సేవ పేరుతో కోట్లు మాయం.. అందుకే ఐటీ రైడ్స్‌

బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగా రెడ్డి శౌరెడ్డి, అయన భార్య సునీతా రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిసా కలిసి క్రింద సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల FCRA నిధులను దారిమళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్ కం ట్యాక్స్ దృష్టిపెట్టింది.

 ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడ లోని హైదరాబాద్ కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. 

పేద కుటుంబంలో పుట్టి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన శౌరెడ్డి బాలవికాస సంస్థ ను ఏర్పాటు చేసి సేవ పేరుతో విదేశీయుల ను నమ్మించి వారి నుండి పెద్దమొత్తంలో డొనేషన్ల రూపంలో నిధులు రాబడుతూ కోట్లకు పడగనెత్తినట్లుగా ఆరోపణలున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు సంస్థ ద్వారా యాభై మిలియన్ అమెరికన్ డాల్లర్లను ( నాలుగు వందల కోట్లకు పైగా )కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎన్ని వందలకోట్లు దారి మళ్ళించాడనే విషయం తేలాల్సి ఉంది.

గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకల దాడి.. ఆవరణలో పాములు, కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు

దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌ దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొరికి గాయాలపాలు చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ D బ్లాక్‌లో వెంటిలేటర్స్ నుంచి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు ముగ్గురు విద్యార్థుల కాళ్ళు, చేతులు కొరికాయి. చెత్తాచెదారంతో పాటు ఆహార పదార్థాలు పోగవడంతో ఎలుకలు, తేళ్లు, పాములు హాస్టళ్ల ఆవరణలో తిష్ట వేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తో పాటు,న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్‌, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి ఎనిమిది హాస్టళ్లు ఉన్నాయి.. ఇందులో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఎలుకల బెడదతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు విద్యార్థులు

విషపు పురుగులు, కుక్కల బెడద కూడా ఉందని గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థులు వాపోతున్నారు. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ఎన్నిసార్లు కంప్లయింట్‌ చేసినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలుకలు, విషపు పురుగుల స్వైర విహారంతో హాస్టల్‌ విద్యార్థుల బతుకు దినదినగండంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చదువుకుందామని వచ్చినవాళ్లను ఎలుకలు కొరుకుతున్నాయి. రాత్రిళ్లు పాములు భయపెడుతున్నాయి. ఇక రాత్రీపగలు తేడా లేకుండా కుక్కలు హడలెత్తిస్తున్నాయి. దేశానికి, ప్రపంచానికి మేధావులను అందించిన ఓరుగల్లు కాకతీయ వర్సిటీ హాస్టళ్లలో ఇప్పుడు హాహాకారాలు వినిపిస్తున్నాయి.

ఫుట్ బాల్ ఆడిన రేవంత్.. “కేసీఆర్ ఖేల్ ఖతం”

రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా 29వ రోజు యాత్రలో భాగంగా నగరంలోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో ఓట ఆడారు. అంతేకాదు.. యువతతో పాటు పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గోల్ కూడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అంతేకాదు.. దీనికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మీదుగా సాగుతుంది. గతంలోనూ ఏఎల్ఎం, ఎంసెట్ వంటి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో అయితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు ఉండటం వల్లే టీఎస్పీఎస్సీ ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. పోలీసులైనా ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్పీకరించాలి కదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ టీఎస్పీఎస్సీ చుట్టునే తిరుగుతున్నాయని ఆయన అన్నారు.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని మోసపోయిన ఇంటర్ స్టూడెంట్

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించబోతున్న వినయ్ హాల్ టికెట్ ను పరిశీలించిన అధికారులు.. అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లిన ఆ విద్యార్థి అసలు ఎగ్జామ్ సెంటర్ కు పరిగెత్తాడు. కానీ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షా హాలులోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో వెనుదిరిగాడు.

 ఈ ఘటన ఎన్.ఎస్.పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రంలో జరిగింది. ముందు రోజే వెళ్ళి పరీక్షా కేంద్రం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు.

మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ : ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఒత్తిడి తెస్తామని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్న ఆమె.. కేంద్రంలోనూ బీజేపీ ఫెయిలైందన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు కవిత తెలిపారు. ప్రధాని మోడీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు. మొదటగా వ్యాపార సంస్థలపై టార్గెట్ చేశారని, ఆ తర్వాత వాటిని నియంత్రించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. 

అంతకుముందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె మార్చి 16న విచారణకు హాజరుకానున్నారు. ఇక కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరు కాగా.. రామచంద్ర పిళ్లై కస్టడీ రేపటితో (మార్చి16తో) ముగియనుంది.

TS : ఈ రోజు నుంచే ఇంటర్‌ పరీక్షలు..

తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ)-2023 మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) వెల్లడించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత లోపలికి అనుమతించరు. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

అంతేకాదు… 61 సెల్ఫ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు.

మరో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య... కారణం...?

 బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్‌ చదువుతున్న పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది.

ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి.. సడెన్‌గా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. 

చదువుపై శ్రద్ద పెట్టలేకపోతున్నానని.. ఆ డిప్రెషన్‌తోనే చనిపోతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

సూసైడ్‌ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

 

నేటి బంగారం - వెండి ధరలు

నిన్న ధరలు కాస్త పెరగగా, ఈ రోజు స్వల్పంగా తగ్గాయి.

ఇక బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై రూ. 100 తగ్గి రూ. 55, 530 గా నమోదయింది. 

 అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ. 100 తగ్గి రూ. 50, 900 గా నమోదయింది. 

 వెండి ధ‌ర‌లు మాత్రం కేజీ పై రూ. 100 తగ్గి, రూ. 67, 400 గా నమోదు అయింది.

స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ బెస్ట్ : కేటీఆర్

దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో  6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే..  తెలంగాణకు చెందినవే అందులో 4 జిల్లాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్​లు పెంచామని చెప్పారు. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని పెట్టమని, మహబూబాబాద్ జిల్లా బహిరంగ సభలో కేటీఆర్ అన్నారు.

కలలో ఈ వస్తువులు కనిపిస్తే.. వారికీ అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం..

కలల శాస్త్రంలో కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కలల శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు అవి మంచి, చెడులు సంకేతాలుగా తెలుస్తోంది. అయితే ఎక్కువమంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కలలో కనిపించే కొన్ని అంశాలు ఆర్ధిక ప్రయోజనాలను సూచిస్తాయని తెలుసుకుందాం.

ఎటువంటి విషయాలు కలలలో కనిపిస్తే.. డబ్బులు లాభాలంటే.. 

ఎవరి కలలోనైనా దేవత కనిపిస్తే, త్వరలో వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం, దేవుళ్ళు, దేవతలను కలలో చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇటువంటి కలలు మీ జీవితంలో త్వరలో ఆనందం రాబోతుందని ముందుగా చూస్తున్నాయని అర్ధం.

ఎవరైనా తమ కలలో వివాహిత స్త్రీ నృత్యం చేయడాన్ని చూస్తే, మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని సంకేతం.

కలలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే, అటువంటి వారికీ త్వరలో డబ్బు వస్తుందని సూచన.

కదంబ చెట్టు కలలో కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం.. ఎవరి కలలో కదం చెట్టును చూస్తే వారు త్వరలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

ఏ వ్యక్తి కలలో ఆవు పాలు పితుకుతున్నట్లు కనిపిస్తే, అది శుభసూచకంగా.. ప్రయోజనాలను పొందే సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.

కలలో తామర పువ్వు , జామ చెట్టు కనిపిస్తే.. ఈ కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల ఇంటికి వచ్చే ఆనందం , శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)