పేపర్ లీకేజీపై కేసీఆర్ మాట్లాడాలని చెప్పారు. ఈ కేసును సిట్ తో కాకుండా..సీబీఐతో(CBI) విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు అంగట్లో అమ్మే సరుకులాగా మారాయన్నారు. రాష్ట్రమంతా యువత ఆందోళన చేస్తుంటే.. తెలంగాణ మంత్రులు, సీఎం స్పందించరా అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ప్రతి దాంట్లో ఇన్వాల్ అయ్యే కేటీఆర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఎక్కడున్నారని నిలదీశారు.. లీకేజీపై ఎందుకు మాట్లాడాలన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోరా అని అడిగారు.

 తెలంగాణ వాడు కానీ ప్రవీణ్ tspsc లోకి ఎట్లా వచ్చిండు..ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ను సెక్రెటరీ పీఏగా ఎట్లా పెట్టుకుందని ప్రశ్నించారు. TSPSC చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. 

పోయిన ఏడాది 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు.. కానీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. 

టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకూ మొదలుపెట్టలే.. దానికోసం పెట్టిన టెట్ పరీక్ష జరిగి 6 నెలలు అవుతుందని గుర్తు చేశారు. రాబోయే విద్య సంవత్సరంలో కూడా అరకొర టీచర్లతోనే నెట్టుకొచ్చే అవకాశం ఉంది.. 

ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అంటూ జీవన్ రెడ్డి మండపడ్డారు. అప్పుసప్పు చేసి కోచింగ్ సెంటర్లకు పోయి సదువుకుంటే ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత మానసిక ఆందోళనలో ఉందన్నారు. యువతకు విశ్వాసం రావాలంటే కేంద్ర విచారణ రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ జరిగి 48 గంటలు ఐనా ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదని విమర్శించారు జీవన్ రెడ్డి.

TSPSC : పేపర్ లీక్ లో ట్విస్ట్.. 46 మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్

TSPSC ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తుంది.

 అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిట్లుగా పోలీసులు గుర్తించారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ తో పాటు రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్దారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక వ్యవహరిస్తున్నారు.

 ఈ ఏడాది 12 సెలవులు పెట్టినట్లు గుర్తించారు.. ఈ నెల 4,5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టింది.. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు పేపర్ లీక్ కు సూత్రధారిగా రాజశేఖర్ ను పోలీసులు తేల్చారు. ప్రవీణ్ ద్వారా పేపర్ ను బయటికి రాజశేఖర్ తెప్పించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్ గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు.. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు రాజశేఖర్ కు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

H3N2 వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపుతుందట.. జాగ్రత్తలు తప్పనిసరి

దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్‌ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో వైరస్‌ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.. ఇప్పుడు తెలిసిన ఒక విషయం ఏంటంటే.. ఈ వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందట.. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్-19 తరువాత హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఇన్‌ఫ్లుయెంజా వల్ల ఇద్దరు చనిపోయారు. ఇది తేలికపాటి వ్యాధి అని గుర్తించినా, అనారోగ్యంగా ఉన్న వారికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది. హెచ్‌3ఎన్‌2 ఇతర ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులతో పోలిస్తే ఎక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫ్లుయెంజా. ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి ఆగిపోతుంది.

ఈ వైరస్ శిశువులు, చిన్నారుల్లో పెరిగిపోతోంది. చాలా కేసుల్లో ఐసీయూ చికిత్స కూడా కావాల్సి వస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి.

కిడ్నీలపై ప్రభావం చూపుతుందా..?

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై పెను ప్రభావం చూపుతుంది.. ముఖ్యంగా వృద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ‘ఫ్లూ వైరస్‌గా పేరున్న ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై విభిన్న దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో కిడ్నీ ఫెయిలయ్యే ముప్పు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.. 30 శాతం కేసుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంది.

వయస్సు పైబడిన పేషెంట్లలో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కలిగి ఉన్న వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. కిడ్నీ మార్పిడి పేషెంట్లు, డయాలిసిస్ చేయించుకుంటున్న పేషెంట్లలో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీరిలో సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా, విభిన్న అవయవాల్లో సంక్లిష్టతలు చోటు చేసుకుంటాయి. గుండె కూడా పనిచేయకుండా పోవచ్చు. సాధారణ ప్రజల కంటే వీరు ఎక్కువగా మరణాల బారిన పడే అవకాశం ఉంది.

