ఈ నెల 12న సంగారెడ్డికి అమిత్‌షా

బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

ఇందుకోసం 11వ తేదీన హైదరాబాద్ వచ్చి… ఓ అధికారిక కార్యక్రమానికి హాజరుకానున్నారు అమిత్ షా. 12వ తేదీన సంగారెడ్డి లో జరిగే మేధావుల సమావేశం కోసం ఏకంగా రెండు వేల మంది వచ్చేలా బిజెపి ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఈ మేధావుల సభ హైదరాబాదులో జరగాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం లో సంగారెడ్డికి తరలించారు.

ఇంకా విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్యం.. ఎక్మో సపోర్ట్ తో చికిత్స

కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. వైద్య విద్యార్థిని కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం లేదన్న ఆయన.. ఆర్​ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం ప్రీతి చికిత్సను పర్యవేక్షిస్తుందని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు.

ఆమె బీపీ, షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని… ఎక్మో సపోర్ట్​తో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే చివరి ప్రయత్నం అని వైద్యులు వెల్లడించారని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. వైద్యులు ఆమెకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారన్నారు.

మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యప్తు చేసి నివేదికను డీఎంఈ రమేష్ కు అందిస్తామని తెలిపారు.

TS : కుక్క కాటు నియంత్రణపై 13 పాయింట్స్‭తో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ...

అంబర్ పేట కుక్క కాటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 పాయింట్స్‭తో.. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కుక్కలకు స్టెరాలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. నగరవ్యాప్తంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. కుక్క కాటు ఘటనలను నియంత్రించాలని చెప్పింది. GHMC హెల్ప్ లైన్ నెంబర్లు 040– 21111111 కు కాల్ చేసి నగరవాసులు కుక్కల సమాచారం గురించి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. మాంసం విక్రయ దుకాణాలు, హోటల్స్ నుంచి వేసే వ్యర్థాలను రోడ్ల పై వేయవద్దని సూచించింది. 

కుక్కల స్వభావంపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే.. నగరంలోని అన్ని పాఠశాలల్లో వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం తెలిపింది. కాలనీ సంఘాలు, బస్తీల్లో వీధి కుక్కలతో జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పేర్కొంది. శానిటేషన్ సిబ్బంది అయా ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక మూసీ పరివాహక, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే కుక్కలకు సైతం ఆపరేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని.. కుక్క కాటు బాధితులకు వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరిగా.. వీధి కుక్కల కోసం జనాలకు దూరంగా నీటి కుండీలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం సూచించింది.

విద్యుత్ బిల్లు కట్టలేదా... అంటూ మెసేజ్ లింక్ లతో ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు...

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు, షాపింగ్‌ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఇక సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు.

 జనాలను సైబర్‌ నేరాల గురించి ఎంత పోలీసులు అవగాహన కల్పించినా సరే... ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా కరెంట్‌ బిల్లు పేరు చెప్పి ఖాతా ఖాళీ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఈఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి కి చెందిన రాజేశ్వర్ కు సైబర్ నేరగాళ్లు కాల్ చేయగా... కాల్‌ లిప్ట్‌ చేసిన రాజేశ్వర్‌ కు 3 మూడు నెలల నుంచి కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ బాధితునికి ఫోన్ లో మాట్లాడాడు. విద్యుత్ కనెక్షన్ బిల్లు సవరణ కాలేదని సైబర్ కేటుగాళ్లు రాజేశ్వర్‌ కు బెదిరించాడు. మీకు ఒక లింక్‌ పంపిస్తాము దాన్ని క్లిక్‌ చేయాలని సూచించారు. బాధితుడు నిజంగానే కరెంట్ బిల్లు కట్టలేదా? ఇంకా ప్రశ్నించికుంటున్న సమయంలోనే బాధితుడు రాజేశ్వర్‌కు కేటుగాళ్లు సెల్ ఫోన్ కు లింకు పంపించారు. 

దీంతో రాజేశ్వర్‌ ఆ లింక్ ను ఓపెన్ చేశాడు అంతే క్షణంలోనే రాజేశ్వర్‌ ఖాతాలో నుంచి రూ. 49 వేలు కట్‌ అయ్యాయి. కంగుతిన్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదుపై ఫ్రీజింగ్ విధించినట్లు తెలిపారు. ఇది మరో తరహా కొత్తరకం మోసమని పేర్కొ్న్నారు.

 సాధారణంగా కరెంట్‌ బిల్లు కట్టకపోతే విద్యుత్‌ సిబ్బంది ఫోన్‌ చేసి బిల్లు కట్టమని అడగరని స్పష్టం చేశారు. వారు డైరెక్ట్‌ గా ఇంటికే వచ్చి అడగడమో, లేదంటే స్థానిక లైన్‌మెన్‌ వచ్చి బిల్ల కట్టమని అడగడం చేస్తాడని తెలిపారు. అలా కాకుండా కరెంట్‌ బిల్లు కట్టమని ఒకవేశ ఎవరైనా ఫోన్‌ చేశారంటే అది ఖచ్చితంగా మోసగాళ్లే అయ్యి ఉంటారని తెలిపారు. ఈవిషయం తెలియకపోతే సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోవడం పక్కా అంటున్న పోలీసులు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌... అప్రమత్తమైన అధికారులు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఎవరో బెదిరింపు కాల్‌ చేశారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెదిరింపు కాల్‌ రావడంతో రైల్వే రక్షక దళ, జీఆర్‌పీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిల వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. ట్రైన్‌లో బాంబు ఉందని తెలియడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబు లేదని తేలడంతో బళ్లారి ఎక్స్‌ప్రెస్‌ బయలు దేరింది.

‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ పై ప్రశంసల జల్లు కురిపించిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తన బ్లాగ్ ‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ సాధిస్తున్న విజయాలను గురించి ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోందని అన్నారు. దేశం పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ సాధించిన అద్బుతమైన పురోగతికి మించిన రుజువు లేదని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని, పెద్ద సవాళ్లను ఎదుర్కొనగలదని నిరూపించిందని అన్నారు. దేశంలో పోలియో నిర్మూలించింది, హెచ్‌ఐవి వ్యాప్తిని తగ్గించింది, పేదరికాన్ని తగ్గించింది, శిశు మరణాలను తగ్గించింది, పారిశుద్ధ్యం మరియు ఆర్థిక సేవలకు సౌకర్యాలను పెంచిందని ప్రస్తావించారు. భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ప్రాణాంతక డయేరియా కేసులకు కారణం అయ్యే వైరస్ ను నిరోధించడానికి రోటా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రతీ బిడ్డకు చేరేలా చేసిందని అన్నారు.

భారతదేశం నిపుణులు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ పంపిణీ చేసే మార్గాలను రూపొందించిందని, 2021 నాటికి 83 శాతం మంది ఏడాది వయస్సు ఉణ్న పిల్లలకు రోటా వైరస్ టీకాలు వేసిందని అన్నారు. ఈ తక్కువ ధర వ్యాక్సిన్ ను ప్రపంచంలో అన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయని తెలిపారు. పూసాలోని భారతదేశం యొక్క ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల్లో గేట్స్ ఫౌండేషన్, భారత ప్రభుత్వ రంగ సంస్థలతో చేతులు కలిపిందని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాలను గేట్స్ ప్రస్తావించారు.

వచ్చే వారం ఇండియాకు వస్తున్నట్లు గేట్స్ తన బ్లాగులో తెలియజేశారు. రిమోట్ అగ్రికల్చర్ కమ్యూనిటీలలో వ్యర్థాలను, జీవ ఇంధనాలుగా, ఎరువులుగా మర్చడానికి బ్రేక్ త్రూ ఎనర్జీ ఫెల్, విద్యుత్ మోహన్ ఆయన టీం చేస్తున్న పరిశోధనలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. భూమిపై ఉన్న ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా పరిమిత వనరులను కలిగి ఉందని, అయినప్పటికీ సవాళ్లను అధిగమించిన ఎలా పురోగతి సాధించగలదో భారత్ చేసి చూపించిందని అన్నారు.

వైభవంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు...

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది యాదాద్రి పుణ్యక్షేత్రం. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ రెండోరోజు ధ్వజారోహణ పూజలు జరిగాయి. నయన మనోహరంగా రాగతాళ ధ్వనులతో కార్యక్రమాలు సాగాయి. స్వామివారి ఆస్థానం నుంచి ధ్వజ పటాన్ని ఊరేగిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు.

దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు. ఆ గరుడ ముద్దలను అందుకోవడానికి పోటీపడ్డారు భక్తులు. అనంతరం రాత్రికి భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారి కల్యాణం వీక్షించాలంటూ 33 కోట్ల దేవతలకు ఆహ్వానం పలికారు.

పదకొండు రోజులపాటు సాగే బ్రహ్మోత్సవాలు మూడోరోజు అంటే ఇవాళ స్వామివారికి అలంకార, వాహన సేవలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మత్సాయవతార సేవ, వేద పారాయణం జరుగుతాయి. రాత్రికి శేష వాహనంపై విహరిస్తారు లక్ష్మీనర్సింహస్వామి. మార్చి మూడో తేదీన జరిగే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మాత్సవాలతో పరిసమాప్తమవుతాయి.

థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు..!!

జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా ఈరోజుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతున్నాయి. వాటిలో ఒకటి థైరాయిడ్. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో గొంతు వద్ద ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‎ను రిలీజ్ చేయడం ద్వారా శరీరంలో అనేక మెటబాలిక్ ప్రాసెస్‎లను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనట్లయితే థైరాయిడ్ సమస్య వస్తుంది. సాధారణంగా థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువ పనిచేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అని అంటారు.

అయితే థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడు శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేస్తుంది. జీవక్రియ పనితీరు కూడా బాగుంటుంది. థైరాయిడ్ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు ఇబ్బుందు ఎదుర్కొవల్సి వస్తుంది. బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్దకం, సంతానలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.

ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరండా ఉండండి:

మైక్రోవేబ్ డిన్నర్లు, పిజ్జాలు, డోనట్స్ వంటి పదార్థాలు అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారా జాబితాలో ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. ఇవి థైరాయిడ్ వ్యాధి ఉన్నవారిపై నేరుగా ప్రభావం చూపుతాయి. తాజా పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు, ప్రాసెస్ చేయని ఆహారాలను అలవాటు చేసుకోవడం మంచిది. కొన్ని ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలు కూడా క్యాన్సర్ కు కారణం అవుతాయి. అవసరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న ఆహారాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి మంచివి. అయితే, డీప్ ఫ్రైడ్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ట్రాన్స్ లేదా ఇతర ఇన్ఫ్లమేటరీ కొవ్వులు థైరాయిడ్ గ్రంధి, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు అధికంగా తీసుకోవడం తగ్గించండి:

ఒక కొత్త అధ్యయనం ప్రకారం, భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల ఉప్పును తీసుకుంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మొత్తం కంటే రెట్టింపు. థైరాయిడ్ గ్రంధి అయోడిన్‌ను థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు ఉపయోగిస్తుంది. థైరాయిడ్ పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి, అధిక అయోడిన్ లేదా అయోడిన్ లోపం థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. ఇది వివిధ థైరాయిడ్ రుగ్మతలు లేదా థైరాయిడ్ విస్తరణకు దారితీస్తుంది.

స్వీట్లు తినకూడదు:

థైరాయిడ్ వ్యాధి ఉన్న వ్యక్తులు స్వీట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ వ్యాధి టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతుంది. దాని ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు శీతల పానీయాలు, కేకులు, ఐస్ క్రీములు, ఇతర కృత్రిమ స్వీటెనర్‌లతో సహా మీరు తీసుకునే ఆహారంలో అధికంగా చక్కర ఉండకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.

గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాలి:

గోధుమలలో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్ చిన్న ప్రేగులను చికాకుపెడుతుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన వివిధ పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది గట్‌లో మంటను పెంచుతుంది. ఇది క్రియారహిత థైరాయిడ్ హార్మోన్‌లను క్రియాశీల హార్మోన్‌లుగా మార్చడాన్ని ప్రభావితం చేస్తుంది. ఆటో-ఇమ్యూన్ థైరాయిడ్ రుగ్మతలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అధికంగా ఆహారం తీసుకోకూడదు:

కొంతమంది అధికంగా తింటుంటారు. అలా తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయి పెరుగుతుంది. ఇది ఆహార ఒత్తిడికి కారణం అవుతుంది. అందుకే అతిగా తినడం తగ్గించాలి.

రాత్రిపూట ఆహారం తినడం మానుకోండి:

రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేయడానికి ప్రయత్నించండి.మీరు అల్పాహారం తినడానికి ముందు 10 నుండి 12 గంటల విరామం తీసుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం అడ్రినల్, గ్రోత్ హార్మోన్లు, థైరాయిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ నిల్వ ఉన్న కొవ్వు నుండి శక్తిని తీసుకుంటుంది. మీరు నిద్రిస్తున్న సమయంలో కొవ్వు బర్న్ అవుతుంది.

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఫ్రెండ్ బర్త్ ​డేకు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం

స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసమని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. దీంతో అదృశ్యమైన ఓ బాలిక, ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుమలగిరి ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులైన అసీనా, అఖీనా అనే ఇద్దరు యువతులతో కలిసి నిన్న సాయంత్రం బయటకు వెళ్లింది. రాత్రి అయినప్పటికీ వారి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది.

దీంతో కుటుంబసభ్యులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి కోసం సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.

వందేండ్లు బతికినోళ్ల జీన్​తో గుండె ఏజ్​ పదేండ్లు వెనక్కి

చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే ప్రొటీన్లు

అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి సైంటిస్టులు

మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాల లైఫ్​ టైం పెంచే ప్రొటీన్​

హార్ట్​ ఎటాక్​ వచ్చినప్పుడు మన గుండె కండరాల్లోని కార్డియో మయోసైట్స్​ అనే కణాలు డ్యామేజ్​ అవుతాయి. ఇలా దెబ్బతినే గుండె కణాలు మళ్లీ రికవర్​ కావడం అసాధ్యం. జీబ్రా ఫిష్​ వంటి వాటిలోనైతే హార్ట్​ ఎటాక్​ వల్ల దెబ్బతిన్న గుండె కణాల స్థానంలో కొత్తవి 20% రెండు నెలల్లోపే మళ్లీ ఉత్పత్తి అవుతాయి. మనుషుల్లో మాత్రం దెబ్బతిన్న గుండె కణాలను కొత్తవి రీప్లేస్​ చేయవు. ఇక గుండె మార్పిడి చేసుకుందామన్నా .. అది చాలా కష్టం. ఒకవేళ అది చేసుకున్నా.. అమర్చిన గుండె ఎలా పనిచేస్తుందో చెప్పలేం. ఈనేపథ్యంలో శాస్త్రవేత్తల ముందున్న ఏకైక మార్గం.. మనిషి శరీర కణాలను గుండె కణాలుగా మార్చడం. వాటిని వినియోగించి దెబ్బతిన్న గుండెకు పూర్వపు శక్తిని అందించడం !! ఈ దిశగా ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల వివరాలతో కథనమిది. 

మన చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే సరికొత్త పద్ధతిని అస్సాంలోని ఇండియన్​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ – గౌహతి (ఐఐటీ–జీ) పరిశోధకులు కనుగొన్నారు. 6 ప్రొటీన్లతో కూడిన ‘రీకాంబినంట్​ ప్రొటీన్​ టూల్​ బాక్స్’ ను వారు అభివృద్ధి చేశారు. ఇవి ఆరు కూడా రీకాంబినంట్​ డీఎన్ఏ టెక్నాలజీతో తయారుచేసిన రీకాంబినంట్​ ప్రొటీన్లు. మనిషి చర్మ కణాల్లోకి ఈ ప్రొటీన్లను ప్రవేశపెట్టి.. వాటికి గుండె కణాల లక్షణాలు వచ్చేలా చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మ కణాల్లోకి 6 ప్రొటీన్లు వెళ్లి వాటి డీఎన్ఏను రీ వైరింగ్​ చేస్తాయి. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా, గుండె కణాలుగా మారేందుకు అనువుగా ఉండేలా చర్మ కణాల లోపల మార్పులు, చేర్పులు చేస్తాయి.  

మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలకు ఎనర్జీ

మస్క్యులర్ డిస్ట్రోఫీ అరుదైన వ్యాధి. దీని బారిన పడిన వారు నడవలేరు. కొంతమందికి పుట్టుకతోనే ఈ ప్రాబ్లమ్​ వస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న ప్రతి 5వేల మంది పిల్లల్లో ఒకరు డ్యూచెన్​ మస్క్యులర్​ డిస్ట్రోఫీ సమస్యతో బాధపడుతున్నారు. శరీర కండరాలు సంకోచ, వ్యాకోచాలకు గురైనప్పుడు గాయాలు కాకుండా రక్షణ కల్పించే ప్రొటీన్లలో ‘డిస్ట్రోఫిన్’​ ఒకటి. ఇది లోపించిన వారికి మస్క్యులర్​ డిస్ట్రోఫీ సమస్య వస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనం అవుతాయి. చివరకు గుండె సమస్యలతో ఈ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోతుంటారు. వారి ఆయుష్షును పెంచే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్​ ఫర్డ్​ మెడిసిన్​ సంస్థ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్​లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మస్క్యులర్​ డిస్ట్రోఫీ రోగుల నుంచి సేకరించిన గుండె కణాలపై ప్రయోగాలు చేశారు. మనుషుల క్రోమోజోమ్​ల చివరన టెలోమెర్స్ ఉంటాయి. శరీరంలో కణాల విభజనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కణాల విభజన జరిగే కొద్దీ.. టెలోమెర్స్ బలహీనపడి సైజులో తగ్గిపోతూ మనిషిలో ముసలితనానికి దారితీస్తుంది. టెలోమెర్స్ అంచుల్లో ఉండి.. వాటిని రక్షించే ఒక ప్రోటీన్​ పేరు ‘టీఆర్ఎఫ్​2’. ఇప్పుడు దీనితోనే మస్క్యులర్​ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలను సైంటిస్టులు బూస్ట్​ చేశారు. వాటి జీవితకాలాన్ని పెంచి, పనితీరును మెరుగుపర్చారు. 

హార్ట్ ఎటాక్ 

  ఏటా ప్రపంచంలో ఎక్కువమంది దీనివల్లే చనిపోతున్నారు

  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు1.79 కోట్ల మంది హార్ట్​ ఎటాక్​తో ప్రాణాలు విడుస్తున్నారు.

  ప్రపంచంలోని హృద్రోగుల్లో 60 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. 

  గత నాలుగేళ్లుగా మన దేశంలో ఏటా సగటున 28వేల మంది హార్ట్​ఎటాక్​ తో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది దీనివల్ల చనిపోయిన ఇండియన్స్ లో 70 శాతం (19వేల) మంది 30 నుంచి 60 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. 

 ఈవిధంగా భారీగా మరణాలకు కారణమవుతున్న హార్ట్​ ఎటాక్​ సమస్యపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. హార్ట్​ ఎటాక్​ ముప్పు నుంచి 

బయటపడేసే మార్గం కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతోంది.

వందేళ్ల వారి జీన్​తో..

గుండె వయసును తగ్గించగలిగితే.. మనిషి జీవితకాలం దానంతట అదే పెరిగిపోతుంది. ఇంగ్లండ్​లోని బ్రిస్టల్​ యూనివర్సిటీ, ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్​ సైంటిస్టులు కలిసి ఈ దిశగా జరిపిన పరిశోధనల్లో ముందడుగు పడింది. దాదాపు వందేళ్లు వయసు కలిగిన కొంతమంది నుంచి సేకరించిన ఒక జీన్​తో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. నడి వయసు, పెద్ద వయసులకు చెందిన ఎలుకల్లోకి బీపీఐఎఫ్​బీ4 అనే జీన్​ను ప్రవేశపెట్టగా.. చాలా కాలంపాటు వాటి గుండె ఆరోగ్యంలో ఎలాంటి క్షీణత రాలేదని, హార్ట్​ ఎటాక్​ వంటివి సంభవించలేదని సైంటిస్టులు గుర్తించారు. ఈ జీన్​ ఎలుకల శరీరం లోపలికి వెళ్లి గుండె బయొలాజికల్​ క్లాక్​ వయసును దాదాపు పదేళ్లు తగ్గిస్తోందని వెల్లడించారు. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రయోగంలో భాగంగా ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్​ సైంటిస్టులు ఈ జీన్​ ను టెస్ట్​ ట్యూబ్​ లోని మనుషుల గుండె కణాల్లోకి ప్రవేశపెట్టారు. హృద్రోగాలతో బాధపడుతున్న వృద్ధులు, ఆరోగ్యంగా ఉన్న వృద్ధుల నుంచి సేకరించి గుండెకణాలను ఈ ప్రయోగం కోసం వాడారు. ప్రవేశపెట్టిన జీన్స్​ ప్రభావంతో హృద్రోగాలు కలిగిన వృద్ధుల గుండె కణాల పనితీరు మునుపటి కంటే మెరుగుపడినట్లు తేలింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘కార్డియో వాస్క్యులర్​రిసెర్చ్’ జర్నల్​లో ప్రచురితమైంది. - V6