మార్చి నుంచి అందుబాటులోకి TSRTC ఏసీ స్లీపర్‌ బస్సులు

తెలంగాణ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దూరప్రాంతాలకు వెళ్లడానికి స్లీపర్ బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తమ ప్రయాణం హాయిగా సాగేలా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు.

దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ బస్సులను నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రోడ్డు ఎక్కించింది. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరే ఏసీ స్లీపర్‌ బస్సులకూ లహరి అని నామకరణం చేసింది. బస్సులను హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నట్లు ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి బస్తీల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. శునకాల దాడి నుంచి ఆ బాలుడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు… నిజామాబాద్ జిల్లా ఇందల్‌‍వాయి మండల కేంద్రానికి చెందిన ముత్యం గంగాధర్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన ఛే నెంబర్ చౌరస్తారో ఓ కారు సర్వీస్ సెంటరులో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, భార్య జనప్రియ, 8 యేళ్ల కుమార్తె, 4 యేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. వీరంతా బాగ్ అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నారు. 

అయితే, ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటరుకు గంగాధర్ తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ఏరియాలో ఉంచి కుమారుడిని మాత్రం లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మాత్రం తన పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలో బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి అటూ ఇటూ పరుగెత్తాడు. కానీ, ఎంతకీవదలని శునకాలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. 

తమ్ముడు ఆర్తనాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రదీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

TS : నేటి నుండి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు పూర్తి... ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు.

నేటి నుండి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి.

 ఈ మేరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను 1955లో ఏపీ ఏర్పాటయ్యక 11 రోజులపాటు జరిపించారు. అంతకుమందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. మొదటగా ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. 

పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు 11 రోజులపాటు సాగే వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నామనని యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీత ప్రకటించారు. 

స్వామివారి దర్శనాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. బ్రేక్‌ దర్శనంతో పాటు ధర్మ, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయన్నారు. యాదగిరీశుడి ఉత్సవాలను గతం కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి ప్రధానాలయంతో పాటు ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుద్దీపాలతో దేవాలయం ఉత్సవ శోభను సంతరించుకున్నది. స్వామివారి సేవలను వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు. ప్రధానాలయాన్ని శుద్ధి చేసి రంగురంగుల పూలతో అలంకరించారు.

TS : మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని మెడికల్ కాలేజీలలో  మరో 295 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇప్పటికే 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 295 పోస్టుల మంజూరుతో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1,442కు చేరుకుంది. 22 విభాగాల్లో అదనపు పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 45, జనరల్‌ మెడిసిన్‌లో 33, జనరల్‌ సర్జరీలో 32, అనస్థీషియాలో 22 పోస్టులు ఉన్నాయి.

ఇప్పటికే ప్రకటించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. వారం నుంచి పదిరోజుల్లో మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఎంపిక జాబితా వెల్లడిస్తారు. నెలలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దీంతో..నేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నేడు విచారించనుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళితే చేసేదేమీ ఉండదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు.

ఈనెల 6న (ఫిబ్రవరి) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై తెర పడింది. ఈ తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో కీలకం కానుందనే నేపథ్యంలో హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సీబీఐకి అప్పగించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్‌ దవే వాదనలు వినిపించారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.. ఇక మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు.. రేపు గణపతి పూజతో ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శివ రాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర మండలం కాళేశ్వర క్షేత్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. 18 నుంచి శివరాత్రి సందర్భంగా భక్తులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. 19న సాయంకాలం 4.30 గంటలకు ఆదిముక్తీశ్వరాలయంలో జరిగే స్వామి వారి కల్యాణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివపార్వతుల కల్యాణానికి ఆహ్వానం.

కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. 18న శుభానంద ముక్తీశ్వర కల్యాణం ఆలయ ఆవరణ లోని కల్యాణ మండపంలో అర్చకులు విశేష పూజల నడుమ తంతు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు కొంతమందికి కల్యాణ మహోత్సవ ఆహ్వానాలను పంపించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గం ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్తు ఛైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచితో పాటు ఆలయ దాతలకు ఆహ్వాన పత్రికలను పంపారు.

రేపటి నుంచి కీసర గుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

రేపటి నుండి కీసర గుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 వ తేదీ నుండి 21 వరకు జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాళీ నడకన కీసర గుట్ట ఆలయ ప్రాంగణం, ఎక్సబిషన్ గ్రౌండ్ ను తిరిగి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఐదు రోజుల క్రితం కీసర గుట్ట శివరాత్రి ఏర్పాట్లను సదర్శించనని కలెక్టర్ ఈ రోజు ఏర్పాట్లపై సదర్శించి పనులు బాగా జరిగయని అన్నారు. రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోస్తవాలు ప్రారంభం కానున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఫ్లెక్స్ లు కూడా బ్యాన్ చేసామని ఆయన తెలిపారు. రెండు మూడు రోజులు ఇక్కడే ఉండే భక్తుల వాహనాలు ఆపకుండా పోలీసులుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కేసీఆర్ కొండగట్టు టూర్… 9 మంది ముందస్తు అరెస్ట్

సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు పర్యటన నేపథ్యంలో గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టుకు వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​ ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ క్యాంపస్​కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో కేసీఆర్​ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచే ఒంటిపూట బడులు !

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

మార్చి రెండోవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21 ఫలితాలు వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Health : పిల్లల ఎముకలలో బలహీనత... ఆహారంలో డైట్ లో మార్పులు తప్పనిసరి...

మానవ శరీరంలో ఎముకల గూడు. ఎముకలు లేకుంటే.. శరీరానికి ఓ ఆకారం అంటూ ఉండదు. అంతే కాకుండా అవయవాలన్నీ బ్యాలెన్సింగ్ గా ఉండటానికి ఎముకలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీనత వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి వారి ఎముకలు బలంగా మారేందుకు అవసరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఎముక ఏర్పడటానికి అత్యంత కీలకమైన సమయం చిన్నతనంలోనే కాబట్టి.. ఆ సమయంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఎముకల ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

బాల్యంలో బలమైన ఎముక అభివృద్ధి.. మంచి ఎముక ఆరోగ్యానికి పునాదిగా పని చేస్తుంది. ఎముకల అభివృద్ధికి బాల్యం అత్యంత ముఖ్యమైన కాలం. మంచి పోషకాహారం, వ్యాయామం అనేది పిల్లల ఆరోగ్యం పెంపొందించడంలో కీలక విషయాలు. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో దానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఎండలో ఉండటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు. వారానికి రెండు మూడు రోజులు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు నేరుగా సూర్యరశ్మిని పొందేలా చేయాలి.

కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరమని అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలమైన ఎముకలకు మద్దతు ఇవ్వడానికి మెగ్నీషియం కాల్షియంతో సహకరిస్తుంది. కాల్సిటోనిన్ అనే హార్మోన్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరం. ఇది ఎముకల నిర్మాణాన్ని సంరక్షించడానికి, మృదు కణజాలం రక్తం నుంచి ఎముకలకు కాల్షియంను పునరుద్ధరిస్తుంది. కాబట్టి పిల్లల ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే గోధుమలు, క్వినోవా, బాదం, వేరుశెనగ, పచ్చి ఆకు కూరలు, నల్ల చిక్కుళ్లు వంటివి చేర్చుకోవాలి.