సేవ పేరుతో కోట్లు మాయం.. అందుకే ఐటీ రైడ్స్‌

బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగా రెడ్డి శౌరెడ్డి, అయన భార్య సునీతా రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిసా కలిసి క్రింద సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల FCRA నిధులను దారిమళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్ కం ట్యాక్స్ దృష్టిపెట్టింది.

 ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడ లోని హైదరాబాద్ కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. 

పేద కుటుంబంలో పుట్టి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన శౌరెడ్డి బాలవికాస సంస్థ ను ఏర్పాటు చేసి సేవ పేరుతో విదేశీయుల ను నమ్మించి వారి నుండి పెద్దమొత్తంలో డొనేషన్ల రూపంలో నిధులు రాబడుతూ కోట్లకు పడగనెత్తినట్లుగా ఆరోపణలున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు సంస్థ ద్వారా యాభై మిలియన్ అమెరికన్ డాల్లర్లను ( నాలుగు వందల కోట్లకు పైగా )కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎన్ని వందలకోట్లు దారి మళ్ళించాడనే విషయం తేలాల్సి ఉంది.

గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకల దాడి.. ఆవరణలో పాములు, కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు

దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌ దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొరికి గాయాలపాలు చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ D బ్లాక్‌లో వెంటిలేటర్స్ నుంచి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు ముగ్గురు విద్యార్థుల కాళ్ళు, చేతులు కొరికాయి. చెత్తాచెదారంతో పాటు ఆహార పదార్థాలు పోగవడంతో ఎలుకలు, తేళ్లు, పాములు హాస్టళ్ల ఆవరణలో తిష్ట వేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తో పాటు,న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్‌, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి ఎనిమిది హాస్టళ్లు ఉన్నాయి.. ఇందులో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఎలుకల బెడదతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు విద్యార్థులు

విషపు పురుగులు, కుక్కల బెడద కూడా ఉందని గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థులు వాపోతున్నారు. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ఎన్నిసార్లు కంప్లయింట్‌ చేసినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలుకలు, విషపు పురుగుల స్వైర విహారంతో హాస్టల్‌ విద్యార్థుల బతుకు దినదినగండంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చదువుకుందామని వచ్చినవాళ్లను ఎలుకలు కొరుకుతున్నాయి. రాత్రిళ్లు పాములు భయపెడుతున్నాయి. ఇక రాత్రీపగలు తేడా లేకుండా కుక్కలు హడలెత్తిస్తున్నాయి. దేశానికి, ప్రపంచానికి మేధావులను అందించిన ఓరుగల్లు కాకతీయ వర్సిటీ హాస్టళ్లలో ఇప్పుడు హాహాకారాలు వినిపిస్తున్నాయి.

ఫుట్ బాల్ ఆడిన రేవంత్.. “కేసీఆర్ ఖేల్ ఖతం”

రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా 29వ రోజు యాత్రలో భాగంగా నగరంలోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో ఓట ఆడారు. అంతేకాదు.. యువతతో పాటు పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గోల్ కూడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అంతేకాదు.. దీనికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మీదుగా సాగుతుంది. గతంలోనూ ఏఎల్ఎం, ఎంసెట్ వంటి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో అయితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు ఉండటం వల్లే టీఎస్పీఎస్సీ ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. పోలీసులైనా ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్పీకరించాలి కదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ టీఎస్పీఎస్సీ చుట్టునే తిరుగుతున్నాయని ఆయన అన్నారు.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని మోసపోయిన ఇంటర్ స్టూడెంట్

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించబోతున్న వినయ్ హాల్ టికెట్ ను పరిశీలించిన అధికారులు.. అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లిన ఆ విద్యార్థి అసలు ఎగ్జామ్ సెంటర్ కు పరిగెత్తాడు. కానీ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షా హాలులోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో వెనుదిరిగాడు.

 ఈ ఘటన ఎన్.ఎస్.పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రంలో జరిగింది. ముందు రోజే వెళ్ళి పరీక్షా కేంద్రం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు.