రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త

ఏపీ రేషన్ కార్డుదారులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి బల వర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటన చేశారు.

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖ జిల్లాలలోని మున్సిపాలిటీలలో రెండు కిలోల గోధుమపిండిని అందిస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. ఆ తర్వాత త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. వచ్చే రెండు నెలల్లో జొన్నలు మరియు రాగులు రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నాగేశ్వరరావు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.

పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యాలయం వద్ద అర్ధరాత్రి పూట బ్యానర్లు తొలగించడం పై మండిపడ్డ ఇంఛార్జి పోతిన మహేష్

జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్

అర్థరాత్రి పూట కుట్రపూరితంగా బ్యానర్లు తొలగించడం దుర్మార్గం

మా కార్యాలయం దగ్గర బ్యానర్లు, హోర్డింగులు కట్టుకుంటే ఎందుకు తొలగించారో సిపి సమాధానం చెప్పాలి

ప్రజా సమస్యలు పై పోరాటం చేస్తున్న మాపై కక్షసాధింపు చెయ్యాలని చూస్తున్నారు

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన కి భయపడుతున్నాడు 

వాళ్లకి అక్రమ నిర్మాణాలు తొలగించడం చేతకాదు 

మాది గాంధేయ మార్గం...మళ్ళీ బ్యానర్లు కడతాం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలలో టెండర్లలో సుమారు 600 కోట్లు అవినీతి జరిగిందని చెప్పగానే టెండర్ల రూల్స్ మార్చారు

కాపు మంత్రికి అగౌరవం జరిగిన సంగతి బయటపెట్టాను

అన్ని విషయాలలో భంగపడ్డ వెల్లంపల్లి తట్టుకోలేకే బ్యానర్లు తొలగించాడు

ఇలాంటి చర్యలకు మేము భయపడం..

ఇక్కడ పాగా వేసేది జనసేన పార్టీనే.. అందులో సందేహం లేదు

టీడీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా !

బ్రేకింగ్ న్యూస్...

త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న రాధా... సుమారు 20000 మంది అభిమానులతో చేరుతున్నారు...

AP మూడవ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ (రిటైర్డ్) నజీర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జస్టిస్ (రిటైర్డ్) నజీర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మూడవ గవర్నర్. ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మొదటి గవర్నర్‌గా పనిచేశారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24, 2019న రెండవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నేడు ఏపీకి నూతన గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు నజీర్‌.

అయితే.. నిన్న రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఆయన రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో విశ్వభూషణ్‌కు సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు.

టిడిపి తీర్థం పుచ్చుకోనున్న కన్నా లక్ష్మీనారాయణ

నేడు టిడిపిలో కన్నా లక్ష్మీనారాయణ చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2: 45 నిమిషాలకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు.

కన్నా టిడిపిలో చేరనున్న నేపథ్యంలో గుంటూరు నుండి మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం వరకు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు టిడిపి శ్రేణులు. 5000 మంది కార్యకర్తలు ముఖ్య నాయకులతో టిడిపిలో చేరనున్నారు కన్నా లక్ష్మీనారాయణ. కాగా, నాలుగు రోజుల కిందటే, బీజేపీ పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం తీరు నచ్చకపోవడంతో..  టీడీపీ పార్టీలో చేరుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ.

వివేకా హత్య కేసు నిందితులెవరో తేల్చిన సీబీఐ

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు సునీల్ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ.. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకాను సునీల్ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడన్న సీబీఐ… హత్య జరిగిన రాత్రి సునీల్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని పేర్కొంది. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని.. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని వివరించింది.

ఎంపీ టికెట్ షర్మిల లేదా విజయమ్మ లేదా తనకివ్వాలని వివేకా కోరినట్లు సీబీఐ వెల్లడించింది. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని… శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. సాక్ష్యాల ప్రకారం శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్‌ కుట్రపన్నినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారన్న సీబీఐ.. వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాష్‌రెడ్డి స్థానిక సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపింది.

అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వివేకా హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందన్న సీబీఐ…. కుట్రలో భాగంగానే గుండె, రక్తవిరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోందని పేర్కొంది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని సీబీఐ అధికారులు తెలిపారు. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని వెల్లడించారు.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేటినుంచి అందుబాటులోకి ఆర్జిత సేవా టికెట్లు.. ఎన్ని నెలలకంటే?

వచ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఆన్ లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. మార్చి, ఏప్రిల్, మేనెలలకు సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం.. నాలుగు గంటలకు విడుదల చేయనుంది. కాగా నేటి ఉదయం పదింటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ లక్కీ డీప్ నిర్వహించనున్నారు. ఈ లక్కీ డీప్ లో టికెట్లు పొందిన భక్తులు నిర్దేశిత రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలున్నాయి.

ఇదిలా ఉంటే.. తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తెస్తోంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది టీటీడీ. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తేనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు అధికారులు. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే.. టికెట్ బుక్‌ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్‌ ఓపెన్‌ అవుతాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.

ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

ఏపీ నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం నిన్న ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ హాజరై గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఉద్వేగ భరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలాగే గవర్నర్, సీఎం జగన్ ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీన గవర్నర్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు రాజ్ భవన్ వర్గాల వారు. ఇవాళ ఏపీకి రానున్నారు అబ్ధుల్ నజీర్. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం.

ఇక సుప్రీం న్యాయమూర్తిగా నజీర్ ట్రాక్ రికార్డులు పరిశీలిస్తే.. ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య- బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనార్టీ న్యాయమూర్తి.

వ్యభిచార గృహాన్ని నిర్వహించిన మహిళా ఎస్ఐ తల్లి – తమ్ముడు… ఎక్కడ?

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఓ మహిళా ఎస్‌ఐకు చెందిన తల్లి, తమ్ముడు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే, ఈ వ్యభిచార గృహ నిర్వహణం, తల్లి, సోదరుడుతో ఆ మహిళా ఎస్ఐకు సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. ఆ మహిళా ఎస్ఐ వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరికి దూరంగా ఉంటున్నారు. 

స్థానిక పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా కేంద్రంలోని ముత్యాలరెడ్డి సమీపంలోని ధనలక్ష్మి నగర్‌లో ఓ ఇంటిలో వ్యభిచారం సాగుతున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు ఆ ఇంటిపై ఆదివారం రాత్రి దాడి చేశారు. ఇందులో మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న యువతులను ప్రభుత్వం హోంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నూలుకు చెందిన ఈ తల్లి కుమారుడు మూడు నెలల క్రితం ధనలక్ష్మి నగర్‌కు మకాం మార్చి ఈ వ్యభిచారి గృహాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డికి శ్రీశైలం ఈవో పాదాభివందనంపై విమర్శలు

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్నారు. కృష్ణదేవరాయ గోపురం వద్దకు రాగానే ఈవో లవన్న మంత్రికి పూలమాల వేసి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. పూలమాలను మంత్రి సున్నితంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఈవో మంత్రి పాదాలకు నమస్కరించారు.

శివదీక్షలో ఉన్న ఈవో లవన్న మంత్రికి ఏ విధంగా పాదాభివందనం చేస్తారని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది వివాదాస్పదం కావడంతో ఈ విషయమై సాయంత్రం ఈవో లవన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, తనదీ ఒకే మండలం అని తెలిపారు. మంత్రి 75 సార్లు అయ్యప్ప, శివదీక్షలు చేపట్టారని పేర్కొన్నారు. తాను కూడా 17 సార్లు అయ్యప్ప మాల ధరించినట్లు ఈవో చెప్పారు. ఈ కారణంగానే మంత్రి పెద్దిరెడ్డిని గురుస్వామిగా భావించి పాదాభివందనం చేసినట్లు వెల్లడించారు. పాదాభివందనం చేసిన ప్రదేశం కూడా కృష్ణదేవరాయ గోపురం వెలుపల ఉందని తెలిపారు.